- గత ప్రభుత్వంలో అక్రమంగా 3 లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్
- వాటిపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం
- రెవెన్యూ మంత్రి అనగాని వెల్లడి
- మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కూలంకషంగా చర్చ
- 22 ఏ భూములు, సాదా బైనామాలు, నాలా రద్దుపై చర్చించిన ఉప సంఘం
అమరావతి (చైతన్యరథం): పేదలకు న్యాయం జరిగేలా ఫ్రీ హోల్డ్ భూములపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూ పరిపాలనలో సంస్కరణలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన మంగళవారం భేటీ అయింది. ఉప సంఘం సభ్యులు పయ్యావుల కేశవ్, పీ నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎన్‌ఎండి ఫరూక్, టీజే భరత్ సమావేశానికి హాజరయ్యారు. ఫ్రీ హోల్డ్ భూములు, 22 ఏ నుండి భూముల తొలగింపు, నాలా రద్దు, సాదా బైనామా, తదితర అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఫ్రీ హోల్డ్ భూములను 10 కేటగిరీలుగా విభజించగా 8 కేటగిరీలకు మంత్రివర్గ ఉపసంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమావేశం అనంతరం మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ దాదాపు 3 లక్షల ఎకరాల భూములు పూర్తిగా నిబంధలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తన అనుయాయులకు ఫ్రీ హోల్డ్ చేసిందన్నారు. ఈ భూములపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎలాంటి చర్యలు తీసుకోవాలో సీఎం చంద్రబాబు నాయుడితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఒక వేళ చట్టవిరుద్ధంగా పేదల భూములను ఫ్రీ హోల్డ్ చేస్తే, అటువంటి భూములను మళ్లీ ఆ పేదలకే అసైన్ చేస్తాం. మళ్లీ 20 ఏళ్ల తర్వాతనే ఆ భూములు ఫ్రీ హోల్డ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. 22 ఏ నుండి భూముల తొలగింపునకు సంబంధించి మేమిచ్చిన మార్గదర్శకాల మేరకు కలెక్టర్లు పని చేస్తున్నారా లేదా అనే అంశంపై మంత్రి వర్గ ఉపసంఘం చర్చించింది. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా కొన్ని భూములను 22ఏ లో పెట్టారు. కొన్ని భూములను వారి అనుయాయుల ప్రయోజనం కోసం 22 ఏ నుండి తొలగించారు. వీటన్నింటని పరిశీలించి నిజమైన భూ యజమానికి, పేదలకు నష్టం జరక్కుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించాం. ఇక నుండి కొత్తగా భూములను 22ఏ లో పెట్టాలంటే ఎవరికీ అన్యాయం జరగక్కుండా ఒక విధానాన్ని రూపొందించాం. సీఎం చంద్రబాబు అనుమతి తీసుకున్న తర్వాత దాన్ని అమల్లోకి తేస్తాం. నాలా చట్టం రద్దు పైన కూడా కూలంకుషంగా చర్చించాం. సూత్రప్రాయంగా సీఎం చంద్రబాబు ప్రకటించినట్లు నాలా రద్దుకు ఓకే చెప్పాం. అయితే వాగులు, వంకలు, చెరువుల్లో కట్టడాలు నిర్మించి వర్షాలు, వరదలకు అవి మునిగిపోయే పరిస్థితి రానీయకుండా చూసేందుకు ఏఏ నిబంధనలు పెట్టాలనే దానిపై చర్చించాం. ఇక ఎప్పటి నుండో సమస్యగా ఉన్న సాదా బైనామాలపై కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. సాదా బైనామాలను ల్యాండ్ రికార్డులుగా మార్చుకునేందుకు ఉన్న గడువును 2024 నుండి 2027 వరకు పొడిగించాం. ల్యాండ్ రికార్డులన్నింటినీ ఫ్యూరిఫై చేసేలా రీ సర్వే సాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. మరోసారి మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై భూపరిపాలనలో ఇతర అంశాలకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చిస్తుందని మంత్రి అనగాని తెలిపారు.