అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో గణేష్ నిమజ్జన కార్యక్ర మాల్లో జరిగిన ప్రమాదాల్లో పలువురు మృతిచెందడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుతాళ్లలో గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఊరేగింపులో ట్రాక్టర్ దూసుకుపోయిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఘటనపై సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు చింతలవీధి జంక్షన్లో వినాయక నిమజ్జనంలో ప్రమాదం చోటు చేసుకుని ఇద్దరు మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనపైనా సీఎం విచారం వ్యక్తం చేస్తూ.. బాధితులకు వైద్య సాయంపై ఆరా తీశారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.