- విజన్-2047 డాక్యుమెంట్‌ను ప్రస్తావించిన సీఎం
- వినూత్నంగా ప్రణాళికలు, వాటి అమలు
- కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి (చైతన్యరథం): విజన్ ఆంధ్రా-2047 డాక్యుమెంట్‌లో ప్రస్తావించిన ‘‘ప్రస్తుత ధరలవద్ద జిల్లాల స్థూల ఉత్పత్తి అంచనాలు’’పై సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేశారు. 2022-23లో విశాఖపట్నం జీడీపీఎస్ రూ.1,19,268 కోట్లుంటే.. 2028-29నాటికి రూ.2,64,781 కోట్లకు చేరాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా వివరించారు. దీనిపై పరిశ్రమలు, సేవారంగాల పాత్ర ఇతోధికంగా ఉండబోతుందన్నారు. అలాగే, తిరుపతి, కృష్ణపట్నం, శ్రీసిటీ, నెల్లూరు, చైన్నై ట్రైసిటీ హబ్‌గా తిరుపతికి లాజిస్టిక్ అవకాశాలు ఉండటంవల్ల.. ఆ జిల్లా ప్రస్తుత జీడీపీఎస్ రూ.67,487 కోట్లు, 2028-29 నాటికి రూ.1,69,469 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఒకప్పుడు అనంతపురం, కర్నూలు, కడప చాలా వెనుకబడిన జిల్లాలుగా ఉండేవని, అవిప్పుడు బాగా అభివృద్ధి చెందాయని, ఇందుకు కారణం ఆయా జిల్లాలోని వాతావరణ పరిస్థితులనుబట్టి ఉద్యాన పంటలను ప్రోత్సహించడమేనన్నారు. ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఎంతో అభివృద్ది చెందిన జిల్లాగా ఉండేదని, అయితే అదిప్పుడు వెనుకబడిపోయిందన్నారు.
అందుకు కారణం పరిశ్రమలు రాకపోవడం, సేవారంగం అభివృద్ది చెందకపోవడం, సాంప్రదాయంగా వస్తున్న వరి, కొబ్బరి పంటలనే సాగుచేయడం, వినూత్న ఆర్థిక వ్యవస్థలో నాలెడ్జ్ ఎకానమీని ఉపయోగించుకోక పోవడమే ప్రధాన కారణంగా గుర్తించినట్టు చంద్రబాబు వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో విభిన్నంగా ఆలోచిస్తూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా జిల్లాల సమగ్రాభివృద్ధికై సంబంధిత జిల్లా కలెక్టర్లు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. అందుకే సమావేశంలో ఇటువంటి అంశాలపై చర్చించడం జరుగుతోందని, విజన్ ఆంధ్రా -2047 డాక్యుమెంట్‌లో 50 శాతం వృద్ధిరేటును లక్ష్యంగా నిర్థేశించుకోవడం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. ప్రస్తుతం 3వేల డాలర్లలోపే ఉన్న జీడీపీఎస్ 23 సంవత్సరాల కాల వ్యవధిలో 15 రెట్లు అభివృద్ది చెందాలి. అంటే తలసరి ఆదాయం 42వేల డాలర్లకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో విజన్ డాక్యుమెంట్ రూపొందించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ప్లానింగ్, ఎగ్జిక్యూషన్‌లో వినూత్నంగా ఆలోచించి ఫలితాలు సాధించాలని, తలసరి ఆదాయం పెరిగితేనే జీవన ప్రమాణాలు పెరుగుతాయని, అందుకనుగుణంగా జిల్లా కలెక్టర్లు పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.