- గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా వదిలేసిన సాగునీటి పనులకు మోక్షం
- కాకినాడ జిల్లాలో 39 పనులకు రూ.8.97 కోట్లకు ఆమోదం
కాకినాడ (చైతన్యరథం): కాకినాడ జిల్లాలోని రైతాంగానికి సాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసేందుకు సాగు నీటి కాలువలకు అవసరమైన మరమ్మతుల విషయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో అవసరమైన నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో సాగునీటి కాలువల మరమ్మతులు, పూడికతీత, ఇతర మైనర్ పనులను చేపడతారు. 2023లో వచ్చిన మిచౌంగ్ తుపాను ప్రభావానికి కాకినాడ జిల్లాలో పలు సాగునీటి కాలువలకు కట్టలు, గేట్లు, పూడికతీత వంటి సమస్యలు ఏర్పడ్డాయి. తుపాను తగ్గిన వెంటనే ఈ నష్టానికి సంబంధించి జిల్లా అధికారులు 288 పనులు వెంటనే చేయాలని ప్రతిపాదనలు అప్పటి ప్రభుత్వానికి పంపారు. అయితే నాటి ప్రభుత్వం ఆ పనులను కనీసం పట్టించుకోకుండా పక్కన పెట్టేసింది. తాజాగా ఏలేరు రిజర్వాయర్‌కు వరద వచ్చినపుడు ముంపు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటన జరిపినప్పుడు సాగు నీటి పనులకు సంబంధించిన గతంలో పంపిన ప్రతిపాదనలను అధికారులు గుర్తు చేశారు. దీంతో వెంటనే ఉప ముఖ్యమంత్రి స్పందించి జలవనరుల శాఖ అధికారులతో దీనిపై చర్చించి అత్యవసరం చేయాల్సిన 39 పనులను గుర్తించారు. వీటికి సంబంధించి రూ.8.97 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు లభించాయి. జలవనరుల శాఖ ద్వారా టెండరు నోటీసు వెంటనే ఇచ్చేలా చూడాలని, 2 నెలల్లోగా పనులు పూర్తయ్యేలా చూడాలని జిల్లా అధికారులకు ఉప ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. కాకినాడ రూరల్, ముమ్మిడివరం, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, రామచంద్రపురం నియోజకవర్గాల్లో గుర్తించిన సాగు నీటి పనులు వెంటనే జరగనున్నాయి.
ఏలేరు రిజర్వాయర్ వరదల పనుల గుర్తింపు
ఇటీవల వచ్చిన ఏలేరు వరదల్లో నష్టం జరిగిన సాగునీటి పనులను సైతం వెంటనే పూర్తి చేయాలని జిల్లా అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వచ్చిన ఏలేరు వరదలకు కొన్ని చోట్ల కాలువల గట్లు బలహీనం అయ్యాయి. పూడికతీతలు చేయాల్సి ఉంది. అలాగే మరికొన్ని మైనర్ మరమ్మతులు చేయాల్సిన తరుణంలో మొత్తం 87 పనులను దీనిలో గుర్తించారు. దీనికి రూ.5.97 కోట్ల మేర నిధులు అవసరం అవుతాయి. ఈ పనులకు కూడా వెంటనే టెండర్లు పిలవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పనులు వెంటనే పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని, వచ్చే పంటకాలం నాటికి రైతాంగానికి ఇబ్బంది లేకుండా సాగునీటి సరఫరా సాగేలా చూడాలన్నారు.