ఆస్ట్రేలియా (బ్రిస్బేన్): జేమ్స్ కుక్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ సస్టయినబుల్ ట్రోఫికల్ ఫిషరీస్ అండ్ అక్వా కల్చర్ విభాగం ప్రొఫెసర్ క్యాల్ జెంజర్‌తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఉష్ణమండల ఆక్వాసాగులో కీలకమైన బ్లాక్ టైగర్, బారాముండి రకాల రొయ్యల జన్యుపరమైన మెరుగుదల పరిశోధనలకు ప్రొఫెసర్ జెంజర్ నాయకత్వం వహించారు. ఆక్వాసాగు సామర్థ్యాన్ని పెంచే జన్యుసంబంధ సాధనాల అభివృద్ధికి కృషిచేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యలు, చేపల పెంపకం సామర్థ్యాన్ని పెంచేందుకు సీఎస్ టీఎఫ్‌ఏ ద్వారా ఆక్వాకల్చర్ జెనెటిక్స్ నైపుణ్యాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. బ్లాక్ టైగర్ రొయ్యలతో భారత్‌లో ప్రధానంగా ఉత్పత్తి చేసే ఆక్వా రకాల్లో వ్యాధి నిరోధకత, వృద్ధిరేటు కోసం జన్యుపరమైన మెరుగుదలకు కృషి చేయాలని కోరారు. ‘‘పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి వాటర్ రీసైక్లింగ్, ఫీడ్ ఆప్టిమైజేషన్‌ను ప్రోత్సహించండి. ఆధునిక ఆక్వా సాగు పద్ధతులు, జన్యుపరమైన ఎంపిక, స్థిరమైన నిర్వహణ పద్ధతులపై ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల కోసం శిక్షణ కార్యక్రమాలు రూపొందించండి. ఎంపిక చేసిన బ్రీడ్ల ద్వారా ఉత్పాదకత పెంపుదలకు మీరు అభివృద్ధి చేసిన జెనెటిక్ టూల్స్‌ను మా ఆక్వా రైతులకు అందించండి. ఆక్వాసాగులో నష్టాలను తగ్గించి ఉత్పత్తిని స్థిరీకరించడానికి ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి సహకరించండి’’ అని మంత్రి లోకేష్ కోరారు.













