- ఒక్క రోజులోనే పంపిణీ పూర్తికావాలి
- 65,18,496 మంది లబ్ధిదారులకు రూ.4,399.89 కోట్ల పంపిణీ
- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం 6 కే పంపిణీ ప్రారంభించాలి
- ఒక్కొక్క ఉద్యోగికి 50 గృహాలు కేటాయింపు
- అవసరం మేరకు ఇతర శాఖల ఉద్యోగులకు పురమాయింపు
- అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశం
అమరావతి: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం అమల్లో భాగంగా నూతన ప్రభుత్వం పెంచిన సామాజిక భద్రతా పింఛన్లను జూలై 1న లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీకి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మంది ఫించనుదారులందరికీ పెంచిన ఫించన్లను ఒక్క రోజులోనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించాలన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించి పింఛన్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒకటవ కేటగిరీలోని వృద్ధులు, వితంతువులు తదితర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి పింఛను సొమ్మును రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచిన నేపథ్యంలో జూలై 1 వ తేదీన రూ.4 వేలతో పాటు ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి పెరిగి పింఛను సొమ్ము నెలకు రూ.1,000 చొప్పున మూడు మాసాల బకాయిలు కలుపుకుని మొత్తం రూ.7,000ను పంపిణీ చేయాలని ఆదేశించారు. రెండో కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు రూ.3 వేల నుండి రూ.6 వేలకు, మూడో కేటగిరీలోని పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ.5 వేల నుండి రూ.15 వేలకు మరియు నాలుగో కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.5 వేల నుండి 10 వేలకు పెంచిన పింఛన్ సొమ్ము పంపిణీ చేయాలని సూచించారు.
29నే నగదు సిద్ధం చేసుకోవాలి
పెంచిన ఫించన్ల మేరకు రూ.4,399.89 కోట్ల మొత్తాన్ని 65,18,496 మంది ఫించనుదారులకు ఒక్క రోజులోనే పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందులో రూ.4,369.82 కోట్లను 64.75 లక్షల పింఛనుదార్ల ఇళ్ల వద్ద, మిగిలిన సొమ్ము రూ.30.05 కోట్లను రాష్ట్రానికి బయట ఉండే 0.43 లక్షల పింఛను దారులు, బయట చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు డిబిటి పద్ధతిలో పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇళ్ల వద్ద నగదు రూపేణా పంపిణీ చేయాల్సిన పింఛను సొమ్మును 29 వ తేదీ శనివారం నాడే సంబంధిత బ్యాంకు బ్రాంచ్ల నుండి డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. జూలై 1 న ఉదయం 6.00 గంటల నుండి పింఛనుదార్ల ఇంటి వద్దే సొమ్మును పంపిణీ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరం మేరకు ఇతర శాఖల ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలన్నారు.
ఒక్కొక్క ఉద్యోగికి 50 గృహాల చొప్పున పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అప్పగించే విధంగా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం కల్లా పూర్తి చేయాలన్నారు. సాధ్యమైనంత మేర ఒకే రోజు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, అనివార్య కారణాల వల్ల ఇంకా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే రెండో రోజు కూడా ఈ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. ఆధార్ బయోమెట్రిక్, ఫేషియల్, ఐరిష్, ఆర్బీఐఎస్ అథెంటిఫికేషన్ ఆధారంగానే పింఛను సొమ్మును పంపిణీ చేయాలని, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికెట్ను కూడా జారీ చేయాలని ఆదేశించారు. పింఛన్ల పంపిణిలో ప్రభుత్వానికి ఎటువంటి మాట రాకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర గృహ నిర్మాణ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శులు సౌరబ్ గౌర్, సత్యనారాయణ, గ్రామ వార్డు సచివాలయాల శాఖ సంచాలకులు శివప్రసాద్, తదితరులతోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.