- ఢిల్లీ పర్యటనలో భాగంగా మర్యాదపూర్వక భేటీ
న్యూఢిల్లీ (చైతన్య రథం): కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని ఆయన నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత వేగంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా లోకేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్దఎత్తున పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఏపీకి వచ్చేలా సహకరించాలన్నారు. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారుచేసిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కిస్తున్నామని చెప్పారు. కేంద్రం అందించిన సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పురోగతి, పోలవరం పనులు సాగుతున్న తీరును రాజ్‌నాథ్‌కు వివరించారు. గత పాలకుల అనాలోచిత విధానాల కారణంగా రూ.10లక్షల కోట్ల అప్పుల్లో మునిగిన ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందిస్తోందంటూ.. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఏపీని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ… ఏపీ అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, ఎంపీలు పాల్గొన్నారు.