- ఏ కష్టమొచ్చినా పార్టీ దృష్టికి తీసుకురండి
- శాయశక్తులా ఆదుకుంటాం
- కార్యకర్తలకు మంత్రి గొట్టిపాటి ఉద్బోధ
- శ్రీను ఆత్మహత్య పార్టీకి తీరని లోటని సంతాపం
- అతడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ
అమరావతి (చైతన్యరథం): టీడీపీ కార్యకర్తలు క్షణికావేశానికి లోనై ఆత్మహత్యలకు పాల్పడవద్దని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హితవు పలికారు. అద్దంకి నియోజకవర్గం బల్లికురవ మండలం, గొర్రెపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త, సోషల్ మీడియా యాక్టివిస్ట్ శ్రీను ఆత్మహత్య తన మనసును తీవ్రంగా కలిచివేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, వ్యక్తిగతంగా తనకు అత్యంత విషాదకరమన్నారు. మంత్రి నారా లోకేష్‌కి వీరాభిమాని అయిన శ్రీను తనకు కూడా వ్యక్తిగతంగా ఎంతో సన్నిహితుడని తెలిపారు. రవన్నా అంటూ ఎంతో ఆత్మీయతను చాటుకునే శ్రీను ఇప్పుడు మన మధ్య లేడు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. శనివారం రాత్రి శ్రీను ఆత్యహత్యాయత్నం చేశాడనే విషయం తెలియగానే అతడిని కాపాడుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాం. వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించాం.
కానీ దురదృష్టవశాత్తు మనల్ని కన్నీటిలో ముంచెత్తుతూ శ్రీను పరలోకాలకు వెళ్లిపోవడం మిక్కిలి బాధాకరం. శ్రీను బలవన్మరణం అద్దంకి తెలుగుదేశం పార్టీకి, వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. దయచేసి కార్యకర్తలెవరూ క్షణికావేశానికి లోనై ఇలా ఆత్మహత్యలకు పాల్పడవద్దు. మీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పండి. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా నేను మీకు అండగా ఉంటాను. ఈ రోజు శ్రీను మన మధ్య భౌతికంగా లేకున్నా.. నిబద్ధత కలిగిన టీడీపీ కార్యకర్తగా మనందరి గుండెల్లో చిరంజీవిగా ఉంటాడు. శ్రీను కుటుంబాన్ని పార్టీ తరపున, వ్యక్తిగతంగా అన్ని విధాలా ఆదుకుంటానని మాట ఇస్తున్నాను. ఈ విషాద సమయంలో శ్రీను ఆత్మకు శాంతి కలగాలని, అతడి కుటుంబసభ్యులకు మనో ధైర్యాన్ని ఇవ్వాలని, ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ..కన్నీటి నివాళులు అర్పిస్తున్నానని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.