శాన్ఫ్రాన్సిస్కో/యూఎస్ఏ (చైతన్యరథం): ఎంటర్టైన్మెంట్ సాఫ్ట్ వేర్, 3 డీ డిజైన్, ఇంజనీరింగ్ రంగాల్లో పేరెన్నికగన్న ఆటో డెస్క్ సంస్థ చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్, సీనియర్ డైరెక్టర్ అల్లిసన్ రోస్తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. రాజధాని అమరావతిలో సుమారు రూ.65వేల కోట్లకు పైగా వ్యయంతో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఎంటర్టైన్మెంట్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాం. అక్కడ ఆటో డెస్క్ సంస్థ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయాలి. ప్రపంచంలోనే మొట్టమొదటగా బీఐఎం సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్న రాజధాని నగరం అమరావతి. ఆటోడెస్క్ ఇన్ఫ్రావర్క్స్, బీఐఎం 360ని ఉపయోగించి అమరావతిలో డిజిటల్ ట్విన్ ఏర్పాటుకు సహకరించండి. అమరావతిలో ఆటో డెస్క్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్ అకాడమీని ఏర్పాటు చేయండి. దీనిద్వారా డిజిటల్ ఫ్యాబ్రికేషన్, సస్టయినబుల్ డిజైన్లో సర్టిఫైడ్ శిక్షణ, ఫ్యాకల్టీ అభివృద్ధి, పరిశోధనలకు అవకాశం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతంలో తుపానులను తట్టుకుని నిలబడేలా భవనాల నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ల రూపకల్పన కోసం ఆటోడెస్క్ సీఎఫ్డీ (కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్) సాంకేతిక సహకారాన్ని అందించాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు.
ఆటో డెస్క్ చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్ మాట్లాడుతూ… ప్రపంచవ్యాప్తంగా 35కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థకు 15 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నట్లు చెప్పారు. ప్రధానంగా సబ్స్క్రిప్షన్ ఆధారిత సాఫ్ట్ వేర్, క్లౌడ్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. యూఎస్, కెనడా, భారత్ యూరప్ ల్లో తమ సంస్థ ఆర్ అండ్ డీ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ ఏడాది నవంబర్ నాటికి ఆటో డెస్క్ సంస్థ 50 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి, 5.9 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించిందన్నారు.













