- అసమర్థ పాలనతో ప్రజలపై రూ.20 వేల కోట్ల భారం
- మిగులు విద్యుత్‌తోవున్న వ్యవస్థను నాశనం చేశారు…
- సోలార్, విండ్ విద్యుదుత్పత్తిపై దృష్టిపెట్టిందే లేదు
- విద్యుత్ కొనుగోలు సాకుతో అనుయాయులకు కోట్లు దోచిపెట్టారు
- ఐదేళ్లలో 9సార్లు విద్యుత్ చార్జీలు పెంచింది వైసీపీనే..
- సాగుకు పగటిపూట 9 గంటల విద్యుత్ ఇవ్వడమే మా లక్ష్యం
- విద్యుత్ రంగంలో రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించాం
- శాసన మండలిలో విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి (చైతన్య రథం): 2019 వరకు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని, అనంతరం అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం విధ్వంసకర నిర్ణయాలతో విద్యుత్ రంగాన్ని వేల కోట్ల రూపాయిల నష్టాల్లోకి నెట్టేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. శాసన మండలిలో బుధవారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వైసీపీ ప్రభుత్వం.. ట్రూ అప్ చార్జీలను వేసి ఈఆర్సీకి పంపి… రెండేళ్లు అలాగే ఉంచేశారన్నారు. కేవలం వ్యక్తిగత కక్షలతో ఏడెనిమిది వేల మెగావాట్ యూనిట్ల సోలార్, విండ్ విద్యుదుత్పత్తిని నిలిపి వేశారని వెల్లడిరచారు. రాష్ట్రంలో ఈ విధంగా విద్యుదుత్పత్తిని నిలిపివేయడమే కాకుండా… మరోపక్క పవర్ పర్చేజ్‌ల పేరుతో వైసీపీ ప్రభుత్వ పెద్దలు వారి అనుయాయులకు వేల కోట్ల రూపాయిలు దోచిపెట్టారని మంత్రి మండిపడ్డారు. విద్యుత్ రంగం విపత్కర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఉన్న నమ్మకంతో… విద్యుత్ రంగంలో రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చినట్లు మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.
కోర్టులనూ తప్పుదోవ పట్టించేలా..
పవర్ పర్చేజ్‌ల పేరిట ప్రజల నెత్తిన భారం వేసిన వైసీపీ ప్రభుత్వం… కోర్టులను కూడా తప్పుదోవ పట్టించేలా చర్యలు చేపట్టిందని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. బీపీఎల్ ఎందుకు అమలు చేయలేదని కోర్టు ప్రశ్నించినా, కోర్టు వ్యాఖ్యలను గౌరవిస్తున్నట్టు నటిస్తూనే… లైన్లను బిజీపెట్టి ఉత్పత్తి అయ్యే పవర్‌ని కూడా తీసుకోకుండా విద్యుత్ రంగానికి నష్టం చేకూర్చారని మంత్రి వెల్లడిరచారు. ఇటువంటి వైసీపీ ప్రభుత్వ చర్యలతో… పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటీపీఎస్, కృష్ణపట్నం, పోలవరంవంటి వాటి ద్వారా ఎంతో విద్యుదుత్పత్తికి అవకాశమున్నా.. గత వైసీపీ ప్రభుత్వంలోని సీఎం చర్యలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 9సార్లు విద్యుత్ చార్జీలను పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. గత సీఎం అనాలోచిన నిర్ణయాలతోనే ప్రజలపై సుమారు రూ.20 వేల కోట్లకుపైగా విద్యుత్ భారం పడిరదని వాపోయారు.
24 గంటలూ నాణ్యమైన విద్యుత్….
రాబోయే రోజుల్లో ప్రజలపై భారం పడకుండా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు మంత్రి గొట్టిపాటి వివరించారు. ఫీడర్ లెవల్లో నష్టాలు రాకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్య పథకం ద్వారా ప్రజలకు 24 గంటలు, వ్యవసాయానికి 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి అన్ని చర్యలు చేపట్టామన్నారు. డిస్క్‌ంలలో మరింత మెరుగైన పద్ధతిలో విద్యుదుత్పత్తిని చేయిస్తామన్నారు. అదేవిధంగా ఏపీ జెన్‌కో ద్వారా… రెండు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులతో 2,300 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పెరిగే విద్యుత్ వినియోగానికి అనుగుణంగా… పీఎస్పీలు, సోలార్, విండ్, హైడ్రల్‌వంటి విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి గొట్టిపాటి వెల్లడిరచారు.
రూ.15 వేల కోట్లతో సబ్ స్టేషన్లు..
అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడానికి రూ.15 వేల కోట్లతో 71 సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ట్రాన్స్‌మిషన్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి గొట్టిపాటి వివరించారు. విద్యుత్ వినియోగం పెరిగినా ఇబ్బందులు లేకుండా ఇటువంటి ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామన్నారు. అదేవిధంగా కొత్తగా పెట్టుబడులు పేట్టేవారిని ఆహ్వానిస్తున్నామని, రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకునే అందరినీ ప్రోత్సహిస్తామని మంత్రి గొట్టిపాటి అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నకు సమాధానమిచ్చారు.