కోర్టుల్లో న్యాయ విచారణ ఎండమావిగా మారి కేసుల విచారణ అతీగతీ లేకపోవడంతో ఆర్ధిక నేరస్థులు సులవుగా తప్పించుకుంటున్నారు. అనేక అవినీతి కేసుల్లో ప్రథమ ముద్దాయిగావున్న జగన్‌రెడ్డి కనీసం విచారణకు కూడా హాజరుకాకుండా మినహాయింపు ఎలా పొందగలుగుతున్నారన్నది ప్రజల ప్రశ్న. ఆయనపై దాఖలైన కేసులు పుష్కరకాలం దాటినా కనీసం విచారణకు కూడా నోచుకోకపోవడం ఏమిటి? ఇది వ్యవస్థలను మేనేజ్ చేయ్యడం కాదా? అంటున్నారు. అవినీతి కేసులలో ప్రథమ ముద్దాయిగా ఉన్న వ్యక్తి న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేసే పరిస్థితిలో ఉండటం దేశ దౌర్భాగ్యం కాదా? దేశ ప్రజాస్వామ్యానికి ఇంతకుమించిన దౌర్భాగ్యం ఏముంటుంది? ఈ దేశంలో న్యాయ వ్యవస్థనైనా మేనేజ్ చేయవచ్చునన్న భావన ప్రజలలో ఏర్పడిరది. న్యాయ వ్యవస్థ కూడా అన్ని వ్యవస్థల జాబితాలో చేరిపోవడం ఆందోళనకరం. అనేక కేసులలో నేరస్థుడిగావున్న జగన్‌రెడ్డి న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయడం కంటే విషాదం ఏముంటుంది? న్యాయ వ్యవస్థలో కూడా బలహీనతలు ఎప్పటినుంచో ఉన్నా కానీ, ఇంతగా ఎన్నడూ న్యాయవ్యవస్థ బేలతనం ప్రదర్శించ లేదు.
గతంలో అవినీతి కేసులో ఈ దేశ ప్రధాని సైతం కోర్టులో విచారణకు హాజరుకాలేదా? ప్రధానమంత్రి కంటే జగన్‌రెడ్డి బిజీగా ఉన్నారా? కేసులు విచారణకు కూడా హాజరుకాకుండా జగన్‌కు మినహాయింపు ఇవ్వడంలో ఆంతర్యమేమిటి? ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్ దిగిపోయి ఆర్నెల్లయినా.. ఒక్కసారైనా ఆయనను విచారణకు పిలిచారా? జగన్‌రెడ్డి అవినీతి కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తి చెయ్యడం అసాధ్యమా? విదేశాలకు వెళ్లాలన్నా ఆయన కోర్టు అనుమతి పొందాల్సి రావడం, బెయిల్‌పై ఉన్న వ్యక్తి శాసన నిర్మాతగా వెలిగిపోవడం, దేశ ప్రజాస్వామ్యానికి, ప్రజలకు తలవంపులు కాదా? అధికారంలోవున్న రాజకీయ నాయకులు తప్పులు చేస్తే విచారణ చేసి దండిరచడానికి న్యాయవ్యవస్థ ఉంది. మరి అలాంటి న్యాయవ్యవస్థలో ఉన్న వారు అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల అభీష్టానానికి అనుగుణంగా నడుచుకుంటే.. న్యాయ వ్యవస్థకు ఉన్న ఔన్నత్యం,
విశ్వసనీయత పరిస్థితి ఏమిటి?
పాతికేళ్ల క్రితం వరకు ఆసియాలోనే అత్యంత అవినీతి దేశంగా పేరుమోసిన సింగపూర్ నేడు ప్రపంచ అవినీతిరహిత సమాజాల్లో నాలుగోస్థానంలో నిలబడిరది. మాదకద్రవ్యాల మాఫియాపై మరణశిక్షలతో ఉక్కుపాదం మోపింది. సవాళ్లకు ఎదురెళ్లి స్వీయ స్వప్నాలను సాకారం చేసుకొన్న సింగపూర్ స్పూర్తిదాయకమైన అభివృద్ధి సాధించింది. సింగపూర్ స్ఫూర్తిదాయకమైన ప్రస్తానంనుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆ మధ్య ఆ దేశ పర్యటనలో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మరి అందుకు మనం ఇప్పటికీ సింగపూర్ స్ఫూర్తిని అమలు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామా? ఏడున్నర దశాబ్దాలకుపైగా సాగుతున్న స్వతంత్ర పయనంలో భారతదేశం ఏదరికి చేరిందో చెప్పడానికి ఉదాహరణ ఇవి చాలు. అంతులేని అవినీతి, ఆర్ధిక నేరగాళ్లతో ఇండియా అంతర్జాతీయంగా పరవుమాసిపోతుంది.
