- అమరావతి అన్‌స్టాపబుల్
- ఏపీ అంటే మోదీకి ఎంతో ప్రేమ
- రాజధాని పనులు పునఃప్రారంభించారు
- వంద పాకిస్థాన్లు వచ్చినా గడ్డి కూడా పీకలేరు:లోకేశ్
అమరావతి : ‘ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ పైనా.. అమరావతి పైనా.. ఎంతో ప్రేమ. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరికీ తెలుసు. అయినా ఈ కార్యక్రమానికి వచ్చారు. మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు పునఃప్రారంభమవుతున్నాయి. ఇక అమరావతికి తిరుగులేదు. అమరావతి అన్‌స్టాపబుల్’ అని మంత్రి లోకేశ్ అన్నారు. వెలగపూడిలో శుక్రవారం జరిగిన అమరావతి పనుల పునఃప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 2019-24 మధ్యకాలంలో విధ్వంస పాలన నడిచింది. చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపాలని చూశారు. ఒక్క ఇటుక పెట్టకుండా మూడు రాజధానులంటూ ఐదేళ్లు కాలం గడిపేశారు. 1,631 రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది. ‘జై అమరావతి’ అన్నందుకు రైతులకు సంకెళ్లు వేశారు. మహిళా రైతుల్ని పోలీసుల బూటుకాళ్లతో తన్నించారు. 270 మంది రైతులు మృతి చెందారు. 3వేల మందిపై అక్రమ కేసులు పెట్టారు. ఎన్ని కుట్రలు చేసినా అమరావతిని మాత్రం ఆపలేకపోయారు. ఆపడానికి.. పీకడానికి అమరావతి ఎవరి ఇంట్లోనో పెంచుకున్న పెరటి మొక్క కాదు. జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని. ప్రధాని నమో శంకుస్థాపన చేసిన అమరావతిని ఆపే దమ్ము ఎవరికీ లేద’ని లోకేశ్ స్పష్టం చేశారు..
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు
రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జెట్‌స్పీడ్‌తో జరగబోతోంది. ఏపీ కోరిన ప్రతి కోరికను ప్రధాని మోదీ తీరుస్తున్నారు. విశాఖ రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, నక్కలపల్లి బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. విశాఖ ఉక్కును కాపాడారు. ఇప్పుడు అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించడమే కాకుండా పనులు తిరిగి ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారు. ఏపీలో ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. ఒకపక్క నమో… మరోపక్క మన చంద్రబాబు. రెండూ పవర్‌ఫుల్ ఇంజన్లు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమలు అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమం అనే జోడెద్దుల బండిని పరుగులు పెట్టిస్తున్నారు. ఒకే రాజధాని… అభివృద్ధి వికేంద్రీకరణ అజెండాతో పనిచేశాం. ఇప్పటికీ మాది అదే అజెండా.
20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు, వాటిద్వారా 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒప్పందాలు కుదర్చుకున్నాం. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం. రూ.1,85,000 కోట్ల పెట్టుబడి, 57వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ విశాఖపట్నం రాబోతోంది. రూ.1,36,000 కోట్ల పెట్టుబడి, 55వేల ఉద్యోగాలు కల్పించే ఆర్సెల్లార్ మిట్టల్ అనకాపల్లికి వస్తోంది. రూ.97,000 కోట్ల పెట్టుబడి, 3వేల మందికి ఉద్యోగాలు కల్పించే బీపీసీఎల్ రామాయపట్నం రాబోతోంది. తిరుపతి జిల్లాకు ఎల్జీ ఎలక్ట్రానిక్స్, కర్నూలు, కడప, అనంతపురానికి రెన్యువబుల్ ఎనర్జీ, ప్రకాశానికి రిలయన్స్ సీబీజీ, ఉత్తరాంధ్రకు ఫార్మా, ఐటీ ఇలా అన్ని జిల్లాలను అభివృద్ధి చేయబోతున్నాం, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం.
నమో దెబ్బలకు మ్యాప్‌లో పాక్ మిస్
పాకిస్థాన్ గీత దాటింది. అమాయకుల్ని చంపి చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్కటి కాదు వంద పాక్‌లు వచ్చినా భారతదేశం నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. వంద పాకిస్థాన్లకు సమాధానం చెప్పే నరేంద్ర మోదీ మిస్సైల్ మనదగ్గర ఉంది. మన సింహం నమో కొట్టే దెబ్బలకు ప్రపంచ పటంలో పాకిస్థాన్ మిస్సింగ్ అని రావడం ఖాయం. పాక్‌కు దీటుగా బదులివ్వడానికి దేశం మొత్తం ప్రధానికి అండగా నిలుస్తుంది. పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళులర్పిస్తున్నాం. వారి కుటుంబాలకు దేశం అండగా ఉంటుంది. కులగణన చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం ఒక సంచలనం. ఇతరులు దశాబ్దాలుగా సంకోచిస్తూ వచ్చిన కీలక అంశంపై మోదీ ధైర్యంగా నిర్ణయం తీసుకుని చరిత్రను తిరగరాశారు. అణగారిన వర్గాలకు సాధికారత కల్పించాలనే నిబద్ధతకు లోబడి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. వెనుకబడిన వర్గాల సామాజిక న్యాయం కోసం దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాలకు ఈ నిర్ణయం పరిష్కారం చూపుతుంది’ అని లోకేశ్ పేర్కొన్నారు.