- వేగంగా అనుమతులు.. అవసరంమేరకు భూములు
- ఎర్త్ మినరల్స్‌నుంచి ఎరో స్పేస్‌వరకు ఏపీలో అవకాశాలు
- ముందుకురండి.. ఒప్పందాలు చేసుకుందాం
- భవిష్యత్ అవసరాలపై ప్రణాళికలు రూపొందిద్దాం
- బిజినెస్ ఎక్స్‌పోల నిర్వహణకు విశాఖలో ఆంధ్రా మండపం
- అరకు అందాలు చూడండి… కాఫీ రుచిని ఆస్వాదించండి
- బీహార్ రాష్ట్రంలో మళ్లీ ఎన్డీఏ గెలిచింది… అభినందనలు
- సీఐఐ సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు
విశాఖపట్నం (చైతన్య రథం): రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు ప్రభుత్వమిచ్చే ప్రొత్సాహకాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలు ఓపెన్ చేస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రొత్సాహకాలకు సావరీన్ గ్యారెంటీ ఇస్తామని వెల్లడిరచారు. విశాఖపట్నంలో శుక్రవారం రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సును భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించారు. ఈ వేదికగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు. 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ… ‘‘522మంది విదేశీ ప్రతినిధులు, 72 దేశాలనుంచి ప్రతినిధులు వచ్చారు. 2,500మంది పారిశ్రామికవేత్తలు, వివిధరంగాల ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. భారత్‌లో విశాఖ అత్యంత సుందరమైన నగరం. సుందరమైన బీచ్‌లు, కొండలు, ప్రకృతి వనరులున్న ప్రాంతం. అత్యంత సురక్షిత నగరంగా ఇటీవలే విశాఖకు రేటింగ్ వచ్చింది. భారత్‌లో పెట్టుబడులకు గేట్‌వేగా ఏపీ నిలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించటంలో భారత్ ఇప్పుడు అగ్రగామిగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంలో ఏపీలో పరిశ్రమలకు అనుమతులిస్తున్నాం. రియల్ టైమ్‌లో అనుమతులు ఇవ్వటంతోపాటు వేగంగా పరిశ్రమలు నిర్మించేలా చూస్తున్నాం. పది సూత్రాల ఆధారంగా పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు.
డ్రోన్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు
‘‘ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలను భారతీయులే నడిపిస్తున్నారు. ఏపీలో త్వరలోనే క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లకు అవసరమైన పరికరాలనూ ఉత్పత్తి చేసేలా ప్రయత్నం చేస్తున్నాం. డ్రోన్, ఎలక్ట్రానిక్, ఏరోస్పేస్, స్పేస్, సెమీ కండక్టర్స్, డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేసి రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. అలాగే గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుదుత్పాదన లక్ష్యంగా పని చేస్తున్నాం. సౌర, పవన, పంప్డ్ ఎనర్జీలతోపాటు బ్యాటరీ ఎనర్జీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాం. ఆర్ధిక వ్యవస్థలను నిర్మించటంతోపాటు సంపద సృష్టించటంలో కలసి పనిచేద్దాం. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఆర్గానిక్ ఉత్పత్తులు, పర్యాటకం ఇలా వేర్వేరు రంగాల్లో అపారమైన అవకాశాలను వినియోగించుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నాను. గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తోంది. డీప్ టెక్నాలజీ రంగంలోనూ విస్తృత అవకాశాలు ఏపీలో ఉన్నాయి. ఏరో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్రోత్సాహం అందిస్తున్నాం. త్వరలోనే భారత్‌లో అది కూడా ఏపీనుంచి డ్రోన్ ట్యాక్సీలను ప్రారంభిస్తాం. ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్ అపారంగా ఉన్నాయి. ఈ రంగంలో పెట్టుబడులకు ఆస్కారం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం, లాజిస్టిక్స్ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులకు అవకాశాలు. పోర్టులు, డ్రైపోర్టులు, అంతర్గత జలరవాణా, హెల్త్ కేర్ తదితర రంగాల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకోవచ్చు. అగ్రిటెక్, ఈవీ టెక్ లాంటి రంగాల్లో పెట్టుబడులకు కూడా విస్తృతమైన అవకాశాలను వినియోగించుకోవాలని కోరుతున్నాను’’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
పెట్టుబడులను ప్రొత్సహించేలా సంస్కరణలు… పాలసీలు
‘‘విశాఖలో వాణిజ్యపరమైన ఎగ్జిబిషన్లు, ప్రదర్శనలకు వీలుగా ఐటీపీఓ ద్వారా ‘ఆంధ్రా మండపం’ నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని హామీ ఇస్తున్నాం. భారత్ మండపం తరహాలోనే ఆంధ్రా మండపం నిర్మాణానికి స్థలం కేటాయిస్తాం. విశాఖ వచ్చినవారు అరకులాంటి ప్రాంతాలనూ సందర్శించాలి. అలాగే స్థానిక గిరిజనులు పండిస్తూ గ్లోబల్ బ్రాండ్‌గా మారిన అరకు కాఫీని, స్థానిక ఆక్వా రుచుల్ని ఆస్వాదించాలి. రాష్ట్రంలో పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి భూమి కొరత లేదు. వారికి వేగంగా భూములు కేటాయిస్తున్నాం. పెట్టుబడులకు అనుకూలమైన 25 పాలసీలు రాష్ట్రంలో అమల్లో ఉన్నాయి. అవసరమైన సంస్కరణలు తెచ్చాం. కేవలం 17 నెలల కాలంలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. 20 లక్షల ఉద్యోగాలూ దక్కుతాయి. ప్రస్తుతం 0.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు 50 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా ఏపీ పనిచేస్తుంది. వచ్చే పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షిస్తామనే విశ్వాసం మాకుంది. హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఏపీని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. సదస్సు కేవలం పెట్టుబడులు, వాణిజ్య, వ్యాపారం, ఒప్పందాల కోసం మాత్రమే కాదు. మేథోపరమైన ఆవిష్కరణలపైనా చర్చలు జరగాలి’’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
బిహార్‌లో ఎన్డీయే గెలుపు.. మోదీపై నమ్మకానికి నిదర్శనం ‘‘ప్రస్తుతం బిహార్‌లో ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏకు ప్రజలు పట్టంగట్టారు. వారికి అభినందనలు. ప్రధాని మోదీపై ప్రజలు పూర్తిస్థాయిలో నమ్మకముంచారు. బిహార్ ప్రజలు అభివృద్ధికి పట్టంగట్టారు. అందుకే ఎన్డీయేక మళ్లీ అవకాశమిచ్చారు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.













