- జయంతి వేడుకల్లో స్పీకర్ అయ్యన్న
- ఎంపీ సీఎం రమేష్ రూ.30 లక్షల విరాళం
- ఎంపీలు అప్పలనాయుడు, మస్తాన్‌రావు చెరో రూ.10 లక్షలు
- పాల్గొన్న మంత్రులు అనిత, కొల్లు, దుర్గేష్
గొలుగొండ (చైతన్యరథం): బ్రిటీష్‌వారిని ఎదిరించి పోరాడిన అల్లూరి సీతారామరాజు ధైర్యం, శౌర్యం అందరికీ స్ఫూర్తి దాయకమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక పార్కులో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, ఎంపీలు సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తుహీన్ సిన్హా , తదితరులు హాజరయ్యారు. తొలుత అల్లూరి సీతారామరాజు, మల్లుదొర సమాధుల వద్ద నివాళులర్పించారు. అనంతరం అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం జరిగిన సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు గెజిట్ జారీ చేసిన సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. అల్లూరి పార్కును పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పర్యాటక శాఖ మంత్రికి కోరినట్టు వెల్లడిరచారు. పార్కు అభివృద్ధికి గతంలో మాజీ ఎంపీ మేరీ విజయ్‌కుమారి నాంది పలికినట్టు గుర్తు చేశారు. అప్పట్లో రూ.20 లక్షలతో అభివృద్ధి చేసినా, తర్వాత గత ప్రభుత్వం నుంచి నిధులు అందలేదన్నారు. దాతల సహకారంతో ఇప్పటివరకు అభివృద్ధి చేశామని, ఈ దఫా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు మస్తాన్‌రావు యాదవ్ రూ.10 లక్షలు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రూ.10 లక్షలు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ రూ.30 లక్షలు పార్క్ అభివృద్ధికి నిధులు ప్రకటించడంతో వారికి స్పీకర్ కృతజ్ఞతలు తెలిపారు. సోలార్ వ్యవస్థ ద్వారా విద్యుత్ సరఫరా, శిథిలమైన ప్రొజెక్టర్ రూమ్ స్లాబ్‌కు మరమ్మతులు, ప్రహరీ గోడ నిర్మాణం వంటి అంశాలపై సూచనలు చేశారు. ఇక్కడ పనిచేస్తున్న వారికి అధికారికంగా ఇప్పటివరకు జీతభత్యాలు లేవని, దాతల సహకారంతోనే వారికి జీతాలు అందిస్తున్నట్లు తెలిపారు. వారికి పర్యటకశాఖ తరుపున జీతాలు అందేలా చూడాలని స్పీకర్ కోరారు.
అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ, పార్కు అభివృద్ధికి తన ఎంపీ నిధుల నుంచి రూ.30 లక్షలు కేటాయించామని, అవసరమైతే మరిన్ని నిధులు సమీకరించి సహాయం చేస్తానని తెలిపారు.
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, అల్లూరి పోరాటం యువతకు స్పూర్తిగా నిలవాలని, పార్కు అభివృద్ధికి తన వంతుగా ఇచ్చిన రూ.10 లక్షలు బాధ్యతగా వినియోగించాలని ఆకాంక్షించారు.
హోం మినిస్టర్ వంగలపూడి అనిత మాట్లాడుతూ, అల్లూరి పోరాట స్ఫూర్తిని యువతకు చేరవేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గంజాయి వినియోగాన్ని ప్రోత్సహించేవారికి పథకాలు నిరాకరించే అంశం పరిశీలనలో ఉందన్నారు. పార్కు అభివృద్ధికి తన నిధుల నుంచి రూ.5 లక్షలు ప్రకటించారు.
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అల్లూరిని రియల్ హీరోగా అభివర్ణించారు. యువతకు ఆయన ఆదర్శమన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడి నాయకత్వంలో అనకాపల్లి జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు.
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అల్లూరి పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమన్నారు. ఆయన పోరాట ప్రదేశాన్ని స్మారకంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడిరచారు. జిల్లా పర్యాటక ప్రాంతాలను కలుపుతూ సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
కలెక్టర్ విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ, అల్లూరి బ్రిటిష్ వారిని ఎదిరించిన మహోన్నత యోధుడని పేర్కొన్నారు. సీఎం ప్రవేశపెట్టిన పీ4 కార్యక్రమం పేదలకు అండగా నిలుస్తుందని అన్నారు.
జయంతి సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్‌ఛారి, రాజన్న సూర్య చంద్ర, సర్పంచ్ లోచుల సుజాత, టీడీపీ మండల అధ్యక్షుడు అడిగర్ల నాని బాబు, మాజీ జెడ్పీటీసీ వేణు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.