- మ్యాచింగ్ నిధులు ఇవ్వకుండా కేంద్ర పథకాలు నిర్వీర్యం చేసిన జగన్
- ఐదేళ్ల విధ్వంసాన్ని అధిగమిస్తున్నాం
- సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యంతో అన్నం
- రహదారుల మరమ్మతులకు యుద్ధప్రాతిపదికన చర్యలు
- మంత్రులు ఆనం, నారాయణ, సవిత, జనార్దన్‌రెడ్డి స్పష్టీకరణ
- ఆత్మకూరులో అట్టహాసంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
నెల్లూరు (చైతన్యరథం): సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి వేగం పుంజుకుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా తాను అహర్నిశలు శ్రమిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఉదయం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మంత్రి ఆనం ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఘనంగా నిర్వహించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పొంగూరు నారాయణ, ఎన్‌ఎండి ఫరూక్, ఎస్ సవిత, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, తదితరులు పాల్గొన్నారు.
తొలుత ఆత్మకూరు టిడ్కో హౌసింగ్ కాలనీ ప్రజల కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ. 20 లక్షలతో శ్రీ సీతారాముల స్వామి వారి దేవాలయ నిర్మాణానికి మంత్రులు భూమి పూజ చేశారు. అనంతరం మంత్రులతో కలిసి రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి పొంగూరు నారాయణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆత్మకూరులో జెడ్పీ నిధులు రూ. 1.70 కోట్లతో నిర్మించనున్న నూతన పంచాయతీరాజ్ అతిథి గృహ నిర్మాణానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఫరూక్ శంకుస్థాపన చేశారు. ఆత్మకూరులో ఆధునీకరించిన ఆర్ అండ్ బి అతిథి గృహాన్ని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఆత్మకూరు పాలిటెక్నిక్ కళాశాలలో సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రారంభించారు.
ఒక్కొక్కటిగా సమస్యల పరిష్కారం: మంత్రి ఆనం
ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ 2014 నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. 2014కు ముందు తన హయాంలో మొదలుపెట్టి పెండింగ్‌లో వున్న అన్ని పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్దఎత్తున చేపడుతున్నట్లు చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గం పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైందన్న మంత్రి, ఆత్మకూరు అభివృద్ధిలో మంత్రులు, ఎంపీ, పార్టీ శ్రేణులు భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధిని ఒక్కశాతం కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ముందుకు తీసుకెళ్లలేకపోయారన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి సోమశిల ప్రాజెక్ట్ పరిస్థితి అయోమయంగా మారినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
ఇటీవల తమ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమశిలను పరిశీలించి సోమశిల హైలెవల్ కాలువ పనులను, ఆఫ్రాన్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. నియోజకవర్గంలో పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు చెప్పారు. ఆ మేరకు అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతమని, ఈ ప్రాంతంలో బాలికలకు విద్య ఎంతో అవసరమని భావించి అనేక విద్యాసంస్థలను గతంలో తాను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు తాజాగా మహాత్మాజోతిరావు పూలే బీసీ బాలికలపాఠశాలను ఆత్మకూరుకు తీసుకొచ్చి, తాత్కాలికంగా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలోనే నూతన భవనాల నిర్మాణానికి 10ఎకరాల భూమిని సేకరించాలని జిల్లా కలెక్టర్‌కు ఇన్‌చార్జి మంత్రి ఫరూక్, మంత్రి నారాయణ ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అడిగిన వెంటనే నిధులిచ్చి ఈ పాఠశాల ప్రారంభోత్సవానికి సహకరించారని చెప్పారు. బాలికలకు విద్య నేర్పిస్తే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయని భావించి ఈ గురుకుల విద్యాసంస్థను ఏర్పాటుచేసేందుకు కృషి చేసినట్లు చెప్పారు.
ఆర్‌అండ్‌బి మంత్రి జనార్దన్‌రెడ్డి అడిగిన వెంటనే నిధులిచ్చి ఆర్‌అండ్‌బి అతిథిగృహాన్ని పూర్తిచేసేందుకు సహకరించారని చెప్పారు. అమృత్`2 కింద ఆత్మకూరు ప్రజల దాహర్తి తీర్చేందుకు మంత్రి నారాయణ చొరవ చూపుతున్నారని చెప్పారు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఆత్మకూరుకు ప్రత్యేకంగా కేంద్రం నుంచి ఇళ్లు మంజూరు చేయించారని చెప్పారు. అందరి సహకారంతోనే ఆత్మకూరు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఏఏస్‌పేట దర్గా అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. రాబోయే కాలంలో మరింత వేగంగా అందరి భాగస్వామ్యంతో ఆత్మకూరు అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి పునరుద్ఘాటించారు.
సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యంతో భోజనం: మంత్రి సవిత
రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వమని, మహిళా పక్షపాత ప్రభుత్వమని చెప్పారు. బడ్జెట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీలకు పెద్దపీట వేశారని చెప్పారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామిక వేత్తను తయారుచేయాలనే సంకల్పంతో బీసీ కార్పొరేషన్ ద్వారా ఇతోధికంగా రుణాలు మంజూరు చేస్తూ పలు పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహాకాలిస్తున్నట్లు చెప్పారు. లక్షమంది మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు కూడా అందిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం బీసీ హాస్టళ్లను నిర్వీర్యం చేసిందని, కనీసం డైట్ బిల్లులు కూడా ఇవ్వలేదన్నారు. తమ ప్రభుత్వం బీసీ హాస్టళ్ల భవన మరమ్మతులకు రూ.100కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 105 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు వుంటే అందులో 105 పాఠశాలలను టీడీపీ ప్రభుత్వమే ప్రారంభించినట్లు చెప్పారు. పెనుకొండ, ఆత్మకూరులో కూడా ఈ ఏడాది నుంచి గురుకుల పాఠశాలలను ప్రారంభించినట్లు చెప్పారు. అన్ని సంక్షేమ హాస్టళ్లకు వచ్చే సంవత్సరం నుంచి సన్న బియ్యాన్ని అందించి విద్యార్థులకు మెరుగైన భోజనాన్ని అందించనున్నట్లు ఆమె చెప్పారు. అన్ని హాస్టళ్లలో మౌలిక వసతులతో పాటు ఇన్వర్టర్లు, సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్‌డీఏ ప్రభుత్వం బీసీల పక్షపాత ప్రభుత్వంగా ఆమె పేర్కొన్నారు.
మెరుగ్గా రహదారులు: మంత్రి జనార్దన్‌రెడ్డి
ఆర్‌అండ్‌బి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకుల పాపాలతో రాష్ట్రంలోని రోడ్లన్నీ అధ్వాన్నంగా తయారయ్యాయన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అన్ని రోడ్ల మరమ్మతులకు, అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. 27వేల కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతులకు రూ.1120 కోట్లు నిధులు మంజూరు చేశామని, ఇప్పటి వరకు 79శాతం పనులు పూర్తి కాగా 18వేల కిలోమీటర్ల మేర రోడ్డు మరమ్మతులు పూర్తి అయినట్లు చెప్పారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.2500 కోట్ల బకాయిలను కూడా తమ ప్రభుత్వం చెల్లించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర రవాణాశాఖ మంత్రి గడ్కరీ రూ. 90వేల కోట్ల వరకు నిధులు మంజూరు చేశారని చెప్పారు. రహదారులు బాగుంటేనే పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధిచెందుతుందని, ఆ దిశగా రహదారుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నెల్లూరు జిల్లాలో 4వేల కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలను పూడ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 80శాతం మేరకు పనులు పూర్తి అయినట్లు చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో 1300 కి.మీ. రహదారులను పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏజెన్సీకి అప్పగించి రహదారుల అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
నిధులు మురగబెట్టిన వైసీపీ ప్రభుత్వం: మంత్రి నారాయణ
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ టీడ్కో ఇళ్ల సముదాయాల్లో రామాలయాలను నిర్మించాలని మంత్రి ఆనం సంకల్పించడం గొప్ప విషయమన్నారు. వైసీపీ ప్రభుత్వ తప్పిదాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవంతో రాష్ట్రాన్ని మళ్లీ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధులను సద్వినియోగం చేస్తామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను తీసుకొచ్చామని, స్వచ్ఛభారత్, అమృత్ పథకాల నిధులతోద్వారా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. 2019లో తాను మంత్రిగా ఉన్న సమయంలో ఏషియన్ ఇన్ఫాస్ట్రక్చర్ ద్వారా రూ.5350 కోట్లు మంజూరు చేయించామన్నారు. కేంద్రం 70 శాతం నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకుండా.. నిధులు రాకుండా చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చించి ఆ నిధులను తిరిగి తీసుకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.8500 కోట్లు మంజూరు చేసి మూడేళ్లు గడిచిందని, అందుకు వైసీపీ ప్రభుత్వం మొదటి విడతగా మ్యాచింగ్ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన రూ.2500 కోట్ల స్వచ్ఛభారత్ నిధులు ఆగిపోయాయన్నారు. 2014-19 లో తాను ముఖ్యమంత్రితో మాట్లాడి రాష్ట్రానికి 11 లక్షల ఇళ్లను మంజూరు చేయించానన్నారు. అయితే మా మీద కక్షతో వైసీపీ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మొదటి విడతగా స్వచ్ఛభారత్ నిధులను కేటాయించిందని త్వరలో మ్యాచింగ్ ఇచ్చి పూర్తిస్థాయిలో నిధులను అందిపుచ్చుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల అభివృద్ధికి మరో వెయ్యి కోట్ల రూపాయల నిధులు కేటాయింపు జరుగుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలు మరి కొద్ది రోజులు సహకరిస్తే పరిపాలన గాడిలో పడుతుందని, ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా ప్రభుత్వం నెరవేరుస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం: ఎంపీ వేమిరెడ్డి
నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గం తరహాలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకునేందుకు ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 30వేల టిడ్కో గృహాలు మంజూరైతే ఆత్మకూరుకు 1056 ఇళ్లను మంజూరు చేయించినట్లు చెప్పారు. టిడ్కో కాలనీల్లో రామాయాలు నిర్మించడం చాలా సంతోషదాయకమన్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాకు బీపీసీఎల్, ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టులు రావడం గర్వకారణంగా ఉందన్నారు. మన రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఇతోధికంగా నిధులిస్తూ సహకరిస్తుందన్నారు. రైల్వే ప్రాజెక్టులకు రూ.9వేల 400కోట్లు మంజూరు చేసిందన్నారు. జిల్లాలోని పాటూరు వీవర్స్ క్లస్టర్‌లోని 200 కుటుంబాలకు రూ.78 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ సౌరవిద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని ఎంపీ చెప్పారు.
అనంతరం బీసీ బాలికల గురుకుల పాఠశాలలోని విద్యార్థులతో మంత్రులు ముఖాముఖీగా మాట్లాడి, సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటర్ సత్యనారాయణ, డైరెక్టర్ మాధవీలత, రాష్ట్ర టిడ్కో చ్కెర్మన్ వేములపాటి అజయ్ కుమార్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చ్కెర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి వెంకటలక్షమ్మ, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ గంగాధర్, పీఆర్ ఎస్‌ఈ అశోక్‌కుమార్, ఆర్డీవో పావని, కమిషనర్ గంగా ప్రసాద్, ప్రిన్సిపాల్ రమ్యశ్రీ, పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.