- విజన్‌ను దానం చేయగల సమర్థుడు చంద్రబాబు
- అమెరికా రోడ్లకు సమానంగా ఏపీ రోడ్లు వస్తాయి
- ఏపీ రోడ్లకు సంబంధించి నాదగ్గర పెద్ద లిస్టే ఉంది
- రోడ్లు ప్రమాదాలను మరింతగా నియంత్రించాలి
- అందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నా
- జాతీయ రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ
మంగళగిరి (చైతన్య రథం): ఏ దేశానికైనా ఆర్థిక ప్రగతి సాధనకు రహదారులే కీలకమని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జాతీయ రహదారుల ప్రారంభం, శంఖుస్థాపనల్లో భాగంగా మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి గడ్కరి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ‘సభకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు’ అని అచ్చ తెలుగులో సంభోదించి ఆశ్చర్యపర్చిన గడ్కరీ.. దేశ ప్రగతిలో రహదారుల పాత్రపై ఉపన్యసించారు. రహదారుల కారణంగానే అమెరికా సంపన్నవంతమైన దేశంగా నిలిచిందన్న జాన్‌ఎఫ్ కెన్నడీ మాటలను గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు ఏపీని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. చంద్రబాబు తాను సీఎంగా దేశానికి విజన్ ఇచ్చారని అంటూ.. ‘కన్నును దానం చేయొచ్చు. చూపును దానం చేయలేం. అందుకు భవిష్యత్‌పై స్పష్టమైన అవగాహన ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. జ్ఞానాన్ని సంపదగా మార్చేదే విజన్ అని అభివర్ణించారు. చంద్రబాబు అభివృద్ధి దృక్పథాన్ని అభినందిచకుండా ఉండలేమన్నారు. కొత్త సాంకేతికత దేశ అభివృద్ధి స్వరూపాన్నే మార్చేస్తుందని గడ్కరీ వ్యాఖ్యానించారు.
తాను షిప్పింగ్ మంత్రిగా ఉన్నప్పడు నావద్ద 9 లక్షల కోట్లు బడ్జెట్ ఉంటే.. 12 లక్షల కోట్లు పనులు చేశామని గడ్కరీ గుర్తు చేసుకున్నారు. పోర్టులున్న రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని, బస్సు, రైలుకన్నా జలమార్గంలో చాలా ఖర్చు తగ్గుతుందన్నారు. ఇండియాలో లాజిస్టిక్ కాస్ట్ 16శాతం ఉంటే.. చైనాలో 8 శాతం.. అమెరికాలో 12 శాతం ఉందని, మనం 9శాతం లాజిస్టిక్ కాస్టుకువస్తే ఉద్యోగాలు వస్తాయి, ఎగుమతులు పెరుగుతాయన్నారు. ఆరు నెలలకు ముందు జపాన్‌ను వెనెక్కినెట్టి మనం ఆ స్ధానానికి ఎగబాకామని ఇది శుభసూచకమన్నారు. మన రైతులు కేవలం అన్నదాతే కాదు ఇంధన దాతలని, గతంలో ఇథనాల్‌ను దేశీయ ఇంధనంలోకి తేవడంవల్ల ఎంతో ఖర్చు తగ్గిందని, ఇదంతా రైతులువల్లే సాధ్యమైందన్నారు. ‘నేను ఏది చెపుతానో అదే చేసి చూపిస్తా. అందులో సందేహం లేదని’ గడ్కరీ స్పష్టం చేశారు. ఇథనాల్‌ను డీజిల్‌లోనే కాదు ఎయిర్ ఫ్యూయల్‌లో వినియోగించాలని ఆలోచన చేస్తున్నామన్నారు. నేను ఎలక్ట్రిక్ కార్‌ను ప్రారంభించినప్పడు పాత్రికేయలు కారు ఆగిపోతే ఏం చేస్తారు? అన్నారు. మరి ఇప్పడు ఏకంగా ఎలక్ట్రిక్ బస్సులు కూడా వచ్చాయని గడ్కరీ పేర్కొన్నారు. బ్యాటరీల తయారీలలో నూతన మార్గాలు వచ్చాయి. అలాగే ఐదేళ్లలో భారత ఆటోమోబైల్ ఇండస్ట్రీ ముందుకు వెళ్తోంది. ఏపిలో గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌వస్తే రైతులకు లక్షల్లో ఆదాయం చేకూరే అవకాశం ఉందన్నారు. దేశ ఆర్ధిక వృద్ధిలో 22శాతం వ్యవసాయం నుంచి వస్తోందన్నారు. విజయవాడ `మచిలీపట్నం, వినుకొండ- గుంటూరు, కోటప్పకొండ- గుంటూరు, ముదునూరు-కడప, హైదరాబాబ్ -విజయవాడ 6లేన్లు, హైదారాబాద్ నుండి విజయవాడకు గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవే వస్తుంది. దానివల్ల ప్రయాణ సమయం 2 గంటలకు పైగా ఆదా అవుతుందని గడ్కరీ వివరించారు.
ఏపీలో లక్ష కోట్ల పనులు చేస్తాం. ఏపీ రోడ్లు అమెరికా రోడ్లతో సమానంగా తయారవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. నాగపూర్, జబల్‌పూర్ మధ్య పశుగ్రాసంను బిటమిన్‌గా మార్చి కిలోమీటర్ రోడ్డు వేశామన్నారు. ఆ రహదారి పెట్రోలియం ప్రాడెక్టుతో వేసిన రోడ్డుకంటే బెటర్ అని నిపుణులు తేల్చారని గుర్తు చేశారు. రోడ్లు బాగా వేయాలనే బాధ్యత ప్రధాని నాకు అప్పగించారన్నారు. నావద్ద ఏపీకి సంబంధించి అతి పెద్ద లిస్టు ఉందని, వెబ్‌సైట్లో వాటి వివరాలు (రోడ్లు ప్రాజెక్టు గురించి) ఉంచుతామన్నారు. రోడ్డు సేఫ్టీకి సంబంధించి శంకర్ మహదేవన్ గీతాన్ని విన్నామని, రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఏపిలోనూ యాక్సిడెంట్ల సంఖ్య ఎక్కవగా నమోదవుతున్నాయని, ప్రతిజిల్లాలో వాటిని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలవరానికి హెలికాప్టర్‌లో వెళ్లినప్పడు ఎంతో నీరు సముద్రంలో కలిసిపోతుంది అని గుర్తించామన్నారు. గోదావరి నుండి కావేరి వరకూ నీటిని ఉపయోగించుకోవచ్చని, ఈ దేశంలో ఫుష్కలంగా నీరు ఉంది… నీటి వినియోగం సరిగా లేదని గడ్కరీ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో భాగంగా 27 కొత్త ప్రాజెక్టులకు శంఖుస్ధాపనతో పాటు, రెండు ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీ.. సీఎం, డిప్యూటీ సీఎంలతో కలిసి జాతికి అంకితం చేశారు.