- వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్
- అవకాశాలు అందుకోవడంలో చంద్రబాబు ముందుంటారని పీయూష్ ప్రశంసలు
- డ్రోన్ -స్పేస్ సిటీల్లో పెట్టుబడులకు ఆరు సంస్థలతో ఏపీ ఎంవోయూలు
విశాఖపట్నం (చైతన్య రథం): రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికనుంచే ఈ శంకుస్థాపనలు జరగడం గమనార్హం. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీకి శంకుస్థాపన జరపడం చారిత్రాత్మకంగా నిలిచిపోతుందన్నారు. ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్‌ని తామెప్పుడూ అందిపుచ్చుకుంటూనే ఉంటామని… డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు కేంద్రం మరింత సాయం చేయాలని సీఎం కోరారు. త్వరలో రాష్ట్రంలో డ్రోన్ ట్యాక్సీలు తీసుకువచ్చేంతలా ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తామని, ఇందుకు అవసరమైన డ్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
క్వాంటం వ్యాలీని జనవరిలో ప్రారంభిస్తున్నామని, అలాగే గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీని తీర్చిదిద్దుతున్నామన్నారు. మరోవైపు డ్రోన్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వాటికి డిమాండ్ విస్తృతంగా ఉందని, దీనిని ముందుగానే ఊహించి డ్రోన్ సిటీని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఆలోచనను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. ఐటీకి గుర్తింపులేని సమయంలోనే ఐటీ భవిష్యత్‌ను ఊహించి ఆరోజు అవకాశాలను సీఎం చంద్రబాబు అందిపుచ్చుకున్నారని ప్రశంసించారు. ఇప్పుడు డ్రోన్లు, స్పేస్, ఏఐ, క్వాంటం విషయంలోనూ చంద్రబాబు ముందంజలో ఉన్నారని అన్నారు. దేశంలోనే తొలిసారి డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను నెలకొల్పిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని చెప్పారు. దేశం కోసం, రాష్ట్రంకోసం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కలిసి కట్టుగా పనిచేస్తున్నారని అభినందించారు.
300 ఎకరాల్లో ఓర్వకల్లులో డ్రోన్ సిటీ
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీని నిర్మించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో డ్రోన్ డిజైన్, తయారీ, సేవలు, ఆర్ అండ్ డీ రంగాల్లో అభివృద్ధి చెందేలా డ్రోన్ సిటీ నిర్మాణం జరగనుంది. డ్రోన్ సిటీలో అధునాతన తయారీ పార్కులు, టెస్టింగ్ -సర్టిఫికేషన్ సెంటర్ల ఏర్పాటుతో పాటు 25,000 మంది రిమోట్ పైలట్‌లకు శిక్షణ అందిస్తారు. డ్రోన్ సిటీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 40,000 మందికి పైగా ఉద్యోగావకాశాలు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 50 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటు కానున్నాయి. డ్రోన్ సిటీలో 20 శాతం క్యాపిటల్ సబ్సిడీ, 100 శాతం ఎస్జీఎస్టీ రాయితీ వంటి ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది.
దేశంలోనే తొలిసారి ట్విన్ స్పేస్ సిటీస్
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో ట్విన్ స్పేస్ సిటీస్ ఏర్పాటవుతున్నాయి. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ట్విన్ స్పేస్ సిటీస్ నిర్మాణం జరగనుంది. ఉపగ్రహ ప్రోటోటైప్ తయారీ, స్పేస్ టెక్ స్టార్టప్ ఇంక్యుబేషన్, ఉపగ్రహ విభాగాల తయారీ, లాంచ్ లాజిస్టిక్స్ సపోర్ట్‌కు ఇక్కడ ప్రాధాన్యం ఇస్తారు. స్పేస్ సిటీలో 10 ఏళ్లలో రూ.25,000 కోట్ల పెట్టుబడులు, 35,000కు పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఏపీ స్పేస్ పాలసీ 4.0లో భాగంగా స్పేస్ టెక్ ఫండ్ కింద రూ.100 కోట్ల కేటాయించడం జరిగింది. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీల నిర్మాణంతో భారత వైమానిక%-%అంతరిక్ష రంగాల్లో కొత్త శకం ఆరంభం కానుంది. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనకు డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ప్రాజెక్టులు కీలకం కానున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వంతో వివిధ సంస్థల ఒప్పందాలు
సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో స్పేస్ సిటీకి సంబంధించి బ్లూ స్పేస్, ఎథర్నల్ ఎక్స్‌ప్లోరేషన్ గిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం చేసుకున్నాయి. అలాగే డ్రోన్ సిటీలో పెట్టుబడులకు అల్గోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, అకిన్ అనలిటిక్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, సెన్సెల్మేజ్, ఏర్పేస్ ఇండస్ట్రీస్ సంస్థలు ఎంఓయూ చేసుకున్నాయి. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీల నిర్మాణంతో టెక్నాలజీ, నైపుణ్యాలు, పరిశ్రమలు విస్తరణకు విస్తృత అవకాశాలు రానున్నాయి. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, సీఎస్ విజయానంద్, మంత్రులు టీజీ భారత్, బీసీ జనార్ధన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ సతీష్‌రెడ్డి, ఎస్ సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు.













