అమరావతి (చైతన్య రథం): బర్డ్ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ పూర్తిగా తగ్గుముఖం పట్టిందన్నారు. 40 లక్షలకు పైగా కోళ్లు చనిపోయినట్టు సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమన్నారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 10 కోట్ల కోళ్లుంటే 5.42 లక్షల కోళ్లు ఈ వ్యాధితో చనిపోయాయని తెలిపారు. ప్రభుత్వపరంగా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని, బర్డ్ ఫ్లూ పూర్తిగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్న ధైర్యం చెప్పారు.