- సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి
- బాధితులకు న్యాయం చేయడంలో రాజీ పడొద్దు
- వేగంగా పరిహారం, కారుణ్య నియామకాల ప్రక్రియ
- ఎస్సీ, ఎస్టీల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
- సాంఘిక సంక్షేమ మంత్రి డోలా స్పష్టీకరణ
ప్రకాశం/ ఒంగోలు (చైతన్య రథం): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కారమయ్యేలా దృష్టి సారించడంతో పాటు, బాధితులకు తక్షణమే పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్‌లో జరిగిన డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో మంత్రి డోలా, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధనరావు, కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, ముక్కు ఉగ్రనరసింహ రెడ్డి, బిఎన్ విజయకుమార్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ ఎఆర్ దామోదర్, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి బాధితులకు మంజూరు చేయాల్సిన పరిహారం, భూ పరిహారం, ఉద్యోగ నియామకాలు తదితర అంశాలపై క్షుణ్ణంగా మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమంతోపాటు వారి సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కారమయ్యేలా దృష్టి సారించడంతోపాటు, బాధితులకు తక్షణమే పరిహారం ఇచ్చేందుకు రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి బాధిత కుటుంబాలకు భూపరిహారం, కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. 2023 నుండి నమోదైన కేసుల వారీగా మంత్రి సమీక్షిస్తూ, బాధితులకు న్యాయం చేయడంలో ఎక్కడా రాజీ పడరాదన్నారు. విచారణ, పోలీసుల దర్యాప్తులో వేగం పెంచాలని.. న్యాయబద్ధంగా పరిష్కార మార్గం చూపాలన్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా క్షేత్రస్థాయిలో పౌరహక్కుల దినోత్సవాన్ని విస్తృతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో స్మశాన వాటిక ఏర్పాటు, ఆధునీకరణకు అవసరమైన మేరకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి కేసుల ఫైలింగ్ ఏ దశలో ఉన్నాయి, నష్టపరిహారం చెల్లింపు తదితర వివరాలు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసు అధికారులను ఆదేశించారు.