మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. తొలుత పోలీసుల గౌరవందనం స్వీకరించి, ఆ తర్వాత నూతన డీజీపీగా సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఏడీజీలు శంకరబ్రత బాగ్చీ, కేఎల్ మీనా, అతుల్ సింగ్, ఐజీ వినీత్ బ్రిజ్ లాల్, శ్రీకాంత్, డీఐజీలు రాజకుమారి, నవీన్ జెట్టి, మోహన్ రావు, తదితరులు ద్వారకా తిరుమలరావుకు అభినందనలు తెలిపారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కర్నూలు ఏఎస్పీగా మొదటి పోస్టింగ్ చేపట్టారు. తర్వాత కామారెడ్డి, ధర్మవరంలో ఏఎస్పీగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎస్పీగా పదోన్నతి పొందాక… అనంతపురం, కడప, మెదక్ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే, సీఐడీ, సీబీఐ విభాగాల్లో ఎస్పీగా పనిచేశారు. అనంతపురం, హైదరాబాద్ రేంజ్‌తో పాటు ఎస్‌ఐబీలో డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 జూన్ నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండీగా పనిచేశారు. తిరుమలరావుకు నిక్కచ్చిగా వ్యవహరించే సమర్థ అధికారిగా పోలీసు శాఖలో గుర్తింపు ఉంది.