అమరావతి (చైతన్యరథం): మెగా డీఎస్సీ` 2025 మెరిట్ జాబితా శుక్రవారం రాత్రి విడుదలైంది. మెరిట్ జాబితాను డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచారు. అభ్యర్ధులు ఈ వెబ్‌సైట్ల నుంచి మాత్రమే సమాచారం పొందాలని సూచించారు. వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా ‘జోన్ ఆఫ్ కన్సిడరేషన్’ లోకి వచ్చిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించనున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి.. ముందే అప్‌లోడ్ చేయాలి
కాల్ లెటర్ అందిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని కన్వీనర్ ఓ ప్రకటనలో సూచించారు. వెరిఫికేషన్‌కు హాజరు కావడానికి ముందే అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం తప్పనిసరన్నారు. వెరిఫికేషన్ సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్ లిస్టును డీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా, తగిన విద్యార్హతలు లేనట్లుగా రుజువైనా మెరిట్ లిస్టులో తరువాత ఉన్న అభ్యర్ధులకు అవకాశం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.