అమరావతి (చైతన్య రథం): విశాఖలో జరిగే ఈస్ట్‌కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సులో కీలకమైన అంశాలపై చర్చించనున్నారు. నేడు మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖలోని నోవోటెల్ హోటల్‌లో సదస్సుకు హాజరవుతారు. మారిటైమ్ లాజిస్టిక్స్‌పై దృష్టి సారించేలా 20 కంపెనీలకు చెందిన సీఈఓలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అలాగే మారిటైమ్ రంగంలోని ఆరు స్టార్టప్‌లతోనూ సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. బ్లర్గ్స్ ఏఐ, డాకర్ విజన్, ఓల్టియో మారిటైమ్, ఆటోమాక్సిస్, ఈజీలేన్, ఎయిమ్ లొకేట్ తదితర స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో సీఎం సంభాషించనున్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దే అంశంపై ముఖ్యమంత్రి పారిశ్రామిక ప్రతినిధులతో చర్చించనున్నారు. వారినుంచి సూచనలు సలహాలు తీసుకోనున్నారు. ఈ అంశంపై నిర్వహించనున్న ప్లీనరీ సెషన్‌లో పాల్గోనున్న సీఎం.. ఏపీ మారిటైమ్ బోర్డు, జీఎఫ్‌ఎస్టీ సంయుక్తంగా రూపొందించిన వ్యూహాత్మక పత్రాలను విడుదల చేయనున్నారు. అలాగే ఎయిర్ కార్గో ఫోరమ్ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్‌ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సమావేశానికి జీఎఫ్‌ఎస్టీ ఉపాధ్యక్షుడు ఎస్‌పి టక్కర్, ఏపీ మారిటైమ్ బోర్డు అధికారులు, లాజిస్టిక్స్ రంగానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు.