- మదనపల్లె మంటలపై అనుమానాలు
- సబ్ కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదంపై సీఎం సీరియస్
- వెంటనే హెలికాప్టర్‌లో సంఘటనా స్థలానికి వెళ్లాలని డీజీపీకి ఆదేశం
- ఆదివారం అర్ధరాత్రి వరకు ఆఫీసులోనే తిరుగాడిన ఉద్యోగి
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ప్రమాదం కాదు.. కావాలని చేసిందే: డీజీపీ
- పెద్దిరెడ్డిపైనే అనుమానాలు: మంత్రి అనగాని
అమరావతి, మదనపల్లె(చైతన్యరథం): అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇది ప్రమాదవశాత్తూ జరిగింది కాదని, పాపాల పెద్దిరెడ్డి అక్రమాలకు సంబంధించిన ఫైళ్లను దగ్ధం చేసేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన విద్రోహ చర్యగానే భావిస్తున్నారు. వైసీపీ పాలనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబీకులు పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రికార్డులు మాయం చేసేందుకే అగ్ని ప్రమాదం సృష్టించారని అనుమానాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్‌గా తీసుకున్నారు. అగ్నిప్రమాదమా.. కుట్రపూరితమా అనే అంశంపై విచారణకు సీఎం అదేశించారు. దీనిపై విచారణ కోసం వెంటనే హెలికాప్టర్‌లో సంఘటనా స్థలానికి వెళ్లాలంటూ డీజీపీ ద్వారకా తిరుమలరావును ఆదేశించారు. విచారణలో వెల్లడైన వాస్తవాలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని కూడా ఆదేశించారు. డీజీపీతో పాటు సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ కూడా సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. ఇది ప్రమాద వశాత్తూ జరిగింది కాదని విచారణ అనంతరం డీజీపీ స్పష్టం చేశారు. అదే విధంగా ఈ ఘటనకు సంబంధించి పెద్దిరెడ్డి పైనే అనుమానాలున్నాయని రెవెన్తూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా చెప్పారు.
ఆదివారం అర్థరాత్రి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడంతో విలువైన రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఇదే కార్యాలయంలో పనిచేసే గౌతమ్ తేజ అనే ఉద్యోగి కార్యాలయంలో రాత్రి ఒంటిగంట వరకు ఉన్నట్లు సమాచారం. నూతన సబ్‌కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నూతన సబ్‌కలెక్టర్ రాకతో తమ భూముల బాగోతం వెలుగులోకి వస్తుందనే భయంతో మాజీమంత్రి పెద్దిరెడ్డి ఈ పని చేయించారనే అనుమానాలు సర్వత్రా తలెత్తుతున్నాయి. మంటలు చెలరేగిన విషయం తెలుసుకుని కార్యాలయ సిబ్బంది.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక కేంద్రం పక్కనే ఉండటంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఏఎస్పీ రాజ్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఇదే కార్యాలయంలో పనిచేసే గౌతమ్ అనే ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో 25 అంశాలకు సంబంధించిన ఫైళ్లు దగ్ధమయ్యాయని, వాటిలో అసైన్డ్, 22 ఏ, కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీ సర్వే ఫైల్స్ ఉన్నాయని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెప్పారు. కాలిపోయిన ఫైళ్లు ఏంటో గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణం కానప్పుడు ఫైర్ ఎలా జరిగిందనేది తేలాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై తొలుత జిల్లా కలెక్టర్‌తో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. అదివారం రాత్రి 11:24 గంటలకు ప్రమాదం జరిగినట్లు సీఎంకు జిల్లా అధికారులు వివరించారు. ఈ ఘటనపై సీఎస్, సీఎంవో, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీసు అధికారులతో సీఎం సమీక్ష చేపట్టారు. ఘటనపై జిల్లా అధికారుల సత్వర స్పందన లేకపోవడంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. గౌతమ్ అనే ఉద్యోగి ఆదివారం రాత్రి ఒంటిగంట వరకు కార్యాలయంలో ఉన్నట్లు తెలుస్తోంది.. ఆదివారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ సమయం వరకు ఉండడానికి కారణాలు తెలుసుకోవాలని ఆదేశించారు.
అతను ఎందుకు వెళ్లాడు? ఏ పని కోసం వెళ్లాడు? అనే వివరాలను చంద్రబాబు అడిగారు. ఘటనా సమయంలో విధుల్లో వీఆర్‌ఏ ఉన్నాడని అధికారులు వివరించారు. ఘటనా ప్రాంతానికి పోలీసు జాగిలాలు వెళ్లాయా? ఉదయం నుంచి ఏం విచారణ చేశారు అని అధికారులను చంద్రబాబు నాయుడు అడిగారు. ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, ఇతర ఆధారాల సేకరణ విషయంలో జాప్యంపై ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఘటనా సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపైనా విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతంలో ఆ సమయంలో సంచరించిన వ్యక్తుల వివరాలు, వారి కాల్ డేటా సేకరించాలని ఆదేశించారు. నేరాలు చేసి సాక్ష్యాలు చెరిపివేయడంలో ఆరితేరిన వ్యక్తులు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారని, గతంలో సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలను అధికారులు మరిపోకూడదని… ఆ కోణంలో లోతుగా దర్యాప్తు జరపాలని సీఎం ఆదేశించారు.
