- ఆర్డీటీ క్రీడా సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తృతం చేయాలని పిలుపు
అనంతపురం (చైతన్యరథం): సమష్టి కృషితో క్రీడల అభివృద్ధి సాధ్యమని, అనంతపురం జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న ఆర్డీటీ స్పోర్ట్స్ కాంప్లెక్సు.. ఏపీ స్పోర్ట్స్ అథారిటీతో అనుసంధానమైతే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. అనంతపురంలోని ఆర్డీటీ స్పోర్ట్స్ అకాడమీని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆదివారం సందర్శించారు. తొలుత ఆర్డీటీ స్పోర్ట్స్ కాంప్లెక్సులోని క్రికెట్ స్టేడియంతోపాటు, వివిధ క్రీడా కోర్టులు, స్పోర్ట్స్ హాస్టళ్లను ఆయన పరిశీలించారు. సందర్భంగా అకాడమీలో వివిధ క్రీడల్లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు, ఆంధ్రా, భారత క్రీడా జట్లను ఆయన పరిచయం చేసుకోవడంతోపాటు ఇండియన్ సాఫ్ట్‌బాల్ ఉమెన్ టీమ్ ఆటను వీక్షించారు. అనంతరం అకాడమీలోని క్రీడల శిక్షణ, స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్పోర్ట్స్ హాస్టళ్ల నిర్వహణపై నిర్వాహకులను ఆరా తీశారు. దీనిపై అకాడమీ నిర్వాహకులు స్పందించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ నిర్వహణ, అకాడమీ లక్ష్యాలను వివరించారు. 2000 సంవత్సరం నుంచి ప్రణాళికాబద్ధంగా ఆర్డీటీలో క్రీడలను నిర్వహిస్తున్నామని, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 120కి పైగా అకాడమీకి సంబంధించిన స్పోర్ట్స్ క్లబ్‌లను నిర్వహిస్తున్నామని తెలిపారు. చిన్నారులు, యువతే లక్ష్యంగా, వారిలో లైఫ్ స్కిల్స్‌ను పెంపొందించేందుకు ఆర్డీటీ కృషి చేస్తుందన్నారు. ఇప్పటివరకూ ఆర్డీటీ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందిన పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారన్నారు. క్రీడలతోపాటు విద్యనందించాలనే లక్ష్యంతో ఆర్డీటీ ముందుకెళ్తుందన్నారు.
ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ స్పోర్ట్స్ అకాడమీ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యుత్తమ క్రీడావసతులు ఆర్డీటీలో ఉన్నాయన్నారు. అంతర్జాతీయస్థాయి క్రీడాప్రమాణాలతో క్రీడావసతులు నెలకొల్పడం అనంతపురం క్రీడాకారుల అదృష్టమన్నారు. ఏపీ స్పోర్ట్స్ అథారిటీతో ఆర్డీటీ స్పోర్ట్స్ అకాడమీ అనుసంధానమైతే క్రీడల్లో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చన్నారు. శాప్, ఆర్డీటీ సమన్వయమైతే అంతర్జాతీయ క్రీడాకారులను తయారుచేయడంతోపాటు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో క్రీడావసతులను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయగలమన్నారు. క్రీడల పట్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నాయని, ఏపీ నుంచి అంతర్జాతీయ క్రీడాకారులను తయారుచేయాలనేది సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమన్నారు. సీఎం చంద్రబాబునాయుడు పిలుపు మేరకు ఆర్డీటీ ప్రత్యేకంగా ఒక క్రీడను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్డీటీ స్పోర్ట్స్ అకాడమీకి శాప్ నుంచి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. క్రీడాకారులకు ప్రయోజనకరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీటీ స్పోర్ట్స్ అకాడమీలను విస్తృతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి బుగ్గయ్యచౌదరి, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్లు సాయికృష్ణ, వంశీకృష్ణ, డీఎస్డీఓ ఉదయ్‌భాస్కర్, డీఎస్‌ఏ కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.