- ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ప్రకటన
- ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో కీలకపాత్రకు ప్రతిష్టాత్మక అవార్డు
- నవంబర్ 4న లండన్ లో ప్రదానం
- ఎన్టీఆర్ ట్రస్ట్ ఉద్యోగులు, అభిమానుల శుభాకాంక్షలు
అమరావతి (చైతన్యరథం): ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరిని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) ఆమెను విశిష్ట వ్యక్తిగా పేర్కొంటూ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు -2025కు ఎంపిక చేసింది. ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో కీలకంగా పని చేసినందుకు గానూ ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును ఆమెకు అందించనున్నారు. లండన్ లోని గ్లోబల్ కన్వెన్షన్లో నవంబరు 4 తేదీన జరిగే కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నుంచి భువనేశ్వరి ఈ అవార్డును అందుకోనున్నారు. సామాజిక సాధికారతకు పాటుపడుతున్న వ్యక్తిగా అమెను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. గతంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకున్న వారిలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపీచంద్, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనీషియేటివ్స్ చైర్ పర్సన్ రాజశ్రీ బిర్లా, సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ, దుబాయ్ ఎలక్ట్రిసిటీ-వాటర్ అథారిటీ ఎండీ సయీద్ మహ్మద్,హీరో ఎంటర్ ప్రైజెస్, గోయెంకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయెంకా వంటి దిగ్గజ వ్యక్తులు ఉన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి అవార్డు రావటంపై ఎన్టీఆర్ ట్రస్ట్ ఉద్యోగులు, అభిమానులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శు క్రవారం ఆమెను సన్మానించి, శుభాకాంక్షలు తెలియచేశారు.