మంగళగిరి : అడ్డమైన కారణాలు చెప్పి సంక్షేమ కార్యక్రమాలు కట్ చెయ్యడం దారుణం.. పేదవాడు ఫ్యాన్ కూడా వేసుకోకూడదా.. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని పెన్షన్లు కట్ చెయ్యడం దుర్మార్గమని టిడిపి యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ మండిపడ్డారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం పర్యటించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా చెత్త పన్ను పేరుతో జనాన్ని జలగలా వేధిస్తున్నారని దుయ్యబట్టారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలపై జగన్ ప్రభుత్వం వేసిన పన్నుల భారం గురించి వివరించారు. ఇటీవల మరణించిన టిడిపి కార్యకర్తల ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ గోడు వెళ్లబోసుకుంటూ ఎన్నికల్లో గెలిస్తే కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఇళ్ళ పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చి ఆర్కే మోసం చేశారని, ఇప్పుడు కనీసం మా ప్రాంతానికి రావడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. కరెంట్ బిల్లు ఎక్కువొచ్చిందనే కారణం చూపి పెన్షన్లు కట్ చేస్తున్నారని పలువురు వృద్దులు వాపోయారు. లోకేష్ మాట్లాడుతూ…నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వచ్చింది. నేను గెలిస్తే ఏడాదిలో ఇళ్ళ పట్టాలు ఇస్తానంటే నమ్మలేదు.. లోకేష్ గెలిస్తే ఇళ్లు కుల్చేస్తాడు అని ఆర్కే ప్రచారం చేస్తే నమ్మి మోసపోయారని అన్నారు. ఇళ్ళ పట్టాలు ఇస్తా అన్న ఆర్కే పత్తా లేడు… పైగా పేదల ఇళ్లు దారుణంగా కూల్చేసి రాక్షస ఆనందం పొందుతున్నారని చెప్పారు. నేను ఓడిపోయినా నియోజకవర్గంలో 12 రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా. ఓడిపోయిన లోకేష్ ఇన్ని కార్యక్ర మాలు చేస్తుంటే ఇక గెలిస్తే ఎన్ని కార్యక్రమాలు అమలు చేస్తాడో ఆలోచించాలని కోరారు. నేను గెలిచిన ఏడాది లో అటవీ భూముల్లో ఉంటున్న వారికి బట్టలు పెట్టి పట్టాలు ఇస్తా, త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు.