- ఆంధ్ర రైతును నాశనం చేసిందే జగన్
- ఇప్పుడు గిట్టుబాటు ధరలంటూ కొత్త డ్రామా?
- కూటమి సర్కారుపై బురదజల్లే యత్నం ఇంకెన్నాళ్లు?
- చిచ్చు రాజకీయంతో చచ్చు మైలేజకి తాపత్రయం
- రైతు ఆత్మహత్యలను రాష్ట్రం మర్చిపోతుందా?
- వైకాపా దారుణాలు చరిత్రనుంచి చెరిగిపోతాయా?
- వైఫల్య విధానాలు అమలు చేయమంటూ సలహాలా?
అమరావతి (చైతన్య రథం): దొంగే.. దొంగ దొంగ అంటే రాష్ట్ర జనం పిచ్చిగా నమ్మడానికి ఇప్పుడు నడుస్తున్నది వై’పాపాల కాలం కాదు, కూటమి పాలన! ఎపీలో రైతులు ఆందోళనలతో రోడ్డెక్కుతున్నారంటూ అసమర్థ పాలకులు ‘ట్వీటు’ల యుద్ధానికి తెగబడటం ‘కొత్త డ్రామా’యేగానీ.. రైతుమీద ప్రేమ కాదు! అబద్ధాలను పచ్చి నిజాలుగా నమ్మించడమే కాదు, వాస్తవాలను అభూత కల్పనల్లా భ్రమింపచేయగలగడం వైకాపాలకు వెన్నతో పెట్టిన విద్యే కావొచ్చు. కలకాలం కల్లిబొల్లి కబుర్లు నమ్ముతూ కూర్చోవడానికి తెలుగజాతి ప్రజలు తెలివిలేనోళ్లు కాదు. ఆ విషయాన్ని గత ఎన్నికలలో ముఖంమీద గుద్ది చెప్పినా.. వైకాపాలు గ్రహించలేకపోవడం.. వాళ్ల తెలివితక్కువ తనానికి నిలువుటద్దం! ఐదేళ్ల పాలనా విధ్వంసంతో సస్యశ్యామల రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. అన్నదాతలను ఆత్మహత్యలకు పురిగొల్పింది జగన్ జమానా! అన్నపూర్ణ రాష్ట్రంలో అన్నదాతకు బతుకులేకుండా చేసిన డ్రామా పాలకుడు జగన్ `కూటమి పాలనలో తెప్పరిల్లుతున్న రైతును.. తన రాజకీయ మైలేజీ కోసం బలిపశువును చేయడానికి ఉపక్రమించడం సహించరాని,
సహించలేని, సహించకూడని విషయం.
‘ఒక్క ఛాన్స్’ అంటూ జాలిమాటలతో మేకవన్నె పులి పాటవాన్ని ప్రదర్శించి గద్దెనెక్కిన జగన్ `ఐదేళ్ల జమానాలో ఆంధ్ర రాష్ట్రాన్నే కాదు, ఆంధ్ర రైతునూ ఆగమాగం చేశాడన్నది చరిత్ర చెబుతోన్న పాఠం. వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు… కన్నీళ్లే! బాధితుల్లో 90శాతం మంది చిన్న, సన్నకారు రైతులేననిది పచ్చి నిజం. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో రైతాంగం పంట విరామం ప్రకటించుకున్న దుస్ధితి జగన్ జమానాలోనే దాపురించిందన్న విషయాన్ని చరిత్రనుంచి చెరిపేయలేం. వరుస నష్టాలతో రాయలసీమలో వేరుశనగ రైతులు సాగునుంచే బయటికొచ్చేసిన సందర్భాలను `రాష్ట్ర రైతులోకం ఎప్పటికీ మరిచేది కాదు. మిరప రైతులకు నష్టాలను నషాళానికి అంటించిదీ జగన్ సర్కారే. తెల్ల బంగారాన్ని పండిరచిన పత్తి రైతు బతుకు తెల్లారిపోయేలా చేసిందీ జగన్ ప్రభుత్వమే. మునుపటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉద్యాన పంటలను కొత్త పుంతలు తొక్కించి.. ఎగుమతుల వ్యాపారం వరకూ ఎదిగిన ఉద్యాన రైతులైతే… జగన్ పేరు వింటేనే వణికిపోయిన ఉదంతాలు రాష్ట్రంలో ఎన్ని లేవు?
జగన్ జమానా మునుపటి వరకూ ‘నేను రైతుని’ అని సగర్వంగా చెప్పుకోగలిగిన రైతాంగం.. తాన రైతునని చెప్పుకోవడానికే సిగ్గుపడి `వ్యవసాయాన్నే వదిలేసుకున్న రైతులు ఎందరు లేరు? కష్టాలకోర్చి వ్యవసాయం చేస్తున్నా కాలం కరుణించక.. సర్కారు దయతలచక `బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కథలెన్నిలేవు? ఏడాదిలో రెండు, మూడుసార్లు పంటలు మునకేస్తే.. ఆపై కరవు కాటకాలు కాటేస్తే.. రూ.లక్షల్లో పెరుగుతున్న అప్పుల్ని, వాటిపై వడ్డీల్ని తలచుకుని.. పళ్లెంలో అన్నం సహించక.. కుటుంబాలకు కుటుంబాలే విషాన్ని తిన్న ఉదంతాలు ఎన్ని లేవు. ఈ ఏడాది కలిసొస్తుందని.. వచ్చే ఏడాది కలిసొస్తుందని.. వెతల బతుకులు చూసి ప్రభుత్వం కనికరించకపోతుందా? అన్న ఆశలతో సేద్యం చేసి చేసి.. అలసిపోయిన రైతులెందరు లేరు? నిస్సహాయ స్థితిలో… నమ్ముకున్న పొలంలోనే నిర్జీవులైన రైతులెందరో జగన్‌కు లెక్కలు తెలీవా? రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి సగటున 1,100 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘట్టాలు జగన్ జమానాలో కాదా? ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.7 లక్షలు ఇస్తామనే హామీనీ తుంగలోతొక్కి రైతు బతుకుకు అన్యాయం చేసింది వైకాపా కాదా? యజమాని మరణంతో వీధినపడిన కుటుంబాలు, పిల్లల ఆకలి తీర్చడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్న తల్లుల కష్టాలు కళ్లున్న కబోదికి కనిపించలేదు!
