- ‘ఢిల్లీ’తో పోలిస్తే ఎన్నో రెట్లు పెద్దది
- జగన్‌రెడ్డి బంధువు సునీల్‌రెడ్డి ద్వారా రూ.2 వేల కోట్లు దుబాయ్ తరలించారు
- ఈడీ విచారణ జరపాలి
- లోక్‌సభలో టీడీపీ ఎంపీ లావు సంచలన ఆరోపణ
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కన్నా జగన్ రెడ్డి హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం ఎన్నో రెట్లు పెద్దదని టీడీపీపీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభలో సోమవారం సంచలన ఆరోపణ చేశారు. మద్యం కుంభకోణలో జగన్ రెడ్డి వేలకోట్లు సంపాదించారని ఆరోపించారు. నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ ఉత్పత్తికి ముందే స్కాం చేసిన ఘనుడు జగన్. బంధువు సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్‌కి జగన్ రెడ్డి రూ. 2వేల కోట్ల మద్యం డబ్బు తరలించారని ఆరోపించారు. ఇప్పటికే వీటన్నిటిపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ ఎంక్వయిరీకి ఆదేశించింది. విదేశీ లావాదేవీలు కూడా ఉన్నాయి కాబట్టి, ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ చేయాలని కేంద్రాన్ని లావు కోరారు. రూ. 2,000 కోట్లు ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్‌కు జగన్ మళ్లించారని లావు ఆరోపించారు. వైసీపీ హయాంలో ఆదాన్, గ్రేసన్స్, లీలా, జేఆర్ అసోసియేట్స్, పీవీ స్పిరిట్స్ లాంటి 26 కొత్త కంపెనీలు భారీగా మద్యం సరఫరా ఆర్డర్లు పొంది అదే స్థాయిలో లాభాలు పొందాయని లావు తెలిపారు.
నాసిరకం బ్రాండ్లతో స్కాం..
రూ.20,356 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను గోప్యంగా నిర్వహించారని ఎంపీ లావు తెలిపారు. జగన్ తన ఆధీనంలోని సంస్థల ద్వారా మద్యం వ్యాపారాన్ని పూర్తిగా నియంత్రించి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రముఖ మద్యం బ్రాండ్లను పూర్తిగా తొలగించి, నాసిరకంగా ఉన్న కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టారని చెప్పారు. నంద్యాలలోని ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లాంటి ప్రముఖ డిస్టిలరీలను బలవంతంగా స్వాధీనం చేసుకుని, కొత్త బినామీ డిస్టిలరీలను ఏర్పాటు చేశారన్నారు. తక్కువ నాణ్యత కలిగిన మద్యాన్ని ఉత్పత్తి చేయించి, వేల కోట్ల రూపాయలు అధికార పార్టీ అనుబంధ వ్యాపారస్తుల చేతికి వెళ్లేలా చేశారని ఎంపీ లావు ఆరోపించారు.