- తుఫాన్ అనంతరం పంట నష్టం తగ్గింపుపై జేడీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు
- పంట రక్షణకు రైతులు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అదేశం
- రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన మంత్రి
అమరావతి (చైతన్యరథం): మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిన నేపథ్యంలో, పంట రక్షణ చర్యలపై జాయింట్ డైరెక్టర్లతో శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం లభించేలా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్న తెలిపారు. దెబ్బతిన్న పంటకు సరైన సస్యరక్షణ చర్యలతో నష్టం తగ్గించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ, హార్టికల్చర్, గ్రౌండ్ వాటర్, మెట్రోలాజికల్ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి మండల వ్యవసాయాధికారి స్థాయిలో పంట నష్టం అంచనాలు కచ్చితంగా సేకరించి, రైతులకు తక్షణ ఉపశమనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో శాస్త్రవేత్తల సహాయంతో పంట రక్షణ పద్ధతులు అమలు చేయాలని సూచించారు. రైతుల సమస్యలు, నష్టాలపై అధికారుల నుంచి సమగ్ర నివేదిక అందించాలని, వాటిని త్వరగా ప్రభుత్వానికి సమర్పించి సాయం అందించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతు భవిష్యత్తు మనకు ప్రాధాన్యం. ప్రతి ధాన్యపు గింజ విలువైనది. రైతుకు నష్టం రాకుండా ప్రతి అధికారి నిబద్ధతతో వ్యవహరించాలని పేర్కొన్నారు. గురువారం కృష్ణా జిల్లాలో పంట ముంపు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు.. పలువురు రైతులు తమ పంట నష్టం కింద నమోదు చేసుకుంటే ఆ పొలంలో పండిన వరి అమ్ముకోడానికి వీలవదని తనతో చెప్పుకున్నారని.. ఈ విషయమై వ్యవసాయశాఖ, సివిల్ సప్లయిస్ డిపార్ట్మెంట్ వాళ్లతో మాట్లాడి వారికి పూర్తిస్థాయిలో స్పష్టమైన సూచనలు ఇచ్చామన్నారు. గతంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ రిలీఫ్ కింద పరిహారం తీసుకున్న అందరికీ ఈ ఇబ్బంది వచ్చింది.. కావున ఈ సారి ఆ ఇబ్బంది రాకుండా ఇరు శాఖలకు తగిన సూచనలు ఇచ్చామని మంత్రి తెలియజేశారు.
రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి
మొంథా తుఫాను కారణంగా కృష్ణా, గోదావరి, తదితర జిల్లాల్లో వరి పంట పూత దశ, పాలు పోసుకునే దశ, కోత దశల్లో ఉండగా భారీ ఈదురుగాలులు, వర్షాల ప్రభావంతో అనేక వరి చేలు పడిపోయి నీట మునిగిన నేపథ్యంలో, నష్టం తీవ్రత తగ్గించేందుకు రైతులు అత్యవసరంగా కొన్ని కీలక చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. పూత దశ నుంచి పాలు పోసుకునే దశ వరకు పొలాల్లో నిల్వ ఉన్న నీటిని వెంటనే అంతర్గత కాలువల ద్వారా తొలగించడం అత్యంత ముఖ్యం. నీరు తగ్గిన వెంటనే ఎకరాకు 400 మి.లీ హెక్సాకోనాజోల్ లేదా 200 మి.లీ ప్రోపికోనాజోల్ పిచికారీ చేయడం ద్వారా మాగుడు తెగుళ్ల వ్యాప్తి తగ్గుతుందని సూచించారు. పరిస్థితులు అనుకూలిస్తే పడిపోయిన మొక్కలను పైకి లేపి కట్టుకోవాలి. అలాగే నిలబడి ఉన్నా, పడిపోయినా గింజలు రంగు మారకుండా, మాగుడు.. మానిపండు తెగుళ్లు వ్యాప్తి చెందకుండా ఎకరాకు 200 మి.లీ ప్రోపికోనాజోల్ తప్పనిసరిగా పిచికారీ చేయాలి. పాలు పోసుకునే దశలో ఉన్న పంటలకు కూడా ఇదే విధంగా నీటిని కాలువల ద్వారా తొలగించి మొక్కలను పైకి లేపడం కీలకం. గింజ గట్టిపడే దశ, కోత దశలో చేలు నీట మునిగితే వెంటనే నీటిని బయటకు పంపాలి. కోత దశలో కంకిలో మొలకలు కనిపిస్తే, నీరు బయటకు తీసిన తర్వాత 5% ఉప్పు ద్రావణం (లీటరు నీటికి 50 గ్రా ఉప్పు) పిచికారీ చేయడం ద్వారా మొలక పడటం, రంగు మారడాన్ని తగ్గించవచ్చు. గింజ గట్టిపడే దశలో కూడా మొక్కలను పైకిలేపి కట్టుకోవడం, నీటిని వేగంగా తొలగించడం తప్పనిసరి. ఇప్పటికే కోసి కుప్పలుగా ఉన్న ధాన్యాన్ని వర్షం నుండి రక్షించేందుకు బరకాలు కప్పాలి. రెండు మూడు రోజులు ఎండబెట్టే అవకాశం లేకపోతే, కుప్పల్లో మొలక రాకుండా, రంగు మారకుండా ప్రతి క్వింటాకు 1 కిలో ఉప్పు, 20 కిలోల పొడి ఊక కలపడం ద్వారా రక్షణ పొందవచ్చని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.