నేరగ్రస్త రాజకీయాల ప్రక్షాళనపై మన పాలకుల నోటి మాటలు గట్టి చేతలయ్యేది ఎప్పుడని సుప్రీంకోర్టు తరచుగా నిలదీస్తూనే వుంది.
అయినా జగన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణలు ఏళ్లతరబడి జీడీ పాకాలుగా సాగుతూనే వున్నాయి తప్ప ముందుకు సాగడం లేదు. ఇంకా ఎన్నేళ్లకు తెములుతాయో అర్ధం కావడం లేదు. మొత్తం జగన్‌పై సీబీఐ11, ఈడీ 7చొప్పున చార్జిషీట్లు నమోదయ్యాయి. 16 నెలలు జైలులో ఉండి బెయిల్‌పై బయటికొచ్చి పదేళ్ళకుపైగా రాచకార్యాలు వెలగపెట్టడం జగన్ నేరచరిత్ర కిరీటంలో కలికితురాయి. ఆ మధ్య జగన్‌పై సీబీఐ నమోదు చేసిన కేసులు ఇంతవరకు 3041సార్లు వాయిదా పడినట్టు ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామరాజు న్యాయవ్యవస్థ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన సుప్రీంకోర్టు.. జగన్ అక్రమాస్తుల కేసుల్లో అలవిమాలిన ఆలస్యానికి కారణమేమిటంటూ సీబీఐని ప్రశ్నించింది. కానీ విచారణ మాత్రం వేగవంతం కాలేదు. న్యాయవ్యవస్థ కూడా ఆదేశించి చేతులు దులుపుకొంటున్నది తప్ప ఆదేశాలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవడం లేదు. నేరారోపణలు రుజువైతే జగన్‌రెడ్డికి ఏడేళ్లనుంచి యావజ్జీవ జైలు విధించే అవకాశాలున్నాయి. అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు అడుగులకు మడుగులోత్తుత్తూ ఆర్ధిక నేరగాళ్లకు వీరగంధాలు పూయడం ఇండియాలోనే సాధ్యం. వేల కోట్ల ప్రజాసంపదను దోపిడీ చేసిన జగన్‌రెడ్డి స్థానంలో మరో సామాన్యుడు ప్రజా సంపదను దోపిడీ చేసి వుంటే విచారణ ఇలానే చేసేవారా?
జగన్‌రెడ్డిది రాష్ట్రస్థాయిలోనే కాదు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన అవినీతి చరిత్ర. 12 ఏళ్లుగా ఆయన బెయిలుపైనే ఉన్నారు తప్ప ఆయనపై కేసుల విచారణ ఒక్క అడుగూ ముందుకు పడటంలేదు. 2012 జనవరి 21న తొలి చార్జిషీటు దాఖలు చేసింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఏదీ కొలిక్కి రాలేదు. చార్జిషీట్లు, అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు, డిశ్చార్జి పిటిషన్లు, వాదనలు, ప్రతివాదనలు, వాయిదాలు, జగన్ అక్రమాస్తుల కేసులో పుష్కరకాలంగా సాగుతున్నదిదే. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇప్పటిదాకా 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు దాఖలైనట్టు, వీటిపై తీర్పులు ఇవ్వకముందే ఆరుగురు న్యాయమార్తులు బదిలీ అయ్యారని, న్యాయమూర్తి కూడా కనీసం రెండేళ్లు కాకముందే బదిలీ అయినట్లు సమాచారం. జగన్‌రెడ్డి అక్రమ కేసులో ఉన్న నిందితులంతా ఆర్ధికంగా బలవంతులే. ఏదోక కారణంతో ఒకదాని తర్వాత మరొక పిటిషన్ దాఖలు చేస్తూ దేశంలో ఉన్న అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలను వినిపిస్తూ చట్టాలలోని లొసుగులను ఉపయోగించుకొని తప్పించుకొంటున్నారు. 2012-2013ల మధ్య సీబీఐ దాఖలు చేసిన ప్రతి కేసులో ఏ1గా జగన్, ఏ2గా విజయసాయిరెడ్డి ఉన్నారు.
