- హోం మంత్రి అనిత పిలుపు
- ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
- పోలీసు, న్యాయవ్యవస్థల సమన్వయం కీలకం
- అందరం కలిసి బాధితులకు అండగా నిలుద్దాం
అమరావతి (చైతన్యరథం): సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులపై అత్యాచారాలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. విజయవాడలో డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. న్యాయవాదులందరినీ ఒకచోట చేర్చి సదస్సు నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో మహిళలు ఎక్కువగా ఉండటం శుభపరిణామమన్నారు. న్యాయవిచారణ వేగంగా పూర్తి చేసేందుకు ఇవాళ తొలి అడుగు పడిరది. పోలీస్, లాయర్ వృత్తిలోకి రావడం గొప్ప విషయం. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దొంగలు ఇప్పుడు చాలా తెలివిమీరి పోయారు. నేరస్థులను పట్టుకోవడానికి మనం చాలా అప్ గ్రేడ్ అవ్వాలి. టెక్నాలజీ ఉపయోగించుకుని నేరాలను నియంత్రించాలి.
ఆన్ లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కలిగించడం చాలా ముఖ్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు చిన్న విషయాలను కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. పోలీస్, న్యాయ వ్యవస్థల సమన్వయంతో చాలా కేసులు ఛేదించొచ్చు. ఎఫ్‌ఐఆర్, ఛార్జ్ షీట్ నమోదైన నాటి నుంచి లీగల్ వ్యవస్థ సహకరించాలి. సమాజానికి ధైర్యమిచ్చే వారు పోలీసులు, ప్రజలకు న్యాయం చేసే వారు న్యాయవాదులు. ఎంతటివారైనా కోర్టుకు వస్తే చేతులు కట్టుకుని నిల్చునేంతటి గౌరవం న్యాయ వ్యవస్థకుంది. ఆధారాలిచ్చేది పోలీసులు..శిక్షపడేలా చేయాల్సింది న్యాయమూర్తులు, న్యాయవాదులే. ఉయ్యాల్లో ఉన్న పసిపాపల మీద కూడా అత్యాచారాలు జరుగుతుండడం చాలా దిగ్భ్రాంతికరం. నేరస్థుడు దొరికినా, నేరం అంగీకరించినా శిక్ష అమలు చేసే దాకా పడే కష్టం మామూలుదికాదు. దొంగ, నేరస్థుడు దొరికినా చట్టప్రకారమే శిక్షించాల్సి రావడం వల్ల కేసు పూర్తయ్యేదాకా ప్రతి విషయం కీలకమే. విజయనగరం జిల్లాలో రెండు కేసుల్లో నిందితులకు 6నెలల్లోపే శిక్ష వేయించాం. న్యాయవ్యవస్థకు అవసరమైన వనరులు, వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.
సత్వర న్యాయమే.. అసలైన న్యాయం
నేడు ప్రతి వ్యక్తి స్వయంగా తనకు తాను నిఘా పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఉంది. దొంగతనాలు, నేరాల నియంత్రణకోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. ప్రోటోకాల్ లేకుండా ట్రాఫిక్ లో ప్రయాణించి ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశా. టెక్నాలజీ ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గించడం సులభం. అనంతపురంలో ప్రియుడు.. ప్రియురాలి నంబర్‌ని బ్లాక్ చేశాడని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే అనే విషయం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏ కష్టం కలిగినా కాపాడేది పోలీసులే అన్న ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలి. ఫాస్ట్ ట్రాక్, ప్రత్యేక కోర్టులు, పోస్కో కోర్టులు ఎన్నో ఉన్నాయి. తొందరగా న్యాయం చేయడమే అసలైన న్యాయం.
బాధితులకు అండగా నిలవడానికి మనమందరం ఏకమవుదాం. చిన్న చిన్న ఇబ్బందులతో చేయాల్సిన మంచి పని చేయకుండా ఎవరూ ఎక్కడా ఆగిపోకూడదు. న్యాయవాదులు కోటు వేసుకుని కోర్టులోకి వెళ్లారంటే మీ పేరు కాదు మీ పని కనబడాలి. మీది వృత్తి కాదు సామాజిక బాధ్యత. జీవితంలో ఏదో కోల్పోయి మీ వద్దకు వచ్చిన వారిని అక్కున చేర్చుకోండి. సమాజ గౌరవం, ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడే దిశగా ముందుకెళ్లాలి. నేరం రుజువైతే బెయిల్ రాకముందే శిక్షపడే స్థాయిలో పని చేయాలి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకుసాగుదామని హోం మంత్రి అనిత పిలుపు ఇచ్చారు.