- కుటుంబం అనేది భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరం
- అందరూ అమ్మను గౌరవించడం నేర్చుకోవాలి
- అమ్మకు చెప్పలేని పని జీవితంలో ఎప్పుడూ చేయకూడదు
- తల్లిదండ్రుల మాట వింటే నైతిక విలువలు అలవాటవుతాయి
- విద్యార్థులు వృద్ధిలోకి వస్తే సంతోషపడే వ్యక్తి గురువు
- ‘విలువల విద్యాసదస్సు’లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దిశానిర్దేశం
విజయవాడ (చైతన్యరథం): సమాజాన్ని ఉద్ధరించడానికి విద్య ఉపయోగపడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారులు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన ‘విలువల విద్యాసదస్సు’లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. విలువల విద్య గురించి ప్రవచిస్తూ నాకు ఈ కర్తవ్యాన్ని అప్పగించినప్పుడూ సీఎం చంద్రబాబు నాతో ఒక మాట అన్నారు. నైతికత అనేది కుటుంబంలో ప్రారంభం కావాలన్నారు. తల్లి మాట వినడం, తండ్రి మాట వినడం, అన్నదమ్ములను ప్రేమించడం ప్రారంభమైతే.. సమాజాన్ని ప్రేమించడం తనంత తానుగా అలవాటవుతుంది. ఇవాళ కుటుంబాల్లో విలువలు తగ్గిపోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అవగాహన తగ్గిపోతోంది. కాబట్టి మీరు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలు చేసినా, ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసినా కుటుంబ విలువలను దృష్టిలో పెట్టుకుని కుటుంబ విలువలు పెరగడానికి దోహదపడే విధంగా మీ ప్రవచనాలు, ప్రసంగాలు చేయాలని సీఎం చంద్రబాబు సూచించినట్టు చాగంటి తెలిపారు.
కుటుంబం.. భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం
ఇది ప్రభుత్వ పక్షాన జరుగుతున్న మొదటి సమ్మేళనం కాబట్టి నాకు ఎవరు ఈ కర్తవ్యాన్ని అప్పజెప్పారో వారి చేసిన సూచనతోటే నా ప్రసంగాన్ని ప్రారంభించాలనుకున్నాను. కుటుంబం అనేది భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరం. తల్లి కడుపున పుడతాం. నిజానికి ఈ తల్లి కడుపున పుట్టాలి అని ఎవరూ నిర్ణయించుకోరు. తల్లి కడుపులో 9 నెలలు పెరుగుతాం. కంటికి రెప్పలా తల్లి తన పిల్లలను కాపాడుకుంటుంది. తండ్రి గొప్ప ధనవంతుడు కావొచ్చు, గొప్ప అధికారి కావొచ్చు.. కానీ పుట్టినటువంటి పసిబిడ్డ ఆకలితో ఏడుస్తుంటే.. ఆ పసిబిడ్డకు పాలు పట్టగలిగే శక్తి అమ్మకు మాత్రమే ఉంటుంది. బిడ్డను రక్షించుకోవాలనే తాపత్రయం, తిరుగులేని ప్రేమ తల్లికి మాత్రమే ఉంటుంది. అది కేవలం మనిషిలోనే కాదు.. ప్రతి ప్రాణిలో ఉంటుంది. స్త్రీ ప్రాణి ఎక్కడున్నా బిడ్డలను కడుపులో పెంచుకోవడం, కడుపును గర్భాలయం చేయడం, కన్నబిడ్డలకు పాలిచ్చి పెద్దచేస్తుంది. అంత ప్రేమతో స్త్రీ చేసే త్యాగం లేకపోతే సమాజం లేదు. శంకరాచార్యుల వారు అమ్మ మీద మాత్రమే ఐదు శ్లోకాలు చెప్పారు. అమ్మలాంటి ప్రాణి లోకంలో లేదని చాగంటి అన్నారు.
