- వృద్ధులు, దివ్యాంగులకు డోర్ డెలివరీ
- ఎండీయూల ద్వారా రేషన్ పంపిణీ నిలిపివేత
- మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి
అమరావతి (చైతన్యరథం): జూన్ 1వ తేదీ నుంచి రేషన్ డిపోల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారన్నారు. మంగళవారం మీడియాతో మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల (ఎండీయూ) ద్వారా సరుకులను పంపిణీ చేసే విధానాన్ని నిలిపివేస్తూ, గతంలో మాదిరిగానే చౌకధరల దుకాణాల (రేషన్ డిపో) ద్వారా నేరుగా సరుకులను పంపిణీ చేసే విధానాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు.
ఎండీయూల్లో బియ్యం అక్రమ రవాణా
రేషన్ కార్డుదారులు ఇచ్చిన ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్ పకారం.. 25 శాతం మందికి నిత్యావసర సరుకులు అందటం లేదు. 26 శాతం మంది నుండి ఎండీయూ ఆపరేటర్లు అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఎండీయూ వాహనాలు వచ్చాక సరుకులు ఎటు వెళుతున్నాయో తెలియడంలేదు. ఇందుకు సంబంధించి వందలాది కేసులు నమోదయ్యాయి. ఎండీయూ ఆపరేటర్ల కొరత కూడా ఎక్కువగా ఉంది. సరుకుల పంపిణీలో ఎండీయూ ఆపరేటర్లలో జవాబుదారీతనం లోపించింది. ఈ కారణాలన్నింటి వల్ల తిరిగి రేషన్ డిపోల ద్వారానే సరుకులు పంపిణీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల వలన ప్రభుత్వానికి రూ.353.81 కోట్లు ఆదా అవుతాయి. గతంలో 29 వేల చౌకధరల దుకాణాల ద్వారా సరుకులను పంపిణీ చేసే విధానం అమల్లో ఉండేది. గత ప్రభుత్వం ఈ విదానాన్ని స్వస్తి పలుకుతూ ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేసే విదానాన్ని తీసుకువచ్చింది. ఇందుకోసం 9,260 వాహనాల కొనుగోలుకు రూ.1860 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. పైలెట్ ప్రాజెక్టుకోసం మరో రూ.200 కోట్లను వెచ్చించింది. అయితే ఈ వాహనాల వల్ల వినియోగదారులకు ఎటు వంటి ప్రయోజనం కలుగకపోవడమే కాకుండా బియ్యం అక్రమ రవాణాకు దారితీసింది. వ్యాను ఆపరేటర్లపై దాదాపు 200 కేసులు నమోదయ్యాయి. బియ్యం స్మగ్లింగ్ లో వీరు భాగస్వాములు అయ్యారు. మూడు రోజుల్లోనే 93 శాతం రేషన్ పంపిణీ చేసినట్లు చూపిస్తున్నారు. కానీ వినియెగదారులకు సరుకులు సరిగా అందడం లేదు. ఒక్కొక్క వాహనానికి నెలకు రూ.27 వేలు కార్పొరేషన్ నుండి చెల్లిస్తున్నారు. అయినప్పటికీ సరుకులు తీసుకోవడంలో కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి నాదెండ్ల వివరించారు.
వృద్ధులు, దివ్యాంగులకు డోర్ డెలివరీ
గతంలో రేషన్ డిపోల్లో అయితే కార్డుదారులు వారికి వీలయిన సమయంలో వెళ్లి సరుకులు తీసుకునేవారు. ఎండీయూ వాహనాల విధానం వచ్చాక కార్డుదారులు పనులన్నీ మానుకుని వాటి కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకుని జూన్ 1 నుండి రేషన్ డిపోల ద్వారా సరుకులు పంపిణీ చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. 65 సంవత్సరాలు పైబడిన వృత్తులకు, దివ్యాంగులకు డోర్ డెలివరీ చేస్తాం. రేషన్ డిపోల్లో ఇతర సరుకులు కూడా అమ్ముకునే సౌకర్యాన్ని కల్పిస్తాము. ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఈబీసీ, తదితర కార్పొరేషన్‌ల ద్వారా వాహనాలు పొందిన వారిలో 10 శాతం కట్టిన వారికి ఈ వాహనాలను ఉచితంగా అందజేస్తాం. దీపం-2 పథకం కింద మొదటి ఫేజ్ లో దాదాపు 99,700 మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ సిలిండర్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీపం-2 ఫేజ్ టూ అమల్లో భాగంగా ఇప్పటికే దాదాపు 70 లక్షల మంది ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకున్నారు. ఫేజ్-3 లో ముందుగానే గ్యాస్ రాయితీ సొమ్మును లబ్ధిదారులు ఖాతాలో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా, పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరబ్ గౌర్ పాల్గొన్నారు.
`