- దేశంలోనే నెంబర్ వన్ ఏపీ డ్వాక్రా సంఘాలు
- రుణాల ఎగవేత కేవలం 0.02 శాతం మాత్రమే
- రుణాలివ్వడానికి ఆసక్తి చూపిస్తోన్న బ్యాంకర్లు
- డ్వాక్రాల కోసమే ప్రత్యేక ఎస్‌ఎల్‌బీసీ సమావేశాలు
- రాష్ట్రంలో 875 మిల్లెట్ కేఫ్‌ల ఏర్పాటు: సెర్ప్ కార్యదర్శి
- సెర్ప్ కార్యదర్శికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు, పొదుపు సంఘాలు బ్యాంకుల్లో రూ.20,739 కోట్లు పొదుపు చేశారని, దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని సెర్ప్ కార్యదర్శి వి కరుణ తెలిపారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆమె సెర్ప్ కార్యకలాపాలపై ప్రజంటేషన్ ఇచ్చారు. డ్వాక్రా సంఘాలు రుణాలు పొందేలా జిల్లా కలెక్టర్లు దృష్టి సారించాలని కోరారు. డ్వాక్రా సంఘాల్లో రుణాల ఎగవేత శాతం కేవలం 0.02 శాతం మాత్రమే ఉందని, కాబట్టి ఈ సంఘాలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు సైతం వెనుకాడటం లేదని, బ్యాంకర్లు ఎంతో సంతోషంగా రుణాలిచ్చేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఇటీవలే డ్వాక్రా సంఘాల కోసమే ప్రత్యేకంగా స్టేట్ లెవల్ బ్యాంకర్ల సమావేశం నిర్వహించామన్నారు. ప్రస్తుతం రూ.40,424 కోట్లతో స్త్రీనిధి, ఉన్నతి బ్యాంకు లింకేజీ కల్పించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షలమంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని, మొత్తం 8.32 లక్షల డ్వాక్రా సంఘాలున్నాయని వెల్లడిరచారు. పొదుపు సంఘాలు తీసుకుంటున్న రుణాల్లో 74 శాతం సంపద సృష్టి, 13శాతం ఉత్పాదక రుణాలు, 13 శాతం వినియోగానికి వాడుతున్నట్టు తెలిపారు. డ్వాక్రా సంఘాల పనితీరుపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ విషయంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ పనితీరు ఆదర్శప్రాయంగా ఉందన్నారు. ఈ ఏడాది యువతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. మూడు నాలుగు సంఘాల్లో కనీసం ఒక యువతి అయినా సభ్యురాలిగా ఉండేలా చూస్తున్నామని తెలిపారు.
పాడిరంగంపట్ల మహిళల ఆసక్తి
రాష్ట్రంలోని పొదుపు సంఘాల్లోని మహిళలు ఎక్కువగా పాడి పరిశ్రమపట్ల ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నారని చెప్పారు. 6,84,876 పాడి జీవాల కొరకు రుణాలు కావాలని కోరుతున్నారని, ఈ రుణాల విలువ రూ.8,989 కోట్లు ఉందన్నారు. వీటిలో ఇప్పటికే 3,39,820మందికి రూ.4,415 కోట్లు రుణాలు అందించామన్నారు. మిగిలిన రుణాలు కూడా త్వరితగితన పొందేలా జిల్లా కలెక్టర్లు చొరవ చూపాలన్నారు.
పొదుపు సంఘాలతో మిల్లెట్ కేఫ్‌లు
పొదుపు సంఘాల్లోని మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించడానికి చొరవ చూపుతున్నారని చెప్పారు. ఇప్పటికే 3 వేలమంది పొదుపు సంఘాల మహిళలు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా మారడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఈ సంఘాలతో మిల్లెట్ కేఫ్‌లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మొత్తం 875 మిల్లెట్ కేఫ్‌లు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యమని.. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు 12 జిల్లాల్లో 200 యూనిట్లు ఏర్పాటు చేశామని, ఇవి విజయవంతంగా నడుస్తున్నాయని వెల్లడిరచారు. అలాగే బాంబూ మిషన్ ప్రాజెక్టు కింద మహిళలు వెదురు సాగుకు ప్రోత్సహిస్తున్నామన్నారు.
440 నమో డ్రోన్ దీదీలు
నమో డ్రోన్ దీదీ పథకం కింద రాష్ట్రంలో 440మంది మహిళలను మహిళా డ్రోన్ ఆపరేటర్లుగా చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే ఈ పథకం కింద 88మందిని డ్రోన్ ఆపరేటర్లుగా మార్చామన్నారు. అలాగే 100 ఎగ్ కార్ట్ దీదీలు ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యమని, ఇప్పటికే 250 మహిళలు ఈ పథకం కింద ఎగ్ కార్ట్‌లు ఏర్పాటు చేసుకున్నారని, 5వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలతో ఈజీమార్ట్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
సీఎం ప్రశంసలు
డ్వాక్రా సంఘాలు, పొదుపు సంఘాల పనితీరు పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. డ్వాక్రాలకు వారి పొదుపు సొమ్ము, రుణాల వివరాలు తదితర అన్ని సమస్యల గురించి తెలుసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వినియోగించడంపై ఆయన అభినందించారు. సెర్ప్ కార్యదర్శి వి కరుణను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కరుణకు ఏ బాధ్యత అప్పజెప్పినా ఎంతో బాధ్యతతో చేస్తారని, పొదుపు సంఘాలను సమర్థవంతంగా పనిచేయించడంలో ఆమె ఎంతో చొరవ చూపించారని అభినందించారు.