ఘటనపై మినిట్ టు మినిట్ ఏం జరిగింది అనే వివరాలు సమగ్రంగా తన ముందు ఉంచాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం మరోసారి సమీక్ష నిర్వహించారు. ఉదయం నుంచి జరుగుతున్న దర్యాప్తులోని అంశాలపై పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధారాల సేకరణలో నిర్లక్ష్యానికి కారకులు ఎవరనే అంశాలపై ముఖ్యమంత్రి అరా తీశారు. గతంలో ఇక్కడ పని చేసి వెళ్లిన అధికారుల ప్రమేయంపైనా దృష్టి పెట్టాలన్నారు. ఇక, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు ప్రభుత్వ ఆఫీసుల్లో అగ్ని ప్రమాదాలు జరగడం, విజయవాడ కరకట్ట మీద ఫైళ్లు దగ్ధం కావడం వంటి ఘటనలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలోనే ఈ మదనపల్లె ఘటనపై సత్వర విచారణ జరపాలని, కారణాలు తేల్చి వివరాలను తనకు అందించాలని డీజీపీని చంద్రబాబు ఆదేశించారు.
ఉద్దేశపూర్వకంగా చేసిందే: డీజీపీ
మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన యాక్సిడెంట్ కాదని, ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగానే అనిపిస్తోందని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని, ఘటనపై ఆరా తీశారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆదివారం రాత్రి సుమారు 11.30 గంటలకు మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. 3 గంటల పాటు పరిశీలించిన తర్వాత అది యాక్సిడెంట్ కాదు.. కావాలని చేసినట్లుగానే భావిస్తున్నాం. 22ఏ భూముల రికార్డులున్న గదిలో మంటలు చెలరేగాయి. కీలక దస్త్రాలున్న విభాగంలో ఈ ఘటన చోటుచేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఘటన సమాచారం ఆర్డీవోకు తెలిసింది కానీ, కలెక్టరుకు సమాచారం ఇవ్వలేదు. ఘటన విషయం తెలుసుకున్న సీఐ కూడా ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారుల అలసత్వం కనిపిస్తోంది. కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశమే లేదని విచారణలో తేలింది. ఇక్కడ వోల్టేజ్ తేడాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఫోరెన్సిక్ వాళ్లు కూడా చెప్పారు. సబ్ కలెక్టర్ కార్యాలయం కిటికీ బయట కొన్ని అగ్గిపుల్లలు కనిపించాయి. కార్యాలయం బయట కూడా కొన్ని ఫైళ్లు కాలిపోయాయి. ఇవన్నీ అనుమానాలను మరింత పెంచుతున్నాయి. ఇటీవల సాక్ష్యాలను నాశనం చేసే ఘటనలు కొన్ని జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ దిశగానూ దర్యాప్తు ప్రారంభించాం. కేసు దర్యాప్తునకు 10 బృందాలను ఏర్పాటు చేశాం. కేసు సీఐడీకి బదిలీ చేసే అంశంపై మంగళవారం లేదా బుధవారం నిర్ణయం తీసుకుంటాం. ఇది యాక్సిడెంట్ మాత్రం కాదని స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందన్న ఆయన..పోలీసు శాఖ కూడా దీనిని తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు అందించాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.
పెద్దిరెడ్డి పైనే అనుమానం: మంత్రి అనగాని
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్థానిక వైసీపీ నేతలపైనే అనుమానం ఉందన్నారు. ఈ కేసులో నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఆర్డీవో, తహసీల్దార్, ఉద్యోగుల ఫోన్లు సీజ్ చేశామని, అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు మంత్రి వెల్లడిరచారు. పెద్దిరెడ్డి అవినీతి కప్పిపుచ్చేందుకే ఈ ఘటన జరిగి ఉండొచ్చు. పెద్దిరెడ్డి రూ.వెయ్యి కోట్ల అవినీతి వెలుగులోకి వచ్చాకే ఘటన జరిగింది. మొన్నటివరకు సబ్ కలెక్టరేట్ మొత్తం పెద్డిరెడ్డి నియంత్రణలోనే ఉంది. నిబంధనలకు విరుద్ధంగా భారీగా భూముల కన్వర్షన్ జరిగింది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ ప్రశ్నించగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉద్యోగులు పనిచేయడం ఎందుకు? ఉద్యోగులు సక్రమంగా పనిచేయకపోతే పక్కకు తప్పుకోండి. గత ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చేలా ఉద్యోగులు సహకరిస్తే చర్యలు తప్పవని మంత్రి అనగాని హెచ్చరించారు.
పెద్దిరెడ్డి హస్తం: సీపీఐ
సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్లు, కీలక ఫైళ్ల దహనానికి కారణమైన ఉద్యోగులను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. అగ్నిప్రమాదం కుట్ర వెనక మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబీకుల హస్తం ఉందని ఆరోపించారు. కేవలం కీలక రికార్డులు ఉన్న విభాగాలు మాత్రమే దగ్ధం కావడంపై సీపీఐ నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు.పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులు దగ్ధమయిన ఘటన మరువక ముందే మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో కీలక ఫైలు దగ్ధం కావడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు.