- చట్టాలు చేసేది… సంస్కరణలు తెచ్చేది రాజకీయ నేతలే…
- నేటి ప్రగతికి బీజం వేసిన ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ
- వాజ్‌పేయితో కలిసి పని చేయడం నా అదృష్టం
- మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ కల సాకారమవుతోంది
- మంచి పాలసీలు చేసే వారినే ప్రజలు ఎన్నుకోవాలి
- మాజీ ప్రధాని పీవీ స్మారక ఉపన్యాస సదస్సులో సీఎం చంద్రబాబు
- ఢిల్లీలో ‘ద లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు’ పేరిట సదస్సు
ఢిల్లీ (చైతన్య రథం): చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత ప్రధానుల మ్యూజియం, లైబ్రరీ ప్రాంగణంలో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు స్మారకోపన్యాస సదస్సు జరిగింది. ద లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు పేరిట కేంద్ర సాంస్కృతిక శాఖ సదస్సు నిర్వహించింది. ఇప్పటి వరకు ఐదుగురు మాజీ ప్రధానులకు సంబంధించిన స్మారకోపన్యాస సదస్సులు నిర్వహించిన కేంద్ర సాంస్కృతిక శాఖ… ఆరో సదస్సుగా పీవీ నరసింహారావు స్మారకోపన్యాస సదస్సు నిర్వహించింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘రాజకీయాల్లోకి యువత రావాల్సిన అవసరం ఉంది. చదువుకున్న యువత రాజకీయాల విషయంలో విముఖత ప్రదర్శిస్తున్నారు. ఇది సరైనది కాదు. నేను యువకులైన మంచి రాజకీయ నేతల గురించి వెతుకుతున్నాను. యువత అంతా ఆల్ ఇండియా సర్వీసెస్.. బిజినెస్.. మంచి ఉద్యోగం.. మంచి కెరీర్ అంటున్నారు. కానీ మంచి ఉద్దేశ్యాలు… మంచి భావాలు కలిగిన యువత రాజకీయాల్లోకి రావాలి. అప్పుడే దేశానికి మంచి లీడర్షిప్ వస్తుంది. పబ్లిక్ పాలసీలు రూపొందించేది రాజకీయ నాయకులే. బ్యూరోక్రాట్లు కాదు. ప్రజలకు మంచి చేసేలా విధానాలు రూపకల్పన చేయాలంటే రాజకీయ నేతల వల్లనే సాధ్యం. ఈ విషయాన్ని యువతరం గుర్తుంచుకోవాలి. టీడీపీ దేశంలోనే యంగెస్ట్ పార్టీ. టీడీపీలో చాలామంది యువకులు, చదువుకున్న వారు ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు’’ అని చంద్రబాబు చెప్పారు.
పీవీ తెచ్చిన సంస్కరణలు దేశానికి మేలు మలుపు
‘‘పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు, దూరదృష్టిగల నాయకుడు. పీవీ తెలుగు బిడ్డ అని చెప్పుకోవడానికి తెలుగు వాళ్లు చాలా గర్వపడతారు. పీవీ మన దేశ భవిష్యత్తును కీలక మలుపు తిప్పిన నాయకుడు. 17 భాషల్లో ప్రావీణ్యం కలిగిన పండితుడు. ఇప్పుడు హిందీ భాష ఎందుకు అనే చర్చను కొందరు తెరమీదకు తెస్తున్నారు. భారతదేశం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలను అర్థం చేసుకున్న పీవీలాంటి నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. 1991 వరకు భారతదేశం సోషలిస్టు మోడల్‌ను అనుసరించింది. ‘‘లైసెన్స్ రాజ్’’గా పిలవబడే నియంత్రణలు వ్యాపారాల అభివృద్ధికి అడ్డుపడ్డాయి. విదేశీ పెట్టుబడులు చాలా తక్కువగా ఉండేవి. ఆర్థిక వృద్ధి రేటు సంవత్సరానికి 3-4శాతం మాత్రమే. 1991లో భారత్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు రికార్డుస్థాయిలో పడిపోయాయి. చమురు దిగుమతులకు ఇబ్బందులు కలిగేవి. దేశపు బంగారాన్ని తాక్టటు పెట్టాల్సిన పరిస్థితి. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలచిన నాయకుడు పీవీ. మెజారిటీ లేకున్నా.. తన రాజకీయ చతురతతో అన్ని పార్టీలను ఒప్పించి పీవీ సంస్కరణలను తెచ్చారు. లైసెన్స్ రాజ్ అరాచకాలకు పీవీ ముగింపు పలికారు. విదేశీ పెట్టుబడులకు బాటలు వేశారు. దిగుమతులపై సుంకాలు తగ్గించి, పన్ను విధానాలను సరళతరం చేసి, బహిరంగ మార్కెట్‌ను తెరిచారు. దీంతో భారతదేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఆర్థిక సంక్షోభం నుంచి దేశం గట్టెక్కింది. చక్కటి పాలసీలు తెచ్చి అమలు చేస్తే.. మంచి మార్పులు వస్తాయి. పీవీ ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించారు. చైనాలో డెంగ్ జియాపింగ్ ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. పీవీ భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. ఓవిధంగా చెప్పాలంటే పీవీని ఇండియా డెంగ్ జియా పింగ్ అని చెప్పొచ్చు’’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
