అమరావతి (చైతన్యరథం): విద్యార్థి దశ నుండే నైతిక విలువలు పెంచేలా పాఠ్యాంశాలు రూపొందిస్తున్నామని, ఇందుకు తగిన మార్గదర్శనం చేయాలని ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. విద్యార్థులు, యువతలో నైతిక విలువల పెంపునకు ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సోమవారం ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. విద్యార్థుల్లో మహిళలు, పెద్దలు, గురువులపై బాల్యం నుంచే గౌరవం పెంపొందించేలా ప్రత్యేకంగా పాఠ్యాంశాలు రూపొందించాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఇందుకు మీ వంటి పెద్దల అమూల్యమైన సలహాలు అవసరమని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, సత్ప్రవర్తన పెంపొందించేందుకు తమ వంతు సలహాలు, సహకారం అందిస్తానని ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు చెప్పారు.