- సృజనాత్మకతతో కూడిన విద్య ప్రభుత్వ లక్ష్యం
- కేజీ టు పీజీ విద్యా కరిక్యులంలో సమూల మార్పులు
- దేశంలోనే అత్యుత్తమంగా ఏపీ విద్యారంగాన్ని తీర్చిదిద్దుతాం
- విద్య, ఐటీశాఖల మంత్రి లోకేష్ ఉద్ఘాటన
- విద్యానైపుణ్యాల పెంపుదలకు సింఘానియా ట్రస్ట్‌తో ఒప్పందం
- మంత్రి లోకేష్ సమక్షంలో సింఘానియా గ్రూప్ ఎంఓయు
అమరావతి (చైతన్యరథం): ఏపీ విద్యారంగాన్ని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చి దిద్దటమే తమ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. ఈ మేరకు జాతీయ విద్యావిధానం లక్ష్యసాధనలో భాగంగా రాష్ట్రంలో విద్యానైపుణ్యాల అభివృద్ధి చేసేందుకు సులోచనాదేవి సింఘానియా స్కూల్ ట్రస్ట్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లి నివాసంలో మంగళవారం సింఘానియా గ్రూప్ (రేమండ్స్), ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల నడుమ అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా తొలుత ట్రస్ట్ ఆధ్వర్యాన తిరుపతి జిల్లాలోని 14 పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు, బోధనలో నాణ్యత, ఉపాధ్యాయ శిక్షణ, స్పోకెన్ ఇంగీష్ శిక్షణ, జాతీయ విద్యావిధానంతో సమాంతరంగా సాంకేతికత అనుసంధానం వంటి అంశాల్లో విద్యా నైపుణ్యాన్ని తీసుకురావడం ద్వారా పాఠశాలల నిర్వహణలో మార్పులు తేవాలని నిర్ణయించారు. ఐదేళ్ల వ్యవధిలో అమలుచేసే ఈ కార్యక్రమం ద్వారా లక్ష మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుంది. ఆ తర్వాత అమరావతి, విశాఖపట్నం, కాకినాడకు కూడా ట్రస్ట్ సేవలను విస్తరిస్తారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఏపీలో విద్యారంగాన్ని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు అమలుచేస్తున్న మూస పద్ధతులకు స్వస్తిచెప్పి సృజనాత్మకత పెంపొందించేలా కేజీ టు పీజీ విద్య కరిక్యులమ్‌లో సమూల మార్పులు తెస్తున్నామని చెప్పారు. కళాశాల నుంచి బయటకు వచ్చే విద్యార్థికి వెనువెంటనే ఉద్యోగం లభించేలా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
విద్యలో నాణ్యత పెంపు లక్ష్యం
సింఘానియా గ్రూప్ చైర్మన్ గౌతమ్ హరి సింఘానియా మాట్లాడుతూ…విద్యార్థులను ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్యవంతంగా తయారు చేయడమే తమ లక్ష్యమన్నారు. పిల్లలకు మరింత ప్రభావవంతమైన, ఆకర్షణీయమైన అభ్యసన విధానాల్లో బోధన చేసేందుకు వీలుగా ఉపాధ్యాయుల సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు విజయవాడ, వైజాగ్, అమరావతిలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. పాఠ్యాంశాల్లో సాంకేతికతను సమగ్రపరచడం, ఆంగ్లంలో విద్యార్థుల కమ్యూనికేషన్ నైపుణ్యాలను బలోపేతం చేయడం ద్వారా విద్యలో నాణ్యతను పెంచడం ఈ సహకారం లక్ష్యం. ఉపాధ్యాయులను ఆధునిక సాంకేతికతతో సన్నద్ధం చేయడంతోపాటు డిజిటల్ సాధనాలను ఉపయోగించేలా శిక్షణ ఇస్తాం. ఆంగ్ల భాషా ప్రావీణ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలకు అవసరమైన అవసరమైన నైపుణ్యాలు కలిగిన విద్యార్థులు తయారవుతారన్నారు.
ప్రపంచంలోని ఉత్తమ విధానాలు తెస్తాం
సింఘానియా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరక్టర్ రేవతి శ్రీనివాసన్ మాట్లాడుతూ…విద్య ప్రగతికి పునాది అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా స్థానిక తరగతి గదులకు ప్రపంచంలోని ఉత్తమ పద్ధతులను పరిచయం చేయడమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉపాధ్యాయుల శిక్షణ, సాంకేతికతతో కూడిన అభ్యాసం, ఆంగ్ల ప్రావీణ్యంపై దృష్టి సారించాం. విద్యార్థులను విద్యాపరంగా సుసంపన్నం చేయడమే కాకుండా భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నైపుణ్యవంతమైన విద్యను పొందేలా చేస్తాం. ఈ భాగస్వామ్యం అకడమిక్ ఎక్సలెన్స్, సమగ్ర అభివృద్ధిని పెంపొందించడానికి దోహద పడుతుంది. రాబోయే 5 సంవత్సరాలలో సింఘానియా గ్రూప్ విజయవాడ, కాకినాడ, విశాఖపట్నంలలో ఉపాధ్యాయ శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక అనుసంధానం వంటిపై శిక్షణ ఇచ్చి విద్యాస్థాయిని పెంచుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రేమాండ్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కె.నరసింహమూర్తి, కార్పొరేట్ ఎఫైర్స్ హెడ్ జతిన్ ఖన్నా, సింఘానియా ట్రస్ట్ ప్రిన్సిపాల్ రేవతి శ్రీనివాసన్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ రోహిత్ ఖన్నా, చీఫ్ గార్మెంటింగ్ బిజినెస్ ఆఫీసర్ మనీష్ భారతి, రేమాండ్స్ ఇంజనీరింగ్ బిజినెస్ సీఈఓ గౌతమ్ మైనీ, చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ నవీన్ శర్మ, చైర్మన్ సెక్రటరీ అతుల్ ఖేల్కర్ పాల్గొన్నారు.