అటల్‌తో కలిశాం… అభివృద్ధి చేశాం…
‘‘చాలామంది ప్రధానులతో కలిసి పని చేశాను. సంకీర్ణ ప్రభుత్వాలలో కీలక భాగస్వామిగా ఉన్నాను. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ మౌలిక వసతుల అభివృద్ధికి, టెలికాం విప్లవానికి బలం ఇచ్చారు. వాజ్‌పేయీతో పని చేయడం అదృష్టం. హైవేలు, ఐటి పార్కులు, ఎగుమతుల ప్రోత్సాహానికి చర్యలు తీసుకున్నారు. 1995లో నేను ఏపీలో రెండోతరం ఆర్థిక సంస్కరణలు తెచ్చాను. నేషనల్ హైవేల అభివృద్ధిపై నాటి ప్రధాని వాజ్‌పేయితో చర్చించాను. చాలా దారుణమైన పరిస్థితుల్లో అప్పట్లో రోడ్లు ఉండేవి. దీనికి ఓ విధానాన్ని రూపొందించాం. పైలెట్ ప్రాజెక్టుగా నెల్లూరు-చెన్నై నేషనల్ హైవే ప్రాజెక్టు చేపట్టాం. ఆ తర్వాత స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు తెచ్చాం. అలాగే టెలీకమ్యూనికేషన్ల రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు నాటి ప్రధాని వాజ్‌పేయీ నేతృత్వంలో శ్రీకారం చుట్టాం’’ అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
రైట్ టైమ్.. రైట్ లీడర్..
‘‘2014లో దేశానికి ఓ మలుపు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్‌వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ధైర్యంగా, లక్ష్యంతో ముందుకు సాగుతోంది. 2028 నాటికి జర్మనీని దాటి భారతదేశం ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానానికి చేరనుంది. ఆర్థిక స్థిరత్వం, జాతియతా భావం పెంపొందడం, అంతర్జాతీయంగా భారతదేశానికి గౌరవం దక్కడం వంటివి మోదీ నాయకత్వంలో సాధ్యమయ్యాయి. ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం గత దశాబ్దంలో 17 కోట్ల మందికిపైగా ప్రజలు తీవ్రమైన పేదరికం నుండి బయటపడ్డారు ఆపరేషన్ సింధూర్ ద్వారా మోదీ టెర్రరిస్టులకు ధీటుగా సమాధానం చెప్పారు. ఇండియా సత్తా చాటారు. పబ్లిక్ పాలసీలు ప్రజల కోసం తేవాలి. నరేంద్ర మోదీ తెస్తున్న సంస్కరణలు ప్రజల కోసం. ప్రజల మధ్య అసమానతలు తగ్గించేలా ఉన్నాయి. రైట్ లీడర్.. రైట్ టైమ్.. రైట్ ప్లేసులో ఉన్నారు. మోదీ సారధ్యంలో వివిధ రంగాల్లో భారతదేశం ప్రపంచంలో అగ్రభాగాన నిలుస్తోంది. సంస్కరణలు తేవడం ద్వారా పీవీ దేశానికి దిశ చూపారు. వాజ్‌పేయీ బలమైన పునాదులు వేశారు. మోదీ దేశానికి ఊపు ఇచ్చారు’’ అని చంద్రబాబు అన్నారు.
మంచి చేసేవారినే ఎన్నుకోవాలి…
‘‘ప్రజలు… యువత అన్ని కోణాల్లో ఆలోచించాలి. వారి ఆలోచన ఎప్పుడూ దేశాభివృద్ధి దిశగానే ఉండాలి. నేను చాలామంది నేతలను చూశాను. రాజకీయ నేతల్లో దూరదృష్టి కలవారు ఉన్నారు. సమర్ధులు ఉన్నారు. విధ్వంసకారులూ ఉన్నారు. ఎవరిని నమ్మాలి. ఎవర్ని ఎన్నుకోవాలి. భారతదేశ అభివృద్ధి కోసం ఎవరికి సహకరించాలనే దానిపై అందరూ ఆలోచన చేయాలి. స్మార్ట్ వర్క్ చేయాలి. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. క్వాంటం మిషన్ కేంద్రం ప్రారంభించింది. సిలికాన్ వ్యాలీ అమెరికాకు ఉంది. మనకు క్వాంటం వ్యాలీ ఎందుకు ఉండకూడదనే ఉద్దేశ్యంతో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. సంపద సృష్టించాలి. దాన్ని పేదలకు పంచాలి. ప్రపంచంలో మన దేశానికి ప్రత్యేకత ఉంది. మన సంస్కృతి మన గొప్పదనాన్ని చాటుతుంది’ అని ముఖ్యమంత్రి అన్నారు. కార్యక్రమంలో భారత ప్రధానుల మ్యూజియం, లైబ్రరీ కమిటీ ఛైర్మన్ సహా ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును సన్మానించేందుకు పీవీ కుమారుడు, మనవడు వేదిక మీదకు రాగా.. తనకు కాదని.. మీకే సన్మానం చేయాలంటూ చంద్రబాబు వారికి శాలువాలు కప్పి సత్కరించారు.