నీతిమాలిన పాలనతో పోగొట్టుకున్న అధికారం తిరిగి రాదని తెలిసీ.. జగన్‌రెడ్డి అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. దయామయుడి ముసుగులో మొసలి కన్నీరు కారుస్తూ మామిడి రైతుకు మద్దతంటూ బయలుదేరాడు. ఆయన దిగిపోవడమే రైతుకు కష్టమొచ్చినంత కపట నాటకాన్ని పబ్లిక్‌లో ప్రదర్శిస్తున్నారు. అసమర్థ జగన్ పాలనలో `నమ్ముకున్న నాగలే రైతు మెడకు ఉరి కొయ్యలయ్యాయన్న విషయం గుర్తులేనట్టే మాట్లాడుతుండటం మరీ విడ్డూరం! గద్దెనుంచి దించేసిందే ప్రజలు, రైతులన్న విషయాన్ని విస్మరించి.. రైతు పక్షపాతి ముసుగులో పొగాకు, మామిడి రైతుకు మద్దతు పేరిట సరికొత్త నాటకానికి తెరతీయడం ప్రజలు గ్రహించలేనిదేమీ కాదు. అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని తిరిగి.. ప్రజలు, రైతుల ముఖం చూడటానికే ఇష్టపడని పెద్దమనిషి `నేడు రైతులపట్ల మొసలి కన్నీరు కార్చడం జగన్‌కు అలవాటైన రాజకీయమే. ఐదేళ్లు అధికారంలోకి ఉండి మామిడి రైతుకు చేసిన మేలేమిటో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రైతు జీవితాన్ని నాశనం చేసి, మొత్తంగా సాగు రంగాన్నే సంక్షోభంలోకి నెట్టిన జగన్‌రెడ్డి.. ఉన్నపళంగా రైతు బాంధవుడి అవతారం ఎత్తితే.. అమాయక రైతులు ఆయనవెంట పరుగులు తీస్తారనుకోవడం అత్యాశే. 2019లోనూ రైతు సమస్యలపై కన్నీరు కార్చి.. గద్దెనెక్కగానే దగాకు పాల్పడిన జగన్‌రెడ్డి వాస్తవిక నైజం రైతాంగం మర్చిపోయేంత చిన్నదేం కాదు. లెక్కకు మిక్కిలిగా ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాల ఉసురు తగలడం వల్లే.. 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకూ నోచుకోని ఫలితం దక్కిందన్నది వాస్తవం!
జగన్ ఐదేళ్ల పాలనలో మామిడి రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. మామిడి పంటకు సరైన ధర లేదు. కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు లేవు. మార్కెట్ వ్యవస్థ కుప్పకూలింది. తూర్పుగోదావరి, నూజివీడు, చింతలపూడి, తిరువూరువంటి మామిడి పండే ప్రధాన ప్రాంతాల్లో రైతులు నష్టాలతో నిట్టూరుస్తుంటే.. జగన్ ప్రభుత్వం మౌనం వహించింది. ఎన్నిసార్లు ధరల కోసం రైతులు ఆందోళనలు చేసినా వారి వేదన, రోదన రోడ్డుపాలైంది. గతంలో మామిడి పంటకు ఎంత ధర ఇచ్చి రైతులను ఆదు కోన్నారో జగన్ చెప్పగలడా? మీ పాలనలో ఎప్పుడైనా కంపెనీలతో మాట్లాడి మామిడి రైతుకు మద్దతు ధర ఇవ్వాలని కోరారా? ఐదేళ్ల జగన్ పాలనలో రెండేళ్లు తోతాపురి ధరలు పడిపోయి రైతులు విలవిలలాడితే కనీసం పట్టించుకోని, పలకరించని, మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోని పెద్దమనిషి.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ మామిడి రైతుకు మద్దతుగా జిల్లాల పర్యటనలకు బయలెల్లడం సిగ్గుచేటు. మామిడి రైతు కష్టాన్ని ఏమాత్రం పట్టించుకోని జగన్.. ఇప్పుడు మద్దతు ధర పేరిట రాజకీయాలకు తెగబడటం మరో డ్రామాకు డేరా లేపడం లాంటిదే. జపించేంది రైతు ప్రయోజనం, తపించేది స్వప్రయోజనం.. ఇదీ జగన్ థియరీ. నిజంగా మామిడి రైతుకు మద్దతుగా వెళ్తే.. ఎమ్మెల్యేలు, ఎంపీలను తీసుకెళ్లాలి. అలాకాకుండా వేలమంది కొనుగోలు అనుయాయుల్ని వెంటేసుకుని.. దండయాత్రగా వెళ్లడంలోనే వైసీపీ అధినేత ఉద్దేశం అర్థమవుతుంది. వేలమందితో బల ప్రదర్శనకు దిగి.. శాంతి భద్రతల సమస్య సృష్టించి ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టాలన్న జగన్ కుటిల యత్నం సాగదుగాక సాగదు!!
