- యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా ఉద్యోగావకాశాల కల్పన
- రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఉద్ఘాటన
- సంస్థ కార్యాలయంలో చైర్మన్గా బాధ్యతల స్వీకరణ
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో అర్హులైన ప్రతి యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించి, సమాజంలో ఆత్మవిశ్వాసంతో వారు ముందుకు సాగేలా చేయడమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) లక్ష్యమని సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు తెలిపారు. తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్గా బూరుగుపల్లి శేషారావు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం శేషారావు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర` 2047 విజన్ కు అనుగుణంగా ప్రభుత్వ, పరిశ్రమ, విద్యా రంగాలు సమన్వయంతో పనిచేస్తాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య కార్యక్రమాలు, గ్రామీణ యువత కోసం డిజిటల్ ఇంటర్న్షిప్, తదితర కార్యక్రమాలను అమలు చేయనున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజాహిత పాలనా విధానం.. ఏపీఎస్ఎస్డీసీ పనితీరుకు మార్గదర్శకంగా ఉంటాయన్నారు. వారి మార్గనిర్దేశత్వంలో పనిచేస్తూ, యువతకు శిక్షణను అందించటం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. సమానత్వాన్ని కల్పించే లక్ష్యంతో మహిళలు, గ్రామీణ యువత, టెక్నాలజీకి దూరంగా ఉన్నవారందరికీ ఇంటింటికీ నైపుణ్య శిక్షణ తీసుకెళ్లేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు అభినందనలు
నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ శేషారావును వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ది సంస్థ ఎండీ, సీఈవో జీ. గణేష్ కుమార్, కార్యనిర్వాహక సంచాలకులు, సలహాదారులు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, పరిశ్రమల భాగస్వాములు, విద్యా రంగానికి చెందిన ప్రముఖులు అభినందించారు.
సంతోషంగా ఉంది: మంత్రి దుర్గేష్
ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం బూరుగుపల్లి శేషారావుని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలిసి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్గా బూరుగుపల్లి శేషారావు గారు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారని, తమకున్న అనుభవంతో నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. శేషారావు పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరవడం సంతోషంగా ఉందన్నారు.