- గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి
- ప్రకాశం జిల్లాలో 15 వేల ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం
- చెత్తపై పన్ను వేసిన వైసీపీని ప్రజలు చెత్తలో కలిపారు
- మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి
కొండపి (చైతన్యరథం): పరిసరాల పరిశుభ్రత ప్రజలందరి బాధ్యత అని గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం నాడు ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని జాళ్లపాలెం గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా స్థానికులు, విద్యార్థులతో కలిసి నిర్వహించిన అవగాహన ర్యాలీలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా చీపురు పట్టి మంత్రి, కలెక్టర్ పరిసరాలు శుభ్రం చేశారు. అనంతరం ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ….గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
చెత్త పై పన్ను వేసిన వైసీపీని ప్రజలు చెత్తలో కలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు కూడా ప్రజలందరూ ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా ప్రజల్లో అవగాహన పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ఇంకుడుగుంతల నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో వివిధ అవసరాలకు వినియోగించిన నీటిని డ్రైనేజీలలోకి, రోడ్లపైకి వదలకుండా ఇంకుడు గుంతలు తవ్వుకొని వాటిలోకి మళ్ళిస్తే భూగర్భ నీటిమట్టం పెరుగుతుందని మంత్రి చెప్పారు. తద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉండడంతోపాటు రోగాలను నివారించవచ్చని అన్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఇంకుడు గుంతలను నిర్మించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ క్రమంలో మన జిల్లాలో కూడా సుమారు 15 వేల ఇంకుడు గుంతలను నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు.
జాళ్లపాలెం గ్రామంలో 150 ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామం స్వచ్ఛంగా ఉండటం ద్వారా మొత్తం ప్రకాశం జిల్లా కూడా స్వచ్ఛంగా ఉంటుందన్నారు. ఈ దిశగా ప్రజలందరూ తమ వంతు బాధ్యతను నిర్వహించాలని మంత్రి పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని స్వచ్చ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతీనెలలో మూడో శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెలలో ఇంకుడు గుంటలు తవ్వే కార్యక్రామాన్ని చేపట్టినట్లు మంత్రి తెలిపారు. అలాగే అర్బన్ ప్రాంతాలలో కూడా చెత్తను సేకరించి చెత్తనుండి సంపద సృస్టించడం, చెత్త నుంచి విద్యుత్ తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు.