- ఫిల్మ్‌నగర్‌లో కుటుంబ సభ్యులకు పరామర్శ
హైదరాబాద్ (చైతన్య రథం): ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు పార్థివదేహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. కోట శ్రీనివాసరావు మృతి చాలా బాధాకరమన్నారు. సినీపరిశ్రమకు ఎనలేని సేవలందించారని కొనియాడారు. నటన అంటే ఏవిధంగా ఉండాలో.. 40 ఏళ్లపాటు నటించి చూపించారని వ్యాఖ్యానించారు. ‘‘ఆయనతో నాకు సన్నిహిత అనుబంధముంది. 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీయే కూటమి నుంచి భాజపా తరపున ఎమ్మెల్యే అయ్యారు. ఎంతో ప్రజాసేవ చేశారు. ఆయన ఒకే సీన్‌లో ఏడిపించగలరు, భయపెట్టగలరు. అలాంటి విలక్షణ నటన కోట సొంతం. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 750 సినిమాల్లో నటించారు. పద్మశ్రీ, 9నంది అవార్డులు రావడానికి ఆయన కృషి, ప్రతిభే కారణం. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని చంద్రబాబు తెలిపారు.