అమ్మను గౌరవించడం నేర్చుకోవాలి
అమ్మ అంటే ప్రేమైక మూర్తి. అమ్మలాంటి వ్యక్తి జీవితంలో ఇక దొరకదు. జీవితంలో అన్నిటికన్నా పెద్ద నేరం ఏమిటంటే.. అమ్మకు చెప్పలేము అనుకునే పని మనం చేయడమే. ఏం పని మనం చేస్తామో ఆ పని అమ్మకు చెప్పగలగాలి. అమ్మకు చెప్పలేని పని జీవితంలో మీరు ఎప్పుడూ చేయకూడదు. భగవంతుడు ఎంతో అమ్మ కూడా అంతే. మహాత్ముల జీవిత చరిత్ర ఎవరిది పరిశీలించినా అమ్మకు నమస్కారం చేయకుండా, అమ్మ గొప్పతనం చెప్పకుండా ఎవరూ లేరు. ప్రకాశం పంతులు, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రధాని నరేంద్ర మోదీ అమ్మ గొప్పదనం గురించి చెప్పారు. ఈ జాతి మొదటి లక్షణం అమ్మను గౌరవించడం. మాతృదేవో భవ. అందరూ అమ్మను గౌరవించడం నేర్చుకోవాలి, అమ్మకు నమస్కారం చేయాలి. పాఠశాలకు వచ్చేప్పుడు తప్పనిసరిగా అమ్మకు నమస్కారం చేయాలని చాగంటి ఉద్బోధించారు.
మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మాతృమూర్తి అమ్మణ్ణమ్మ కష్టపడి పనిచేయాలని ఆయనకు చెప్పారు. కష్టపడినవారు జీవితంలో వెనుతిరిగి చూడరు, కష్టపడటం నేర్చుకోవాలని చంద్రబాబుకి చెప్పారు. కష్టపడటం గురించి మా అమ్మ చెప్పిన కథ నా జీవితానికి దిశానిర్దేశం చేసిందని చంద్రబాబు చెప్పారు. కష్టపడటం మా అమ్మ దగ్గరి నుంచి నేర్చుకున్నానని చంద్రబాబు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. మీరు ఏది చేసినా మీ అమ్మకు చెప్పగలగాలి. అమ్మకు చెప్పలేని పని చేయవద్దు. మీరు ఒకవేళ తప్పుచేస్తే క్షమించడానికి సిద్ధంగా ఉండే మొదటివ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచంలో అది అమ్మ మాత్రమే. కుటుంబం దగ్గరే నైతిక విలువలు మొదలవుతాయని చాగంటి అన్నారు.
తల్లిదండ్రుల మాట వింటే..
తల్లి ఎంత గొప్పదో తండ్రి కూడా అంతే గొప్పవాడు. జీవితాంతం దైవంతో సమానంగా చూడాలి. భగవంతుడే తండ్రి రూపంలో ఉన్నాడు. మన కంటికి కనపడని భగవంతుడు తండ్రి రూపంలో ఉన్నాడు. బిడ్డలు వృద్ధిలోకి రావాలని అహరహం కోరుకునే వ్యక్తి తండ్రి. పిల్లల కోసం ఏ త్యాగం చేయడానికైనా తండ్రి సిద్ధంగా ఉంటాడు. అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన అబ్రహం లింకన్, ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ తండ్రి గొప్పదనం గురించి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. తండ్రి మాటను పెడచెవిన పెట్టవద్దు. తల్లిదండ్రుల మాట వినడం నేర్చుకుంటే మీకు నైతిక విలువలు చాలా అలవాటవుతాయి. తోబుట్టువులను ప్రేమించాలి. తన సోదరుడి గురించి ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. తల్లి, తండ్రి, గురువు ఎంత గొప్పవారో తోడబుట్టిన వారు అంత గొప్పవారు. అక్కరకు వస్తారు. వారిని ప్రేమించాలి, గౌరవించాలి. పెద్దలను, గురువులను గౌరవించాలి. తరగతి గది కేవలం పాఠాలు చదువుకోవడానికే కాదు. సమాజాన్ని ఉద్ధరించడానికి విద్య ఉపయోగపడాలి. తల్లి, తండ్రి తర్వాత మన మంచి కోసం అంత తపనపడే వ్యక్తి గురువు ఒక్కరే. విద్యార్థులు వృద్ధిలోకి వస్తే సంతోషపడే వ్యక్తి గురువు అని విద్యార్థులకు చాగంటి కోటేశ్వరరావు దిశానిర్దేశం చేశారు.












