- అన్ని రంగాల్లో మంగళగిరిని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దుతాం
- ఇళ్ల పట్టాల కోసం గతంలో జిరాక్స్‌లకే వేల రూపాయలు వెచ్చించారు
- అయినా ఎవరూ న్యాయం చేయలేదు
- నేడు రూపాయి అవినీతి లేకుండా పట్టాల పంపిణీ
- మంగళగిరి ప్రజలు పెట్టిన బాధ్యతను నా భుజస్కంధాలపై మోస్తున్నా
- ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకే ఈ రోజు మీ ముందుకు వచ్చా
- నీరుకొండలో 99, మంగళగిరి రత్నాలచెరువుకు చెందిన 199 కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్
మంగళగిరి (చైతన్యరథం): ఇళ్ల పట్టాల పంపిణీ తొలి అడుగు మాత్రమే అని, అన్ని రంగాల్లో మంగళగిరిని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. మన ఇల్లు-మన లోకేష్.. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరి డాన్‌బాస్కో ఉన్నత పాఠశాల పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో నీరుకొండ గ్రామం, మంగళగిరి రత్నాలచెరువుకు చెందిన పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలను మంత్రి లోకేష్ బట్టలు పెట్టి స్వయంగా అందజేశారు. దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న నీరుకొండకు చెందిన 99 మంది, మంగళగిరి రత్నాలచెరువుకు చెందిన 199 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందన్నారు. 2019లో మంగళగిరిలో పోటీచేయాలనే ఐడియా వచ్చింది. నాకు పరిచయం లేని నియోజకవర్గం ఇది. 21 రోజుల ముందు నాకు టికెట్ ఇచ్చారు. నేనేంటో మీకు తెలియదు, మీ సమస్యలేంటో నాకు అర్థం కాలేదు. 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయా. దాంతో కసి పెరిగింది. ఓడిపోయిన రెండో రోజు నుంచే కష్టపడి మంగళగిరి ప్రజల మనస్సు గెలుచుకోవాలని ఆనాడే నిశ్చయించుకున్నాను. ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు మీకోసమే అహర్నిశలు కష్టపడ్డా. 26 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేప్టటాం. ఎన్టీఆర్ సంజీవని పెట్టి ఉచితంగా వైద్యం అందించాం. ఇంట్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టాం. నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాం. నైపుణ్య శిక్షణ అందించి యువతకు ఉద్యోగాలు కల్పించాం. సొంత నిధులతో మంగళగిరి ప్రీమియర్ లీగ్‌ను ఏర్పాటుచేసి క్రికెట్‌ను ప్రోత్సహించాం. వర్షాకాలంలో గ్రామాలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోతే గ్రావెల్‌ను, డస్ట్‌ను అందించామని మంత్రి లోకేష్ గుర్తుచేశారు.
మంగళగిరి ప్రజలు చరిత్ర తిరగరాశారు
2024 ఎన్నికల సందర్భంగా రచ్చబండ నిర్వహించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకున్నా. దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి శాశ్వత ఇంటి పట్టాలు అందించాలని ఆనాడు ప్రజలు నన్ను కోరారు. తాము నివసిస్తున్న ఇళ్లకే పట్టాలు ఇవ్వాలని కోరారు. దూరంగా ఇస్తే పనులకు వెళ్లేందుకు ఇబ్బందులు పడతామని చెప్పారు. 53వేల మెజార్టీతో నన్ను గెలిపించాలని అప్పుడు కోరా. ఎన్నికల సమయంలో సర్వేలు చేస్తారు. ఆ సర్వేల్లో కుప్పం, మంగళగిరిని చూస్తే.. మన మెజార్టీ తక్కువగా కనపడేది. నేను చంద్రబాబుతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తా. ఇంత చేసినా తక్కువ మెజార్టీ ఏంటని అనుకున్నాం. ఎన్నికల తర్వాత కుటుంబ సభ్యులం బయట దేశానికి వెళ్లాం. అప్పుడు కుప్పం కంటే ఒక్క ఓటైనా నాకు ఎక్కువగా వస్తుందని చంద్రబాబుతో చెప్పా. కుర్రోళ్లు స్పీడ్ కాబ్టటి.. అంత సీన్ లేదన్నారు. మంగళగిరి ప్రజలు చరిత్ర తిరగరాశారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మంగళగిరిలో నాకు భారీ మెజార్టీ కట్టబెట్టి శాసనసభకు పంపారని మంత్రి లోకేష్ అన్నారు.