చిత్తూరు జిల్లాలో మామూలుగానే దాదాపు 4 లక్షల టన్నుల వరకూ తోతాపురి రకం మామిడి దిగుబడి వస్తుంటుంది. కానీ ఈసారి అధిక దిగుబడిగా 5.5 లక్షల టన్నులు వచ్చినట్టు సమాచారం. డిమాండ్‌కు మించి దిగుబడి రావడం కూడా ధరలు తగ్గడానికి కారణమైంది. రైతు కష్టాన్ని పరిష్కరిస్తున్న ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి.. ఆ కష్టాన్ని రాజకీయ ఆయుధం చేసుకోవాలన్న జగన్ ఆలోచన హర్షించదగ్గది కాదు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే మామిడి రైతులకు అధిక మద్దతు ధర లభిస్తోంది. కొనుగోలు పరిమితిపై ఆంక్షలు పెట్టకుండా కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ అందిస్తోంది. ఫ్యాక్టరీలు రూ.5-6 చొప్పున ఇస్తున్నాయి. రైతులు 50, 100, 200 టన్నుల మామిడి కాయలు తెచ్చినా ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఇలా టన్నుకు రూ.4 వేల చొప్పున రైతు వంద టన్నులు తెచ్చినా రూ.4 లక్షల సబ్సిడీ రైతుకు అందిస్తుంది. ఏపీలో ఆంక్షలు లేవు. రైతులు ఎన్ని టన్నులు తోతాపురి తెచ్చినా సబ్సిడీ వర్తిస్తుంది. మామిడి రైతుల వేదన, రోదన అర్ధం చేసుకొన్న సీఎం చంద్రబాబు తోతాపురి మామిడికి కిలోకు రూ.4 సబ్సిడీ ప్రకటించి ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులకే రూ.200 కోట్ల వరకూ సబ్సిడీగా అందిస్తున్నారు. మార్కెట్ జోక్యం పథకం ద్వారా తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు రూ.130 కోట్లు విడుదల చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసి, మామిడి కొనుగోలుపై రోజువారీ సమీక్షలు చేస్తూ 50 వేలమంది పైగా రైతులనుంచి తోతాపురి కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం భరించే రూ.4తో రైతులకు రూ.12 ధర దక్కేలా చర్యలు చేపట్టారు. ఇదీ ప్రభుత్వం స్పందించాల్సిన తీరు. జగన్ ఐదేళ్ల పాలనలో కష్టంలోవున్న రైతు కోసం ఏరోజు కదిలొచ్చారో జగన్ చెప్పగలరా? ఈ ఏడాది మామిడి అధిక దిగుబడి రావడాన్ని అర్ధం చేసుకొన్న ముఖ్యమంత్రి.. జూన్‌నుండే మామిడి కొనుగోలుపై దృష్టి పెట్టారన్న విషయాన్ని జగన్ గ్రహించాలి.
కర్ణాటకలోనూ తోతాపురి రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. కానీ అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడానికి మొదట ముందుకు రాలేదు. తర్వాత కొనుగోలుకు ముందుకొచ్చినా.. కొనుగోలులో అనేక ఆంక్షలు పెట్టడంతో రైతులకు పూర్తిస్థాయిలో మేలు జరగ లేదు. కర్ణాటకలో పరిమితులతో కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో రైతునుంచి హెక్టారుకు ఐదు టన్నులు చొప్పున రెండు హెక్టార్ల వరకే సేకరిస్తున్నారు. రైతు వంద టన్నులు పండిరచినా పది టన్నులకే సబ్సిడీ అందిస్తున్నారు. అదే పొరుగునేవున్న తమిళనాడు ప్రభుత్వమైతే.. మామిడి రైతుల్ని అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుంచి కూడా ఎలాంటి సాయం అందించలేదు. అక్కడి రైతులు కూడా చేసేదేమీలేక వచ్చిన ధరకే అమ్ముకుంటున్నారు. ఏపీలో ఆంక్షలు లేకుండా మామిడి కొనుగోలు చేస్తూ.. రైతులను ఆదుకొంటున్న కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడానికి జగన్ బయలుదేరడం.. రైతుకు అన్యాయం చేయడానికే. మామిడి సమస్యకు పరిష్కారం చూపిందీ, చూపగలిగేదీ చంద్రబాబు సర్కారే. రైతులను ఉద్దరించానని జగన్ చెప్పుకుంటే సరిపోదు, జనం చెప్పుకోవాలి. అది ఈ జన్మలో సాధ్యం కాదు!
నీరుకొండ ప్రసాద్