- రూ.9,514 కోట్లతో అమృత్-2 పెండింగ్ పనులు
- 506 పనులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
- రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్ట్లకు అనుమతి
- జాతీయ రహదారితో సీడ్ యాక్సెస్ రోడ్డు అనుసంధానం
- 7 క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
- ఏడాదిలో రెవెన్యూ సమస్యల పరిష్కారం
- రూ.5445 కోట్లతో పీఎం సూర్యఘర్ ప్రాజెక్ట్ అమలు
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు
- వెల్లడించిన మంత్రి పార్థసారథి
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక భవిష్యత్తుకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. పెట్టుబడుల ఆమోదం, క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ ఏర్పాటు నుండి ఉద్యోగుల డీఏ మంజూరు వరకు… పర్యాటక రంగం నుండి క్రీడల ప్రోత్సాహం వరకు… అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. నగరాలు, పట్టణాల్లో తాగునీటి ఇబ్బందులను పరిష్కరించేలా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించి అమృత్ 2 పథకంలో భాగంగా దాదాపు రూ.9,514 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్ట్లకు అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన మంత్రివర్గ సమావేశం లో 44 అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ నిర్ణయాలను గృహనిర్మాణ, సమాచారశాఖల మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. రూ.163కోట్లతో అమరావతిలో లోకభవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచే ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
రాజధాని అమరావతిలో లోకభవన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, రెండు గెస్ట్ హౌస్లు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి మంత్రివర్గం అంగీకారం లభించింది. ఎల్ 1 బిడ్లను ఆమోదించే బాధ్యతను సీఆర్డీఏ కమిషనర్కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు రూ.532 కోట్ల మేర టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎన్హెచ్ 16తో అనుసంధానించే ఇంటర్ చేంజ్, వంతెనలు, అండర్ పాస్లు ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ తో
ఈ-3 రోడ్ విస్తరణ పనులు రూ.532 కోట్లతో రెండేళ్లలో పూర్తి చేసేలా నిర్ణయం. ఈ మేరకు ఈ-3 రోడ్డు విస్తరణకు ఎల్ 1 బిడ్ ఆమోదానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీకి బాధ్యతలు అప్పగించారని మంత్రి పార్థసారథి తెలిపారు.
సాంకేతిక విప్లవం దిశగా..
రాష్ట్రంలో సాంకేతిక విప్లవం కోసం ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ (ITE&C) రంగంలో మొత్తం 11 కీలక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్ అమరావతిలో ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా, అమరావతిని దేశంలోనే మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్గా అభివృద్ధి చేయడంలో భాగంగా, అత్యాధునిక సాంకేతికతకు సంబంధించిన 7 క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్టులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. క్వాంటం కంప్యూటింగ్లో రూ.1421 కోట్ల రూపాయల పెట్టుబడులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 3057 మందికి క్వాంటం అప్లికేషన్స్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే ప్రతిపాదనలకు అనుమతి ఇచ్చింది. క్వాంటం కంప్యూటర్లు తయారు చేయడం కోసం ముందుకు వచ్చిన పలు సంస్థల ప్రతిపాదనలకు, అలాగే క్వాంటం కంప్యూటింగ్లో శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వివరించారు. ఈ ప్రాజెక్టులను త్వరితగతిన నెలకొల్పేందుకు ప్రభుత్వం షరతులతో కూడిన రాయితీలను కల్పించేందుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.
పెట్టుబడులకు ఆమోదం
ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో ఆమోదించిన పలు పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 సంస్థలకు సంబంధించి రూ.20,444 కోట్ల రూపాయల పెట్టుబడులకు కేబినెట్ అనుమతి ఇచ్చిందని మంత్రి తెలిపారు. వీటి ద్వారా 56వేల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగనుందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఇవికాక పరిశ్రమలు, వాణిజ్య శాఖ తరఫున మొత్తం 14 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో మొత్తం రూ. 15,000 కోట్లకు పైగా పెట్టుబడులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. తద్వారా సుమారు 1 లక్షకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెంచడాన్ని సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. విద్యుత్ చార్జీలను రూ.5.12 నుంచి 4 రూపాయలకు తీసుకురావాలన్నది సీఎం లక్ష్యమని చెప్పారు. దీని కోసం రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం పలు సంస్థల ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించిందన్నారు.
