- పర్యటనలో ఎటువంటి సమస్యలు తలెత్తకూడదు
- అధికారులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశం
సంబేపల్లి (చైతన్యరథం): అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు పక్కాగా, పకడ్బందీగా ఉండాలని అధికారులను రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. సంబేపల్లి మండలంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్, భోజన వసతులు, ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ, తదితర కార్యక్రమాల ఏర్పాట్లను మంత్రి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు సందేపల్లి మండలంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి హెలిపాడ్ నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా సందేపల్లి మండలంలో ఆవిష్కరించే ఎన్టీఆర్ విగ్రహాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చే వీఐపీలకు, అధికారులకు, తదితరులకు భోజన వసతులకు సంబంధించిన ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి హెలిపాడ్ దిగినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు ఎటువంటి చిన్న సమస్య కూడా తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు, అందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.