రాజమహేంద్రవరం (చైతన్యరథం): వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకేసులో తదుపరి విచారణకు రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు అనుమతి ఇచ్చింది. 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు సమగ్ర దర్యాప్తునకు అనుమతి కోరుతూ ఇటీవల ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టును కోరగా.. న్యాయస్థానం మంగళవారం ఈ మేరకు అనుమతి ఇచ్చింది.
2022 మే 19న కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. డ్రైవర్‌ను హతమార్చిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.. మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హత్య తానే చేశానని అనంతబాబు అంగీకరించినట్లు మీడియా సమావేశంలో అప్పటి ఎస్పీ రవీంద్రనాథబాబు వెల్లడిరచారు. అనంతబాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి రిమాండ్‌కు పంపారు. తర్వాత మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు.
ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. నేరారోపణ ఎదుర్కొంటున్న అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలనీ, పార్టీ నుంచి బహిష్కరించాలనీ పౌర సంఘాలు, దళిత సంఘాల నుండి డిమాండ్లు వచ్చాయి. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని డైల్యూట్ చేయడానికి ప్రయత్నించింది. చివరకు తూతూ మంత్రంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసినా.. నాలుగైదు నెలలకే ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. గత ఎన్నికల సమయంలో పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. ఆయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తమకు న్యాయం చేయాలని, ఈ హత్య కేసుపై సమగ్రంగా విచారణ జరిపి, అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరింది. బాధిత కుటుంబానికి పరిహారం అందజేయడంతో పాటు న్యాయ సలహాలకు ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల సుబ్బారావును కూటమి ప్రభుత్వం నియమించింది.