- మరో 16 ఆలయాల్లో ప్రతినిత్యం అన్నప్రసాదం
- సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆలయాల అభివృద్ధి
- ఆగమ పండితుల నిర్ణయాల మేరకే ఆలయాల్లో పూజాకైంకర్యాలు
- రుచి, శుచితో అన్నప్రసాదం అందించడానికి చర్యలు
- ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత, భక్తుల భద్రతకు పెద్దపీట
- అన్ని ప్రముఖ ఆలయాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ
- ప్రతి ఆలయంలోనూ భక్తులు సంతృప్తి చెందేలా ఏర్పాట్లు
- దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడి
నెల్లూరు (చైతన్యరథం): రాష్ట్రంలో మరో 16 ప్రముఖ ఆలయాల్లో ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. మంగళవారం ఉదయం నెల్లూరు సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆనం మంగళవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఇటీవల దేవాదాయశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశం వివరాలు, సీఎం ఆదేశాల మేరకు దేవాదాయశాఖలో అమలుచేస్తున్న కార్యక్రమాలను మంత్రి వివరించారు.
ఆలయాల్లో అన్న ప్రసాదం పూర్తిస్థాయిలో జరగాలని, రోజువారీగా మెనూ తయారు చేయాలని, పరిశుభ్రమైన వాతావరణంలో వంటలు వండాలని, భక్తులకు నాణ్యమైన భోజనం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన ఏడు ఆలయాలలో అన్న ప్రసాద వితరణ ఇప్పటికే జరుగుతోందని, మరో 16 ప్రముఖ దేవాలయాలలో కూడా అన్న ప్రసాదం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఈ మేరకు చర్యలు చేపడ్తున్నట్లు మంత్రి ఆనం చెప్పారు. అన్న ప్రసాదం వితరణ కోసం ఎంత ఖర్చవుతుందనే వివరాలు సేకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఒకటి రెండురోజులు మాత్రమే తెరిచే ఆలయాలు కొన్ని వున్నాయని, అందులో కందుకూరు సమీపంలోని మాలకొండ లక్ష్మీనరసింహా ఆలయం ఒకటిగా మంత్రి చెప్పారు. మాలకొండలో ఇప్పటికే ప్రతి శనివారం అన్నదానం అందిస్తున్నప్పటికీ ఇకనుంచి ఒక ప్రత్యేక కార్యక్రమంగా అన్నప్రసాదాన్ని భక్తులకు అందిస్తామని మంత్రి చెప్పారు.
ఆగమపండితుల ఆధ్వర్యంలోనే..
ప్రతి దేవాలయంలో పూజా కార్యక్రమాలు ఆగమపండితుల ఆధ్వర్యంలోనే జరగాలని, ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉండకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఆ మేరకు అన్ని ఆలయాల్లో ఆగమ పండితుల నిర్ణయాల మేరకు పూజాకైంకర్యాలు చేపడుతున్నట్లు మంత్రి ఆనం చెప్పారు. రాష్ట్రంలో ప్రధానంగా నాలుగు రకాల దేవాలయాలు ఉన్నాయని, ఆలయాలకు వచ్చేటువంటి వార్షిక ఆదాయాన్ని బట్టి ఆలయాలను కేటగిరీలుగా విభజించామన్నారు. 6ఏ కేటగిరీలో ఉన్న 169 ఆలయాల్లో ఆ ఆలయాల ఆదాయ వనరుల మేరకు, ఆదాయ వనరులు అధికంగా ఉన్న 22 ఆలయాల్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. భక్తుల భద్రత కోసం ప్రముఖ ఆలయాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఆ మేరకు చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం చెప్పారు.
ఆధ్యాత్మికత భావన ఉట్టిపడేలా..
ప్రతి ఆలయంలో ఆధ్యాత్మికత భావన ఉట్టిపడేలా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఆ మేరకు ఆలయాల్లో శాస్త్రోక్తంగా పూజాకార్యక్రమాలు జరిగేలా, ప్రతిరోజూ తెల్లవారుజామునుంచే ఆలయాల్లో ఓంకారనాదం, మంత్రోచ్ఛరణలు వినిపించేలా, ఆలయ పరిసరాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేసేలా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు.
అద్భుతంగా శ్రీశైల క్షేత్రం అభివృద్ధి
ప్రముఖ శక్తిపీఠం, జ్యోతిర్లింగమైన శ్రీశైలం ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని, ఈ ప్రముఖ శైవ క్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. అలాగే శ్రీశైలం దేవస్థాన అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. శ్రీశైలంలో అటవీశాఖకు, దేవాదాయ శాఖకు మధ్య భూ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అతి త్వరలో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం శ్రీశైలం దేవస్థానాన్ని తీర్చిదిద్దనున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రముఖ ఆలయాలు, శైవక్షేత్రాలతో పాటు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు, సూచనలు పాటిస్తూ దేవాదాయశాఖ అభివృద్ధికి చర్యలు చేపడ్తున్నామని, ప్రతి ఆలయంలోనూ భక్తులకు సంతృప్తికరంగా దర్శన, వసతి ఏర్పాట్లు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వివరించారు.