- జల్ జీవన్ మిషన్ 2028 వరకు పొడిగింపు
- పోలవరం, విశాఖ ఉక్కుకు నిధులు
అమరావతి (చైతన్యరథం): కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి భారీగానే నిధులు కేటాయించారు. అంతే కాకుండా జల్‌జీవన్ మిషన్ పనులను 2028 వరకు పొడిగించటం రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పథకానికి గత జగన్ ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయకుపోవటంతో వేలకోట్ల రూపాయల కేంద్ర నిధులు వెనక్కి వెళ్లాయి. ఇప్పడు ఆ పథకాన్ని పొడిగించటంతో ఇంటింటికీ కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందివ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యసాధనకు ఉపకరిస్తుంది. ఇక విశాఖ ఉక్కుకు, పోలవరానికి బడ్జెట్ ఊపిరిపోసింది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపడం మూలంగా రాష్ట్రానికి జీవనాడి అయిన ఆ ప్రాజెక్ట్‌ను వేగంగా పూర్తి చేసే అవకాశం లభించింది. విశాఖ ఉక్కు పరిశ్రమకి రూ.3295 కోట్లు కేటాయించడం ద్వారా ఆ ప్లాంట్ పరిరక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోమారు స్పష్టం చేశారు. వైసీపీ విధ్వంస పాలనతో రెక్కలు విరిగిన పక్షిలా ఉన్న ఏపీకి బడ్జెట్‌లో అధిక కేటాయింపులు చేయడం సంతోషించదగ్గ విషయం.
నేరుగా ఏపీకి కేటాయించిన నిధులు
పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు
ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా మరో 12,157 కోట్లు
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు
విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు
ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్లు
జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు రూ.186 కోట్లు
లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్‌కు మద్దతుగా రూ.375 కోట్లు
రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్లు
ఏపీ ఇరిగేషన్ లైవ్లీ హుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు రెండో దశకు రూ.242.50 కోట్లు
ఇవి కాకుండా గత ఐదేళ్లు జగన్ ప్రభుత్వం రాష్ట్ర్ర వాటా నిధులు ఇవ్వకపోవటంతో వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులు కోల్పోవాల్సి వచ్చింది. కేంద్ర పథకాల్లో వాడుకునే వారికి వాడుకున్నంత వెసులుబాటు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. మనది డబుల్ ఇంజిన్ సర్కారు కాబట్టి ఎంపీలను సమన్వయం చేసుకొని నిధులు రాబట్టుకొని పనిచేయించుకొంటే వ్యవసాయ రంగం, ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్‌లు, బొమ్మల తయారీ, సోలార్, ఈవీ, బ్యాటరీ, పరిశ్రమలు, మెడికల్ కాలేజీలు, మెడికల్ టూరిజం, తాగు నీరు, ఎయిర్‌పోర్టులు, పట్టణాల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌ను చక్కగా వాడుకోవచ్చు.