‘‘మాది రైతు కష్టం తెలిసిన ప్రభుత్వం. ఆర్బీకేల ద్వారా వారిని చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. దేశంలో మరెక్కడా లేనంతగా రైతు భరోసా ద్వారా పెట్టుబడిలో 80శాతం మేమే ఇస్తున్నాం. ఆహార ధాన్యాల దిగుబడి పెరిగింది. రైతులంతా సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం అద్భుతంగా మారింది. మా ఏలుబడిలో వ్యవసాయం సుసంపన్నం…’’ అంటూ అబద్ధాల డ్రామా పాటను భుజాన వేసుకుని.. జగన్ ఎన్ని వందల, వేలసార్లు బాకాలు ఊదలేదు. ‘రైతు’ అన్న పదాన్నే రాష్ట్ర చరిత్రనుంచి చెరిపేయడానికి కంకణం కట్టుకుని పాలన సాగించిన జగన్‌కు `ఈరోజు రైతు గురించి మాట్లాడే హక్కెక్కడిది? గిట్టుబాటు ధరలు లేక రాష్ట్రంలో రైతాంగం కష్టాల్లో ఉందంటూ `చిచ్చు రాజకీయంపై చచ్చు మైలేజీ ఆశిస్తున్న జగన్‌ను రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తారా? రైతు కష్టాల్లో ఉన్నాడంటూనే.. విలాసవంతమైన చలువ గదుల్లోంచి ‘ట్వీటు’లు చేయడం తప్ప.. క్షేత్రస్థాయిలో రైతును కలిసి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయగలిగాడా? ‘కష్టంలో ఉన్నాను మహాప్రభో’ అంటే నిద్రాహారాలు మాని కాళ్లకు చక్రాలు కట్టుకుని పరుగులు తీసే ముఖ్యమంత్రిపై బురద జల్లడమేనా? రైతుపై జగన్‌కున్న ప్రేమ? ఐదేళ్ల పాలనలో రైతుకు తీరని అన్యాయం చేసి.. అది కూటమి ప్రభుత్వానికి అన్వయించే శవ రాజకీయాలను రాష్ట్ర ప్రజలు ఉపేక్షిస్తారా?
ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్నే లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దిగేసినపుడే `రైతాంగం సైతం అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందన్న వాస్తవాన్ని ఎలా వక్రీకరిస్తారు? ఏరికోరి గద్దెనెక్కించినందుకు `ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి.. మాట తప్పిన జగన్‌కు `రైతుగురించి మాట్లాడే హక్కుంటుందా? ఇస్తానన్న మొత్తాన్ని ఎగ్గొట్టి.. అన్నదాతను వంచించి `మొక్కుబడి మొత్తాన్ని చేతిలోపెట్టిన జగన్… ఇప్పుడు రైతుల తరఫున మాట్లాడితే విశ్వసనీయత ఉంటుందా? రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాల పంపిణీ కింద తెదేపా హయాంలో రూ.700 కోట్ల రాయితీలిస్తే.. ఆ పంపిణీకి మీ హయాంలో మంగళం పాడిన మాట వాస్తవం కాదా? టార్పాలిన్లు, స్ప్రేయర్లే ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వ పాలకుడు.. పదవిపోయి రైతు తరఫున మాట్లాడితే పవిత్రుడైపోతాడా? ఉచిత సూక్ష్మపోషకాల పంపిణీకి పాతరేసి, సూక్ష్మసేద్యానికి మూడేళ్లూ ముసుగేసి, నాలుగో ఏడాదిలోనూ మొక్కుబడిగా అమలు చేసిన జగన్ `రైతుకు అన్యాయం జరిగిపోతుందని ఏ హక్కుతో మాట్లాడతారు? కౌలు రైతులను కులాల వారీగా విభజించి కొన్ని వర్గాలకే రైతు భరోసా ఇచ్చిన జగన్.. ఇప్పుడు ప్రదర్శించే కపట విన్యాసాలతో రైతు పక్షపాతి అయిపోతారా? రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి.. రైతును రాజును చేయడానికి కూటమి ప్రభుత్వం చేస్తోన్న కృషి కళ్లున్న కబోదులకు కనిపించకపోవడం దురదృష్టకరం. సేద్యాన్ని సాంకేతికతతో మేళవించి.. నదుల అనుసంధానంతో వ్యవసాయక ప్రాంతాన్ని పదునుదేల్చాలన్న కూటమి సారథి చంద్రబాబు ప్రణాళికలు అసమర్థులకు అర్థంకావన్న విషయం `పోలవరాన్ని గోదారి పాల్జేసినపుడు.. అమరావతిని భ్రమరావతిగా ప్రచారం చేసినపుడే అర్థమైంది. రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పుతోనైనా బుద్దెరిగి.. రాష్ట్ర ప్రగతికి కృషి చేయకున్నా కాంక్షించడం నిజమైన రాజకీయ నాయకుడి లక్షణం. జగన్‌కు ఈ జన్మలో తత్వం బోధపడేట్టు లేదు!!