- బీహార్ అరాచకాల పరిస్థితులు ఇప్పుడు ఏపీలో నెలకొన్నాయి
- అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ వేల కోట్లు దోచేసిన మంత్రి కాకాణి
- అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా సోమిరెడ్డి చేపట్టిన దీక్ష ను అర్ధరాత్రి భగ్నం చేసిన పోలీసులు
నెల్లూరు (చైతన్యరథం): ఏపీలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, గతంలో బీహార్‌లో నెలకొన్న తరహా అరాచకాల పరిస్థితులు ఇప్పుడు ఏపీలో ఉన్నాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, వైసీపీ నాయకుడు పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి మైనింగ్ మాఫియాలా వ్యవ హరిస్తున్నారని, వారి అక్రమ మైనింగ్‌ను అడ్డుకుని తీర తామన్నారు. నెల్లూరులో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను వెంటనే నిలిపివేయాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్షను సోమ వారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. మైనింగ్ అక్రమాలను నిరసిస్తూ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి వద్ద 4రోజులుగా సోమిరెడ్డి సత్యా గ్రహ దీక్షను చేపట్టారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేస్తున్న సత్యాగ్రహ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు మంగళవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో దీక్షా శిబిరం వద్దకు పెద్దఎత్తున తరలి రాగా, పోలీస్ వాహనాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. సోమిరెడ్డిని పోలీసులు బలవంతంగా జీపులో ఎక్కించిన పోలీసులు, అనంతరం నెల్లూరు అల్లీపురం ఆయన ఇంటి వద్ద దించి వెళ్లిపోయారు.
పొదలకూరులో పోలీసులు దీక్షను భగ్నం చేసే సమయంలో పోలీస్ చర్యలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల పెద్ద నినాదాలు చేశారు.
దీక్ష భగ్నం అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ మూడు నెలలుగా అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆధారాలు, వివరాలతో సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) జవహర్‌రెడ్డి గుడ్డిగా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రోజూ ఐదారు కోట్ల రూపాయలు తెచ్చిపెట్టే అక్రమ మైనింగ్ నా నిరసనతో నిలిచిపోవడంతో దిక్కుతోచని మాఫియా డాన్ కాకాణి.. నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఒక ప్రజా ఉద్యమం పైకి హిజ్రాలు, రౌడీ షీటర్లను ఉసిగొల్పేంత నీచస్థాయికి దిగజారిపోయాడు. వందలాది మంది హిజ్రాలు, రౌడీషీటర్లను పంపినా వారు నా శిబిరాన్ని తాకే అవకాశం లేకుండా టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. చివరకు మా వాహనాలను ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేసినా ఒక్కరు కూడా జంకలేదు. తెల్లారే వరకు నా సత్యాగ్రహం కొనసాగితే అక్రమ మైనింగ్ కు వినియోగిస్తున్న యంత్రాలు, వాహనాలు, పేలుడు పదార్థాలు అక్కడి నుంచి తప్పించడం కష్టమని భావించి, చివరకు ఆయన జేబులోని పోలీసులను రంగంలోకి దించాడు. ప్రజలు, టీడీపీ శ్రేణుల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన తప్పదని భయపడి అర్థరాత్రి వేళలో పోలీసులు కుట్రపూరితంగా ఓ పథకం ప్రకారం నా సత్యాగ్రహాన్ని భగ్నం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మరెన్ని కుట్రలకు పాల్పడినా వందల కోట్ల విలువైన ప్రజల సొత్తు, ప్రకృతి సంపదను దోచేస్తున్న మైనింగ్ మాఫియాపై నా పోరాటం ఆగదు. నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ప్రజల డబ్బును లక్షలకు లక్షలు జీతాలుగా తీసుకుంటూ మైనింగ్ మాఫియాకుతో అధికారులు అంటకాగుతున్నారు. మరికొద్ది రోజుల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమం. ఏ స్ధాయి అధికారులనైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. న్యాయపోరాటం చేసి కోర్టు మెట్లు ఎక్కిస్తాం. టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే అక్రమార్కులందరూ జైలుకెళ్లడం ఖాయం. అక్రమంగా దోచేసిన ప్రజల సొత్తులో ప్రతి రూపాయిని కక్కించడం తథ్యమని సొమిరెడ్డి స్పష్టం చేశారు.
దిష్టి తీయడానికి 80 మంది వస్తారా!?
క్వారీ వద్దకు చేరుకున్న హిజ్రాల సమూహాన్ని అక్కడున్న టీడీపీ నేతలు ప్రశ్నించగా.. తాము క్వారీకి దిష్టి తీయడానికి వచ్చామన్నారు. క్వారీ మొత్తం కలియతిరిగి వెనుక్కు వచ్చి ఆగారు. రాత్రి 7 గంటల వరకు సమీపంలోనే ఉన్నట్లు స్థానికుల సమాచారం. ఎవరో ఒకరి ప్రమేయం లేకుండా హిజ్రాలు భారీ సంఖ్యలో హైటెక్ బస్సులు అద్దెకు తీసుకొని మరీ క్వారీ వద్దకు వస్తారా అనేది పెద్ద ప్రశ్న. కచ్చితంగా హిజ్రాలను అక్కడికి తరలించడం వెనుక క్వారీలో అక్రమ మైనింగ్ చేస్తున్న వైసీపీ నాయకులు ఉన్నారంటున్నారు. హిజ్రాల చేత అల్లర్లు చేయించి, టీడీపీ నేతలు వెళ్లిపోయేలా చేసి, రాత్రికి రాత్రి క్వారీలో సిద్ధంగా ఉన్న 12 లారీల తెల్లరాయిని దాటించాలనేది అక్రమార్కుల ఎత్తుగడగా టీడీపీ వర్గాలు అంటున్నాయి.