నా బాధ్యత పెరిగింది
మంగళగిరి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడంతో నాపై బాధ్యత పెరిగింది. ఇంటి పట్టాలు ఒకరోజుతో అయ్యేపని కాదు. సులభంగా జరిగేవాటికి కొంతమందికి మొదటి ఏడాదిలోనే పట్టాలు ఇస్తామని చెప్పా. కొంతమందికి రెండేళ్లు, మూడేళ్లు పట్టవచ్చని ఆనాడే చెప్పా. గౌరవంగా బట్టలు పెట్టి, పసుపు, కుంకుమతో పట్టాలు ఇస్తానని చెప్పా. 3 వేలు పట్టాలు ఇచ్చేందుకు 6 రోజులు పడుతోంది. ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకే ఈ రోజు లోకేష్ మీ ముందుకు వచ్చాడు. మీరు ఏ బాధ్యత అయితే నాపై పెట్టారో ఆ బాధ్యతను నా భుజస్కంధాలపై మోస్తున్నా. మీరు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలమొస్తుందని ఆనాడే చెప్పా. అప్పుడే చంద్రబాబుతో, పవనన్నతో పోరాడి నిధులు తెచ్చేందుకు బలమొస్తుందని చెప్పా. ఈ రోజు నాకు ఆ బలం, శక్తి ఇచ్చారు. అందుకే కేబినెట్‌లో మంగళగిరికి వంద పడకల ఆసుపత్రి గురించి అడిగితే ఎవరూ కాదనలేదని మంత్రి లోకేష్ చెప్పారు.
దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దుతాం
మంగళగిరిలో పార్కులు, చెరువులు అభివృద్ధి చేస్తున్నాం. కల్యాణ మండపాలు కడుతున్నాం. డ్రైనేజీకి శాశ్వత పరిష్కారం కోసం భూగర్భ డ్రైనేజీ, నీరు, భూగర్భ గ్యాస్ అందిస్తాం. భూగర్భ కరెంట్ కూడా అందిస్తాం. మీరు పవిత్రమైన కార్యక్రమం కోసం వచ్చారు. దశాబ్దాలుగా అనేకమందికి శాశ్వత పట్టాల కోసం విజ్ఞాపనలు అందించారు. జిరాక్స్‌ల కోసమే వేల రూపాయలు ఖర్చుపెట్టారు. ఎవరూ న్యాయం చేయలేదు. వేదికపై ఉన్న జనసేన, బీజేపీ, తెలుగుదేశం నేతలు కలిసికట్టుగా మీ ఇంటికి వచ్చి కచ్చితమైన కొలతలు తీశారు. మీ వద్ద నుంచి కనీసం టీ కూడా తాగకుండా పారదర్శకంగా పట్టాలు అందజేస్తున్నాం. 3వేల కుటుంబాలకు వెయ్యి కోట్ల రూపాయల విలువైన పట్టాలు ఎన్డీఏ ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. ఇది తొలి అడుగు మాత్రమే. చరిత్ర రాసేందుకు వచ్చా. మీ అందరి ఆశీస్సులతో అన్ని రంగాల్లో మంగళగిరిని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
స్వచ్ఛ భారత్‌లో మంగళగిరిని నెం.1గా చేయడమే నా లక్ష్యం
స్వచ్ఛ మంగళగిరి కోసం అధికారులు బాగా కష్టపడుతున్నారు. పూడిక, చెత్తను తొలగిస్తున్నారు. 30 రోజుల్లో వెయ్యిటన్నుల చెత్త బయటపడిరది. స్వచ్ఛ భారత్‌లో మంగళగిరిని నెం.1గా చేయడమే నా లక్ష్యం. అధికారులు, ప్రజాప్రతినిధులుగా మేము కష్టపడతాం. ప్రతిరోజు చెత్త ఎత్తే కార్యక్రమం తీసుకుంటాం. పారిశుద్ధ్య కార్మికులు బాగా కష్టపడుతున్నారు. దయచేసి తిరిగి చెత్తవేయవద్దని కోరుతున్నా. చెత్తను రోడ్లపై వేయకుండా డస్ట్ బిన్‌ల్లో వేయాలని కోరుతున్నా. సంవత్సరం ఓపిక పడతా. ప్రజల్లో చైతన్యం తీసుకువస్తా. రెండో ఏడాది కర్ర పట్టుకుని తిరుగుతా. ఎవరి ఇంటి ముందైనా చెత్త కనపడితే మిమ్మల్నే నిలదీస్తా. ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. మనలో కూడా మార్పు రావాలి. నాపై పెద్ద బాధ్యత పెట్టారు. ఎన్నో ఆశలతో నన్ను గెలిపించారు. మొదటి పది నెలల్లోనే శాశ్వత పట్టాలు అందిస్తున్నాం. సూపర్ సిక్స్ హామీలు, నేను వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తా. వంద పడకల ఆసుపత్రిని కార్పోరేట్ స్థాయిలో నిర్మిస్తాం. అందుకు మీ అందరి సహకారాలు కావాలి. నేను ఎక్కడికి వెళ్లినా మంగళగిరి నా గుండెల్లో ఉంటుందని మంత్రి లోకేష్ చెప్పారు.