హెటెరో, అరబిందో ఫార్మా, రాంకీ, వాన్‌పిక్, దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, రఘురాం సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, ఇందూ టెక్ జోన్, లేపాక్షి నాలెడ్జి హబ్, ఏపీ హౌసింగ్ ప్రాజెక్ట్స్ తదితర కంపెనీలపై అభియోగాలు నమోదయ్యాయి. జగన్ మీడియాతోపాటు, భారతీ సిమెంట్స్‌లోనూ పెద్దపెద్ద కంపెనీలు అత్యధిక ప్రీమియంతో వాటాలు కొన్నాయని సీబీఐ ఆధారాలు సేకరించింది. నిజానికి ఇవి ‘క్విడ్ ప్రో కో’లో భాగంగా అందిన ముడుపులేనని, పెట్టుబడులు కావని ఆధారాలతో సహా సీబీఐ నిరూపించింది. పాదయాత్ర, రాజకీయ కార్యకలాపాలు, ఇతరత్రా రకరకాల కారణాలు, సాకులు చెబుతూ కోర్టులకు వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు పొందారు. సీఎం అయ్యాక తాను ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై ఉన్నానని, భారీ ఆర్థిక లోటుతో ఉన్న ఏపీని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని కోర్టుకు రాలేనని పిటిషన్లు వేశారు. కింది కోర్టు ఈ పిటిషన్ కూడా తిరస్కరించినప్పటికీ, హైకోర్టునుంచి అనుమతి తెచ్చుకొని 12 ఏళ్లుగా బెయిల్‌పై వున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షస్థానం కూడా లేకుండావున్నా కోర్టులు విచారణకు పిలవడం లేదు. ఇవేమీ విచారణలో అర్ధం కావడం లేదంటున్నారు ప్రజలు.
పన్నెండేళ్లుగా కేవలం బెయిల్‌పైవున్న వ్యక్తి ఐదేళ్లుగా వాయిదాలకు కోర్టులకు వెళ్లకుండా తప్పించుకు తిరుగుతుంటే దర్యాప్తు సంస్థలు చోద్యం చూస్తున్నాయి. భారత రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కోనన్ని అవినీతి కేసులు ఎదుర్కొంటున్నది జగన్‌రెడ్డే. అవినీతి జరిగిందనడానికి టన్నుల కొద్ది పత్రాలు, సాక్ష్యాలువున్నా ఆ కేసులు ముందుకు సాగకుండా ఏళ్ల తరబడి ఎందుకు కొనసాగుతున్నాయి. దాదాపు రూ.43 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైనట్టు సీబీఐ తన ప్రాథమిక నివేదికలో నిగ్గు తేల్చింది. ఆ లూటీలో జగన్ చేసిన కుట్రల చిట్టా ఎంత పెద్దదో సీబీఐ వెలువరించిన 16 చార్జిషీట్లను పరిశీలిస్తే తెలుస్తుంది. అవినీతి కేసుల విచారణ కొన్నేళ్లు పట్టడంవల్ల సాక్షులను ప్రభావితం చేసి నిందితులు శిక్షలు పడకుండా తప్పించు కొంటున్నారు. జగన్ కేసుల విచారణ ఇంకేన్నేళ్లు కొనసాగిస్తారు అంటున్నారు ప్రజలు. చట్టంముందు అందరూ సమానులేనన్న సూక్తి జగన్ విషయంలో ఎందుకు అమలు కావడం లేదో న్యాయస్థానాలు సమాధానం చెప్పాలి. చట్టాలు జగన్‌రెడ్డి చుట్టాలుగా వ్యవహరిస్తున్నాయి. జగన్ ఆర్ధిక నేరాల విచారణలో వ్యవస్థలు ఉదాసీనంగా వ్యవహరించడంలో ఆంతర్యమేమిటి? న్యాయస్థానాల ఆదేశాలతోనే జగన్ అవినీతిపై సీబీఐ విచారణచేసి రూ.43 వేల కోట్లు దోపిడీ చేసినట్టు ప్రాథమిక విచారణలో సీబీఐ నిగ్గు తేల్చింది. జగన్ అవినీతి కేసులుపై విచారణ జరుగుతున్న తీరుచూస్తే న్యాయవ్యవస్థ ఔన్నత్యం, విశ్వసనీయత మసక బారుతున్నాయి. వ్యక్తిగత లాభం కోసం ఉద్దేశపూర్వకంగా అవినీతికి పాల్పడిన ఆర్థిక నేరగాళ్లను కఠినంగా శిక్షించకపోతే మొత్తం సమాజమే అన్యాయమైపోతుందని సాక్షాత్తు సుప్రీంకోర్టే స్పష్టంచేసినా.. జగన్ కేసులు విచారణ ఏళ్లతరబడి జీడీపాకాలుగా సాగుతూనే వున్నాయి తప్ప ముందుకు సాగడం లేదు. ఇప్పటికైనా జగన్ కేసులు విచారణ వేగవంతం చేసి ఆయన అవినీతిని నిగ్గుతేల్చి న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని నిలబెట్టాలి.
నీరుకొండ ప్రసాద్