ఇంధన రంగంలో భాగంగా, చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో M/s. Shreshtta Renewables Pvt. Ltd. సంస్థకు 10 TPD (టన్నులు ప్రతి రోజు) కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) కేటాయింపునకు మరియు ప్రోత్సాహకాల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద అనంతపురం జిల్లాలోని కనేకల్, బొమ్మనహాళ్ మండలాల్లోని గ్రామాల్లో 152 వీఔ విండ్, 148 MW AC/ 200 MWp DC సోలార్ సామర్థ్యంతో కూడిన 300 వీఔ విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు గనేకో త్రీ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. శ్రీసత్యసాయి జిల్లా మడకసిర, గుడిబండ మండలాల్లో 1700 MW AC/ 2125 MWp DC ప్రాజెక్ట్, ఎనర్జీ స్టోరేజ్ ఏర్పాటు కోసం చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తెట్టు రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీ-మోడల్ రైల్ కార్గో టెర్మినల్ ఏర్పాటుకు చెవూరు గ్రామంలోని 153.77 ఎకరాల భూమిని న్యూఢిల్లీకి చెందిన మెస్సర్స్ రామయపట్నం కార్గో రిసెప్షన్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
అటానమస్ మారిటైమ్ షిప్ర్యిర్డ్ స్థాపనకు ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు జిల్లా, బోగోలు మండలం లోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో మొత్తం 29.58 ఎకరాల భూమిని (ఇందులో 7.58 ఎకరాలు వాటర్ ఫ్రంట్ భూమి, 22.00 ఎకరాలు హార్బర్ ໖) M/s. Sagar Defence Engineering Pvt. Ltd సంస్థకు కేటాయించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో CIPSA TEC ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,140 కోట్ల ໖ – PCB(Printed Circuit Board) ల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. విశాఖపట్నంలో 3 ఐటీ క్యాంపస్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా తక్షణమే 1,667 ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలు, వాణిజ్య శాఖ తరఫున వచ్చిన 14 ప్రధాన పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో ఇఫ్కో కిసాన్ సెజ్ లిమిటెడ్ సంస్థ 2,776 ఎకరాల్లో మల్టీ-ప్రోడక్ట్ సెజ్ అభివృద్ధికి రూ.870కోట్ల పెట్టుబడిని ఆమోదిం చింది. ఇది భవిష్యత్తులో అదనంగా రూ.9,400 కోట్ల సంభావ్య పెట్టుబడికి మార్గం సుగమం చేస్తుంది.
మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ALEAP – మహిళా మీవీజు ఇండస్ట్రియల్ పార్కు ఆమోదం లభించింది. రూ.22.48 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ పార్క్ మహిళలకు సుమారు 2,000 ఉద్యోగాలను సృష్టిస్తుంది. రాష్ట్రాన్ని ప్రీమియం పర్యాటక గమ్యస్థానంగా మార్చేందుకు, విశాఖపట్నం, బాపట్ల మరియు తిరుపతి లో అంతర్జాతీయ బ్రాండెడ్ 5-స్టార్ హోటళ్లకు సం బంధించిన 4 ప్రధాన పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా రూ.784.39 కోట్ల పెట్టుబడి, 4,300కు పైగా ఉద్యోగాలు సృష్టించబడతాయి.
కృష్ణపట్నం పోర్టులో 4731 ఎకరాలు మల్టీ ప్రాడక్ట్ సెజ్ ఏర్పాటు కోసం 2010లో ల్యాండ్ కొనుగోలు చేశారని, అయితే అక్టోబర్ 2019లో గత ప్రభుత్వం ఈ భూ కేటాయింపులను రద్దు చేసిందన్నారు. దీన్ని కోర్టు కొట్టి వేయడం వల్ల ప్రాజెక్టు పదేళ్లు ఆలస్యమైనందున పెనాల్టీని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. 3 ఏళ్లలో తొలిదశ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించేందుకు సమయం ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో పాలార్ నదిపై చెక్ డ్యాం నిర్మాణానికి రూ.15.96 కోట్ల నిధులను పెంచే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 417 టీచర్ పోస్టులను అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు పునర్నిర్మాణానికి కేబినెట్ ఓకే చెప్పింది. మహిళల వన్డే ప్రపంచ కప్ గెలుపులో విశేష ప్రతిభ చూపిన రాష్ట్ర క్రీడాకారిణి శ్రీ చరణికి ప్రోత్సాహకం ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామన్నారు. శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నగదు, విశాఖపట్నంలో 500 గజాలు ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్ధసారథి చెప్పారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. పీఎం సూర్యఘర్ కింద ఇంటిపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకునే బీసీలకు అదనంగా సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.20వేల అదనపు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం కలిన బీసీ వినియోగదారులకు రూ.20 వేల సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
రూ.5445 కోట్ల అంచనా బడ్జెట్తో పీఎం సూర్యఘర్ ప్రాజెక్టును రాష్ట్రంలో అమలు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు సీఎం తెలిపారన్నారు. ఏడాది కాలంలోనే రెవెన్యూ సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించాలని రెవెన్యూ విభాగాన్ని సీఎం ఆదేశించారని తెలిపారు. 22 ఏ, మ్యుటేషన్, రీ సర్వే సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించాలని.. ఆపై రెవెన్యూ రికార్డులన్నింటినీ బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్లో సేవ్ చేయాలని సీఎం సూచించినట్లు తెలిపారు. తద్వారా రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ కాకుండా శాశ్వత పరిష్కారం కల్పించాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. హోం శాఖ తరఫున, పాత చట్టాల స్థానంలో కొత్తగా ‘ది ఆంధ్ర ప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ఆక్ట్, 2025’ ముసాయిదా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడానికి ఆమోదం లభించిందని మంత్రి పార్థసారథి తెలిపారు.















