- రాష్ట్ర సచివాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న మంత్రులు
- మహిళలకు అన్నింటా ఎన్టీఆర్, చంద్రబాబు ప్రాధాన్యం: మంత్రి సవిత
- ప్రతి తల్లీ పోలీసే: హోం మంత్రి అనిత
- మహిళలే మహారాణులు: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
అమరావతి (చైతన్యరథం): విద్యతోనే మహిళల అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆడబిడ్డల చదువును ప్రోత్సాహించాలని రాష్ట్ర మంత్రులు ఎస్.సవిత, వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. ఏపీ సెక్రటేరియట్ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు హాజరై ప్రసంగించారు. మహిళలకు, ఉద్యోగినులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, మహిళల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత అన్న ఎన్టీఆర్ దేనన్నారు. అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందేలా ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబునాయుడు అమలు చేస్తున్నారన్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులకు ఎటువంటి హామీ లేకుండా రూ.10 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నారన్నారు.
ఆడ పిల్లల విద్యను ప్రోత్సహిద్దాం: మంత్రి సవిత
విద్యతోనే మహిళల అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆడబిడ్డల విద్యను ప్రోత్సహిద్దామని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత పిలుపునిచ్చారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కుతో పాటు రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ ప్రాధాన్యమిచ్చారన్నారు. సావిత్రిబాయీ పూలే ఆశయ సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు మహిళల ఆర్థికాభ్యున్నతికి అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు మహిళా పక్షపాతి అని, వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మగ పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని, వారిలో నైతిక విలువలు పెంపొందించేలా రామాయణ, మహా భారతం బోధించాలని సూచించారు. ఆడ బిడ్డలు ధైర్యంగా ఇంటి నుంచి బయటకెళ్లేలా కృషి చేద్దామని మంత్రి సవిత పిలుపునిచ్చారు.
మగపిల్లలపై ప్రత్యేక దృష్టి: హోం మంత్రి అనిత
కుటుంబాన్ని నడిపే క్రమంలో ప్రతి తల్లీ పోలీసులా వ్యవహరించాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సూచించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో మగపిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంటిలో స్త్రీలను గౌరవించినట్లే బయట స్త్రీలతోనూ సభ్యతతో మెలిగేలా చూడాలన్నారు. తల్లిదండ్రుల కష్టం పిల్లలకు తెలిసేటట్లు పెంచితేనే, వారికి జీవితం పట్ల బాధ్యత ఏర్పడుతుందన్నారు. మగపిల్లలను నైతిక విలువలతో పెంచుతూనే, ఆడ బిడ్డలకు స్వేచ్ఛగా, నిర్ణయాలు తీసుకునేలా తీర్చిదిద్దాలని మంత్రి అనిత ఉద్బోధించారు.
వేధింపులపై ఫిర్యాదు చేస్తే తక్షణ చర్యలు: మంత్రి సంధ్యారాణి
ఆడపడుచులకు గౌరవ మర్యాదలు పెంచుతూ, మహిళల విద్యకు ప్రాధాన్యమిచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్ దేనని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కొనియాడారు. ఈనాడు మహిళలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, ఇతర ఉన్నతాధికారులుగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారంటే ఆనాడు అన్న ఎన్టీఆర్ మహిళా విద్యకు ప్రాధాన్యమివ్వడం వల్లేనన్నారు. ఏన్టీఆర్ ఏజెన్సీల్లో హాస్టళ్లు, గురుకుల పాఠశాలలను స్థాపించారన్నారు. ఆడబిడ్డలను ఆంక్షలతో కాకుండా మగపిల్లలతో సమానంగా పెంచాలని మంత్రి పిలుపునిచ్చారు. మహిళలే మహారాణులని కొనియాడారు. ఉద్యోగం చేసే చోట వేధింపులు, అవమానాలు ఎదురైతే తక్షణమే తమకు ఫిర్యాదు చేస్తే, న్యాయం చేస్తామని మంత్రి సంధ్యారాణి అభయమిచ్చారు. కార్యక్రమం అనంతరం మహిళా ఉద్యోగులతో కలిసి మంత్రులు సవిత, అనిత, గుమ్మిడి సంధ్యారాణి సెల్ఫీ తీసుకున్నారు. వారంలో ఒక రోజు ఇంటిలోనూ, విధుల్లోనూ చేనేత వస్త్రాలు ధరించాలని, చేనేతలకు అండగా నిలవాలంటూ మహిళా ఉద్యోగులను మంత్రి సవిత పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సచివాలయ మహిళ ఉద్యోగినుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు కే వైదురీదేవి, ఉపాధ్యక్షురాలు ఎం. లక్ష్మణకుమారి, సెక్రటరీ సుస్మిత, ఇతర సభ్యులు రాజేశ్వరి, నాగలలితా దేవి, సునీత, శారదతో పాటు వివిధ శాఖలకు ఉద్యోగినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.