- కేసు వివరాలు కోరుతూ సిట్‌కు లేఖ
- పీఎంఎల్‌ఏ చట్టం కింద దర్యాప్తు చేస్తామని వెల్లడి
అమరావతి (చైతన్యరథం): ఏపీ మద్యం కుంభకోణం కేసును దర్యాప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధమవుతోంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదుకు రంగం సిద్ధం చేసింది. వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో తరలించారనే ఆరోపణలు రావడంతో ఈడీ రంగ ప్రవేశం చేసేందుకు చర్యలు చేపట్టింది. మద్యం కేసుకు సంబందించిన వివరాలను తమకు అందజేయాలని సిట్ చీఫ్, విజయవాడ నగర పోలీస్ కమిషనరుకు ఈడీ లేఖ రాసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం- 2002 ప్రకారం కేసు దర్యాప్తు చేస్తామని ఈడీ లేఖలో పేర్కొంది. మద్యం కుంభకోణంపై సీఐడి అధికారులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. సీఐడి నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ సర్టిఫైడ్ కాపీ ఇవ్వాలని, ఈ కేసుతో సంబంధం ఉందని ఇప్పటివరకు దర్యాప్తు అధికారులు గుర్తించిన వారి బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు అందజేయాలని కూడా ఈడీ కోరింది. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు, రిమాండ్ రిపోర్టులు తమకు అందజేయాలని కోరింది. ఈ కేసులో ఆరెస్టయిన నిందితులపై అభియోగపత్రం నమోదు చేస్తే వాటి కాపీలను సైతం ఇవ్వాలని లేఖలో కోరింది.
ఏపీలో లిక్కర్ స్కాం బహిరంగంగా జరిగిన దోపిడీ. కేవలం నగదు లావాదేవీలు చేయడం ద్వారా మొత్తం స్కాంను నడిపించారు. అధికారికంగా అమ్మిన మద్యానికి తోడు.. అనధికారికంగా కూడా పెద్ద ఎత్తున అమ్మకాలు నిర్వహించి ఆ సొమ్మును జేబుల్లో వేసుకున్నారు. మద్యం తయారీ, రవాణా, అమ్మకం సహా మొత్తం వైసీపీ నేతల గుప్పిట్లోనే సాగిపోయింది. దానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనే ముసుగు తగిలించారు. ఈ వ్యవహారంలో సీఐడీ సిట్ చాలా వరకూ వివరాలు సేకరించింది. వరుసగా అరెస్టులు చేస్తోంది. సూత్రధారి దిశగా కేసు దర్యాప్తు వెళుతోన్న సమయంలో ఈడీ రంగంలోకి దిగింది. మరో వైపు ఈ కేసులో కీలకమైన వ్యక్తులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ తమను అరెస్టు చేయకుండా చూడాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో వారి కోసం సిట్ వెదుకుతోంది. వారు ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి ఇళ్లల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.