- యుఫోరియా మ్యూజికల్ నైట్‌కు టిక్కెట్ కొనకుండా రావటం చిన్నతనంగా అనిపించింది
- అందుకు తలసేమియా బాధితులకు నా వంతుగా విరాళం
- ప్రచార హంగామా లేకుండా సేవ చేయటం ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రత్యేకత
- బలమైన సంకల్పంతో ట్రస్ట్‌ను నడుపుతున్న భువనేశ్వరికి అభినందనలు
- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
విజయవాడ (చైతన్యరథం): ఎలాంటి ప్రచారాన్ని ఆశించకుండా సేవ చేసుకుంటూ వెళ్లడం ఎన్టీఆర్ ట్రస్టుకు ఉన్న ప్రత్యేకత అని, మరో వందేళ్ల పాటు ఇది కొనసాగాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఆకాంక్షించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌కు రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం రాత్రి నిర్వహించిన ‘యూఫోరియా మ్యూజికల్ నైట్ ఈవెంట్లో ఆయన ప్రసంగించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అంటే నాకు అపారమైన గౌరవం. కష్టాలు, ఒడుదొడుకుల్లో కూడా చెక్కు చెదరకుండా బలమైన సంకల్పంతో ఉన్న ఆమెను దగ్గరి నుంచి చూశా. అలాంటి మంచి వ్యక్తి ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో తలసేమియా బాధితుల కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. నందమూరి బాలకృష్ణని ఎప్పుడు కలిసినా బాలయ్య అని పిలువు అంటారు.. కానీ, నాకు ‘సర్’ అనే పిలవాలనిపిస్తుంది. ఎవరినీ లెక్క చేయని వ్యక్తిత్వం ఆయనది.
తాను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. ఎన్ని తరాలు వచ్చినా ప్రేక్షకులను ఆకర్షించే నటన ఆయన సొంతం. సినిమాల్లోనే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. ఇవన్నీ గుర్తించే ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. ప్రచార హంగామా లేకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవ చేసుకుంటూ వెళుతుంది. విదేశాల నుంచి వైద్యులు వచ్చి, చికిత్స చేసి వెళ్లిపోతారు. ఎన్టీఆర్ మన మధ్య లేకపోయినా ట్రస్ట్ ద్వారా మన గుండెల్లో ఉన్నారు. ఆయన అమరజీవి. ఒక మంచి పని ప్రారంభించడం, దానిని కొనసాగించడం చాలా కష్టం. అలాంటిది 28 ఏళ్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగించడం.. ఇప్పుడు తలసేమియా బాధితుల కోసం ఈవెంట్‌ను ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయం అని పవన్ కొనియాడారు.
మా వంతు సాయం చేస్తాం
నా దగ్గరకు వచ్చే బాధితులకు సాయం చేయమని కోరుతూ సీఎం చంద్రబాబు ఆఫీసుకు లేఖరాస్తే, వారు స్పందించే తీరు అద్భుతంగా ఉంటుంది. ట్రస్టును నిర్వీర్యం చేయాలి.. హైజాక్ చేయాలనుకునేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. అయితే చంద్రబాబు దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ నా అభినందనలు. మేమంతా ట్రస్ట్ కోసం మా వంతు సాయం చేస్తాం. ఎంత సేపూ పనే కాదు. సహాయ కార్యక్రమంలో వినోదం చూడొచ్చని ఈ మ్యూజికల్ నైట్ ద్వారా నిరూపించారు. విజయవాడకు వన్నె తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి సంగీతం అందిస్తున్న సంగీత దర్శకుడు తమన్‌కి ప్రత్యేక అభినందనలు. నేను కూడా తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50లక్షలు విరాళం అందిస్తున్నా. ఈ ఈవెంటుకు టికెట్ కొనమని మా వాళ్లకు చెబితే.. విషయం తెలిసి, భువనేశ్వరి ‘మీరు టికెట్ కొనక్కర్లేదు. కార్యక్రమానికి రండి అన్నారు. మీరంతా టికెట్ కొని నేను ఉత్తిగా రావడం తప్పుగా అనిపించింది. అందుకుని, నా వంతుగా తలసేమియా బాధితుల చికిత్స కోసం త్వరలోనే ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50లక్షలు విరాళం ఇస్తా. మీ అందరికీ ధన్యవాదాలు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.